Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తగిన ప్రాతినిథ్యం ఉండాలి : పార్లమెంటరీ ప్యానెల్
- హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం 65ఏండ్లకు పెంచాలి
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థపై పట్టు బిగించేందుకు మోడీ సర్కార్ అనేక ప్రయత్నాలు ప్రారంభించింది. కొలీజియం వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా న్యాయవ్యవస్థ పనితీరును సమీక్షించే ప్రయత్నం చేసింది. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ మోడీ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ కీలక సమావేశం నిర్వహించింది. న్యాయశాఖ విభాగం కార్యదర్శి ఎస్.కె.జి.రహతేను పిలిచి పలు ప్రశ్నలు సంధించింది. సభ్యుల సందేహాలపై వివరణ కోరింది. ఈనేపథ్యంలో న్యాయవ్యవస్థలో సామాజిక వైవిధ్యం లోపించిందని, ఈ లోటును సరిదిద్దడానికి కేంద్రం పలు చర్యలు చేపట్టాలని ప్యానెల్ సిఫారసులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు చెందిన వారి ప్రాతినిథ్యం న్యాయవ్యవస్థలో చాలా తక్కువగా ఉందని తెలిపింది. గురువారంనాటి సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన విషయాలు తాజాగా మీడియాకు విడుదలయ్యాయి. మొత్తంగా కొలీజియం వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని, న్యాయమూర్తుల నియామకాన్ని పార్లమెంటరీ ప్యానెల్ తప్పుబట్టింది. జడ్జీల నియామకంలో సామాజిక వైవిధ్యం ఉండాలని, హైకోర్టు న్యాయమూర్తుల పదవీకాలం 62 ఏండ్ల నుంచి 65ఏండ్లకు పెంచాలని సూచించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయమూర్తుల నియామకాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై రహతేతో ప్యానెల్ చర్చించింది. అలాగే సుప్రీంకోర్టు ప్రాంతీయ ధర్మాసనాల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను తెలపాలని కోరింది. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారి ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉందని ప్యానెల్‌లోని ఒక సభ్యుడు అన్నారు. ''కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2018-నవంబర్ 2019 మధ్యకాలంలో మొత్తం 537 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కొలీజియం చేపట్టింది. ఆ ఏడాది నియామకాల్లో 424 (79శాతం)మంది జనరల్ కేటగిరి, 57 మంది (11శాతం) ఓబీసీ, 15 మంది (2.8శాతం) ఎస్సీ, 7గురు (1.3శాతం) ఎస్టీ, 14మంది (2.6శాతం) మైనార్టీ వర్గాలకు చెందినవారున్నారు. దీనినిబట్టి హైకోర్టుల్లో ఆయా వర్గాల ప్రాతినిథ్యం తక్కువగా ఉందని తెలుస్తోంది. దీనిని సరిదిద్దాలని ప్రభుత్వానికి ప్యానెల్ సభ్యులు సూచిస్తున్నారు'' అని అన్నారు.
అంతా కొలీజియం ఇష్టం
పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో ఎంపీలు, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చెప్పినదాన్ని బట్టి, జడ్జీల నియామకంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు. కొలీజియమే ఎంపిక చేస్తోంది. కొలీజియం ఇచ్చే న్యాయమూర్తుల పేర్ల జాబితాకు కేంద్రం ఓకే చేప్పాల్సి వస్తోంది. జడ్జీల నియామకంలో రిజర్వేషన్లు లేకపోయినా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రాతినిథ్యం ఎలా పెంచాలన్నదానిపై పార్లమెంటరీ ప్యానెల్ చర్చించింది..అని ప్యానెల్‌లోని ఎంపీ ఒకరు మీడియాకు తెలిపారు. గురువారంనాటి ప్యానెల్ సమావేశానికి 16 మంది ఎంపీలు హాజరయ్యారు. స్టాండింగ్ కమిటీ చైర్మెన్ సుశీల్‌కుమార్ మోడీ, డీఎంకే ఎంపీలు పి.విల్సన్, ఎ.రాజా, ఎన్సీపీ ఎంపీ వందనా చావన్, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనెర్జీ, బీజేపీ ఎంపీ మహేష్ జెట్మ లానీ తదితరులు సమావేశానికి హాజరైనవారిలో ఉన్నారు.
ఆస్తులు ప్రకటించాలి..
రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్ వలె జడ్జీలు కూడా తమ ఆస్తుల్ని అధికారికంగా ప్రకటించాలనే అంశం ప్యానెల్లో ప్రస్తావనకు వచ్చింది. తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని ఎంపీలు నిర్ణయించారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీకాలం 62 నుంచి 65ఏండ్లకు పెంచాలని సూచించింది. అయితే ఈ సూచనను కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి తోసిపుచ్చారని సమాచారం. దీనివల్ల మంచి ప్రతిభ గల న్యాయవాదులు సుప్రీంకోర్టుకు రావడా నికి ఇష్టపడరని కార్యదర్శి అన్నట్టు తెలిసింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీకాలం కూడా పెంచాలనే డిమాండ్ తెరపైకి వస్తుందని, ట్రిబ్యునల్స్‌లో సమస్యలు తలెత్తుతా యని కేంద్రం భయపడుతోందని కార్యదర్శి వివరించారట. సుప్రీంకోర్టు ప్రాంతీయ ధర్మాసనం దక్షిణా దిన ఏర్పాటుచే యాలనే అంశం డీఎంకే ఎంపీ పి.విల్సన్ లేవనెత్తగా, ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉందని, విచారణ పెండింగ్‌లో ఉందని సభ్యులకు న్యాయశాఖ కార్యదర్శి తెలిపారు.