Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్తవ్యస్తంగా సాఫ్ట్వేర్ల ఎంపిక
- అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అతి తక్కువ వేతనాలు
- కాగ్ నివేదిక వెల్లడి
గౌహతి : అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) అప్డేట్ కార్యక్రమంలో అనేక తప్పులు జరిగాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గుర్తించింది. అప్డేట్కు ఉపయోగించిన సాఫ్ట్వేర్ ఎంపికలోనూ, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లించడంలోనూ అనేక వైరుద్యాలున్నాయని పేర్కొంది. ఈ నెల 24న అసోం అసెంబ్లీకి కాగ్ నివేదికను సమర్పించారు. ఎన్నార్సీ అప్డేట్ కోసం ఉపయోగించాల్సిన కోర్ సాఫ్ట్‌వేర్‌కు బదులుగా వేరే 215 సాఫ్ట్వేర్లను ఉపయోగించారని కాగ్ తెలిపింది. సరైన ప్రణాళిక లేకుండా ఎన్నార్సీ అప్డేట్ జరిగిందని నివేదిక విమర్శించింది. నేషనల్ టెండరింగ్ ప్రక్రియను అనుసరించకుండా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సంస్థల ఎంపిక జరిగిందని తెలిపింది. ఇలాంటి సాఫ్ట్వేర్ల వినియోగంతో డేటా ట్యాంపరింగ్‌కు గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. సరైన కసరత్తు లేకుండా కార్యక్రమం జరగడం వల్ల ఎన్నార్సీ అప్డేట్ ప్రాజెక్టు వ్యయం రూ.288.18 కోట్లు నుంచి రూ.1,602.66 కోట్లకు పెరిగిందని విమర్శించింది.
అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 64 శాతం తక్కువ వేతనాలు
ఈ ప్రాజెక్టులో కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అప్పటి ఎన్ఆర్సి కోర్డినేటర్ ప్రతీక్ హజేలాపై చర్యలు తీసుకోవడంతోపాటు సిస్టమ్ ఇంటిగ్రేటర్ విప్రో లిమిటెడ్‌పై జరిమానా విధించాలని కాగ్ సిఫారసు చేసింది. 'కనీస వేతనాల కంటే తక్కువగా ఆపరేటర్లకు జీతాలు చెల్లించారు' అని కాగ్ తెలిపింది. ఎన్నార్సీ సమన్వయ కమిటీ ఆమోదించిన రేటు కంటే అవుట్సోర్సింగ్ సిబ్బందికి 45.59 నుంచి 64.27 శాతం వేతనాలు తక్కువగా చెల్లించారని కాగ్ తెలిపింది. కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా సిస్టమ్ ఇంటిగ్రేటర్, లేబర్ కాంట్రాక్టర్ విప్రో లిమిటెడ్‌కు రూ.155.83 కోట్ల అదనపు ప్రయోజనం లభించిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఎన్నార్సీ మాజీ కోర్డినేటర్ ప్రతీక్ హజేలా అక్రమాలకు పాల్పడ్డారని తరువాత ఆ స్థానంలోకి వచ్చిన హితేష్ దేవ్ శర్మ కూడా ఆరోపించారు. హజేలా అవినీతికి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని అస్సాం విజిలెన్స్, యాంటీ కరప్షన్ విభాగంలో హితేష్ దేవ్ శర్మ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తమ భారత పౌరసత్వాన్ని నిరూపించుకున్న 1971, మార్చి 25కు ముందు నుంచి అస్సాంలో నివసిస్తునవారు లేదా వారి వారసులతో అసోం ఎన్నార్సీ ని అప్డేట్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్టేట్ కోర్డినేటర్‌గా ప్రతీక్ హజేలా నియమించబడిన తరువాత 2013 అక్టోబర్ నుంచి అసోం ఎన్నార్సీ అప్డేట్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. అప్డేట్ చేసిన అసోం ఎన్నార్సీ ముసాయిదాను 2019 ఆగస్టులో ప్రచురించారు.