Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ పనులకు డిమాండ్ తగ్గిందంటున్న కేంద్రం
- 2018-19లో ఉపాధి చూపాలన్న 5.8 కోట్ల కుటుంబాలు
- 2022-23లో 6.24 కోట్ల కుటుంబాల నుంచి దరఖాస్తు
- నిధులు సమయానికి విడుదల చేయకుండా రాష్ట్రాలపై కక్షసాధింపు
- కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.4447 కోట్లు
ఉపాధిలేక పేదలు పొట్టచేతపట్టుకుని వలసలు వెళ్తున్నారు. కూటికోసం కోట్లాదిమంది కేంద్ర సర్కార్ ను బతిమాలుతున్నా కనికరించటంలేదు. ఉపాధిహామీ చట్టం కిందనైనా కడుపునింపుకోవాలనుకుంటున్న బడుగుల ఆశలపై మోడీ సర్కార్ నీళ్లు చల్లుతోంది. పార్లమెంట్ సాక్షిగా ఉపాధి హామీ పనులకు డిమాండ్ లేదంటూ పచ్చి అబద్ధాలను పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయికి, కేంద్రం లెక్కలకు పొంతన లేదంటూ కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : మనదేశంలో ఎన్నో కోట్లమంది కుటుంబాలకు పని కల్పిస్తున్న పథకం 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం'(నరేగా). తమకు పని కల్పించాలని గ్రామాల్లో పేద కుటుంబాలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. అయితే కేంద్రం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. నిధుల విడుదల జాప్యం చేస్తూ రాష్ట్రాల్ని ఇబ్బందిపెడుతోంది. ఉపాధి హామీలో పనికి డిమాండ్ తగ్గిపోయిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అబద్ధాలు చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, నరేగాలో పని డిమాండ్ క్రమంగా తగ్గుముఖం పట్టిందని (డిసెంబర్ 14న) రాజ్యసభలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యల్ని సామాజిక కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు తప్పుబట్టారు. నిజానికి గతంతో పోల్చితే నరేగా కింద పని డిమాండ్ పెద్ద ఎత్తున ఉందని వారు చెబుతున్నారు. గత రెండేండ్ల క్రితం నాటి (కరోనా సంక్షోభం రాకముందు)తో పోల్చితే పని కావాలని డిమాండ్ చేసిన కుటుంబాల సంఖ్య కోట్లల్లో పెరిగిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.
రాజ్యసభలో నిర్మలా సీతారామన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2020-21లో 8.55 కోట్ల కుటుంబాల నుంచి పని డిమాండ్ ఏర్పడగా, 2021-22లో 8.05 కోట్ల కుటుంబాల నుంచి పని డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. పని డిమాండ్ స్వల్పంగా 5.8శాతం తగ్గుదల నమోదైందన్నారు. ఇదే ట్రెండ్ 2022-23లోనూ కొనసాగిందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి 6.24 కోట్లకుపైగా కుటుంబాలు పని కోసం డిమాండ్ చేశారని తెలిపారు. రెండేండ్ల క్రితంనాటితో పోల్చితే నరేగా పథకంలో పని డిమాండ్ తగ్గుముఖం పడుతోందన్నారు. నరేగా పథకంలో కీలకమైన గణాంకాల్ని తమకు అనుకూలంగా కేంద్రం అన్వయించుకుంటోందని, వాస్తవంగా పని డిమాండ్ భారీ ఎత్తున పెరిగిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూసినా, 2019-20తో పోల్చితే ప్రస్తుతం పని కావాలని కోరుతున్న కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
పెండింగ్‌లో వేల కోట్లు
ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతనాలు రాష్ట్రాల వారీగా (30 నవంబర్, 2022) చూస్తే, పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా రూ.2744 కోట్లు (68శాతం), కేరళలో రూ.456 కోట్లు (10.2శాతం), తమిళనాడులో రూ.210 కోట్లు (4.7శాతం), తెలంగాణలో దాదాపు రూ.140 కోట్లు నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. నిధుల వ్యయంపై ఫిర్యాదుల రావటంతో ప.బెంగాల్‌కు నిధుల విడుదల ఆపేశామని కేంద్రం చెబుతోంది. మిగతా రాష్ట్రాలకు నిధుల విడుదల ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది మాత్రం చెప్పటం లేదు.
ప్రతిఏటా పెరుగుతోంది..
2006లో నాటి యూపీఏ ప్రభుత్వం నరేగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజులపాటు వేతనంతో కూడిన ఉపాధి కల్పించాలి. దీనికి సంబంధించి గణాంకాలు, ఇతర వివరాల్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్సైట్లో విడుదల చేస్తోంది. ఈ గణాంకాల్ని ఆధారంగా చేసుకొనే నిర్మలా సీతారామన్ పని డిమాండ్ తగ్గిందని పార్లమెంట్లో వెల్లడించారు. కానీ వాస్తవంగా మార్చి 2018తో పోల్చితే డిసెంబర్ 2022లో పని డిమాండ్ పెరిగిందని గణాంకాలే చెబుతున్నాయి. లాక్డౌన్ సమయంలో, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు పట్టణాల్లో కోట్లమంది ఉపాధి కోల్పోయారు. వారంతా తమ తమ గ్రామాలకు తిరిగివచ్చారు. దీంతో 2020-21, 2021-22లో పని డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ నియంత్రణలేవీ లేవు. గ్రామాలకు తిరిగి వచ్చినవారంతా పట్టణాలకు వెళ్లిపోయారు. అయినా పని డిమాండ్‌లో పెద్దగా తగ్గుదల లేదన్నది రాజకీయ విశ్లేషకులు వాదన.
మరింత పెరుతుంది : ఎస్.విజరు రామ్, పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ
కరోనా మొదటి వేవ్‌లో (2020-21) నరేగా పథకంలో పని డిమాండ్ కుటుంబాల విభాగంలో 38.7శాతం, వ్యక్తుల విభాగంలో 42.7శాతం పైగా ఎక్కువగా నమోదైంది. మొదటివేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌లో పని డిమాండ్ 5.8 శాతం (కుటుంబాలు) పెరిగింది. ప్రతిఏటా పని డిమాండ్ పెరుగుతోందని, కోవిడ్ నిబంధనలు పోయినా పని డిమాండ్ తగ్గలేదని 'పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ' పరిశోధకుడు ఎస్.విజరు రామ్ చెబుతున్నారు. ''ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా మూడు నెలల సమయ ముంది. డిసెంబర్‌నాటికి 6.24 కోట్ల కుటుంబాల నుంచి పని డిమాండ్ ఏర్పడింది. మరో మూడునెలల్లో మరింత పెరుగుతుంది'' అని చెప్పారు.