Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ రివల్యూషన్, సైనిక రికార్డులు పంపట్లేదు..
- 1962, 1965, 1971 యుద్ధ రికార్డులు లేవు : నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ : గ్రీన్ రివల్యూషన్, భారత సైన్యం, యుద్ధ చరిత్రకు సంబంధించి అరుదైన రికార్డులను భద్రపర్చటంలో మోడీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని విమర్శలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద యుద్ధాలు 1962, 1965, 1971లకు సంబంధించి చరిత్ర రికార్డులు తమ వద్ద లేవని 'నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా' (ఎన్ఏఐ) తాజాగా ప్రకటించింది. తమ వద్ద ఉన్న వర్గీకరించని, చరిత్ర రికార్డులు ఎన్ఏఐకు పంపాలని కేంద్రంలోని ఆయా ప్రభుత్వ శాఖలను పలుమార్లు కోరినా సరైన స్పందన రావటం లేదని సంబంధిత అధికారులు వాపోయారు. పాలనా సంస్కరణలో భాగంగా ప్రభుత్వ రికార్డులను ఎన్ఏఐకు పంపాలని కేంద్ర క్యాబినెట్, పాలనా సంస్కరణల కార్యదర్శులు కేంద్ర మంత్రిత్వశాఖలకు లేఖలు రాశారు. ఈనేపథ్యంలో రికార్డులు తమకు బదిలీ చేయటంపై ఎన్ఏఐ పై విధంగా స్పందించింది. వ్యవసాయ దిగుబడి పెంచడానికి కారణమైన గ్రీన్ రివల్యూషన్, పలు యుద్ధాలకు సంబంధించి వర్గీకరించని సమాచారమూ తమకు బదిలీ చేయలేదని ఎన్ఏఐ సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. పలుమార్లు కోరినా కేంద్రం, కేంద్ర మంత్రిత్వశాఖలు రికార్డులు పంపటం లేదని వెల్లడించింది. రక్షణ శాఖ 1960 నుంచి సమాచారాన్ని పంచుకోవట్లేదని పేర్కొన్నది. దాంతో భారత దేశం ఎదుర్కొన్న ముఖ్యమైన యుద్ధాలు, వాటి చరిత్ర రికార్డులు తమ వద్ద లేవని, రక్షణ శాఖ ఇప్పటివరకూ 475 ఫైల్స్ మాత్రమే తమకు పంపిందని, ఇవి మాత్రమే తమ ఆధీనంలో ఉన్నాయని మీడియాకు పంపిన ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వ్యవహారాల్లో తిరిగి ఉపయోగపడతాయన్న ఆలోచనతోనైనా చరిత్ర రికార్డులు ఎన్ఐఏ వద్ద భద్ర పర్చాల్సి ఉంటుందని, ఇలా చేయటం అత్యంత ముఖ్యమైందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సామాజిక న్యాయం, పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి, మహిళలు, శిశు సంక్షేమం, ఆహారం, వినియోగదా రుల సంబంధాలు..మొదలైన శాఖలు తమ వద్ద ఉన్న చారిత్రక రికార్డులను తమకు ఇవ్వట్లేదని ఎన్ఏఐ డైరెక్టర్ జనరల్ చందన్ సిన్హా తెలిపారు. ''కేంద్ర ప్రభుత్వంలో 151 మంత్రిత్వ శాఖలున్నాయి.
అయితే ఎన్ఏఐ వద్ద కేవలం 64 ప్రభుత్వ ఏజెన్సీలు, 36 మంత్రిత్వశాఖల రికార్డులు మాత్రమే ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి సాధించేందుకు కారణమైన 'గ్రీన్ రివల్యూషన్' రికార్డులు కూడా ఎన్ఏఐ వద్ద లేవు. భారత సైన్యానికి చెందిన 1962, 1965, 1971 యుద్ధ చరిత్ర రికార్డులు మా వద్ద లేవు'' అని చెప్పారు. అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ రికార్డులను జాతీయ ఆర్కైవ్కు అందజేయటమూ ప్రభుత్వ పాలనలో ముఖ్యమైన అంశమని అన్నారు.