Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యోగి ఆదిత్యనాథ్‌కు ఒక రివాల్వర్..రైఫిల్
- అత్యంత ధనిక సీఎం జగన్
- తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 64 క్రిమినల్ కేసులు
- సిక్కిం సీఎం తమాంగ్కు ముగ్గురు భార్యలు
- ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా వార్తా కథనం
న్యూఢిల్లీ : అర్థబలం, అంగబలంతో బడా కార్పొరేట్ల అండదండలతో రాజకీయాల్ని శాసిస్తున్న రోజులివి. ప్రజా ప్రతినిథుల సమస్త విషయాలూ ఎన్నికల కమిషన్‌కు తెలుస్తుంది కదా! అనుకోవటం అమాయకత్వం. ఎన్నికల సమయంలో ఎన్నో విషయాల్ని దాస్తూ..అభ్యర్థులు రాజకీయ ఆటకు తెరలేపుతారు. ఎన్నికల అఫిడవిట్ సమర్పించే సమయంలో సదరు అభ్యర్థి తన గురించిన సమస్త వివరాలు ఈసీకి సమర్పించాలనేది నిబంధన. ఈ అఫిడవిట్ ప్రకారం ఎవరు అత్యంత ధనిక సీఎం? ఎవరిపై అత్యధికంగా క్రిమినల్ కేసులున్నాయి? ఉన్నత చదువులున్న సీఎం ఎవరు? అన్న వివరాలతో తాజాగా ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం వెలువరించింది. ఈ వార్తా కథనం ప్రకారం మనదేశంలో మొత్తం 30 రాష్ట్రాలకు సీఎంలున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ సీఎం వై.యెస్.జగన్మోహన్రెడ్డి (రూ.373 కోట్లు) అత్యంత ధనవంతుడని తేలింది. ఆయన తర్వాత స్థానాల్లో అరుణాచల్ సీఎం పెమా ఖందు (రూ.132 కోట్లు), ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ (రూ.63 కోట్లు) ఉన్నారు. తనకు రూ.13.72 కోట్ల ఆస్తులున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఆయుధాలు
8 మంది సీఎంలకు స్వంత ఆయుధాలున్నాయి. యోగి ఆదిత్యనాథ్, ఏక్నాథ్ షిండే, హేమంత్ సోరెన్, పుష్కర్‌సింగ్ ధామీ, ఎన్.బీరేన్ సింగ్, భగవంత్ మాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్..వ్యక్తిగత ఆయుధాల్ని కలిగివున్నారు. సీఎం తమాంగ్కు రూ.3 లక్షలు విలువజేసే బోర్ రివాల్వర్ ఉంది. ఏక్నాథ్ షిండేకు రూ.5లక్షల విలువజేసే ఒక రివాల్వర్, ఒక పిస్టోల్ ఉంది. ఒక రివాల్వర్, ఒక రైఫిల్..రెండు ఆయుధాలున్న సీఎం యోగి ఆదిత్యనాథ్. జార్ఖండ్ సీఎం సోరెన్, ఉత్తరాఖండ్ సీఎం ధామీలకు స్వంత రైఫిల్ ఉంది. తమ వద్ద రూ.20వేలు విలువజేసే తుపాకీ ఉందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రూ.5,500 విలువజేసే రివాల్వర్ ఉందని శివరాజ్‌సింగ్ చౌహన్ అఫిడవిట్లో పేర్కొన్నారు.
జీవిత భాగస్వామి
సీఎంల జీవిత భాగస్వామి వివరాలకు వస్తే, అత్యధికమంది బిజినెస్ రంగంలో ఉన్నారు. మొత్తం 30మంది సీఎంలలో 12మంది సీఎంలు..తన భార్య వృత్తి 'ఔత్సాహిక పారిశ్రామికవేత్త'గా పేర్కొన్నారు. హిమంత్ బిశ్వ శర్మ, సోరన్, చౌహాన్, ఏక్నాథ్ షిండేల ఆస్తుల కన్నా వారి జీవిత భాగస్వామి ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అసోం సీఎం శర్మ ఆస్తుల విలువ రూ.కోటీ 4 లక్షలుకాగా, ఆయన సతీమణి రింకీ భూయాన్ శర్మకు రూ.11 కోట్లకుపైగా విలువజేసే ఆస్తులున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్‌కు రూ.2.6 కోట్లు, ఆయన భార్యకు రూ.3.9కోట్ల ఆస్తులున్నాయి. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, నవీన్ పట్నాయక్, యోగి, ఎన్.రంగస్వామి, మమతా బెనర్జీ...అవివాహితులు. ముగ్గురు భార్యలున్న ఏకైక సీఎం తమాంగ్. వారంతా ప్రభుత్వ ఉద్యోగులే.
క్రిమినల్ కేసులు
దేశంలోనే అత్యధిక సంఖ్యలో క్రిమినల్ కేసులు (64) నమోదైన సీఎంగా కేసీఆర్ పేరు ముందుంది. ఆయన తర్వాత స్థానంలో ఎం.కె.స్టాలిన్ (47 కేసులు), జగన్మోహన్ రెడ్డి (38 కేసులు) ఉన్నారు. అఫిడవిట్లో పేర్కొన్నదాని ప్రకారం ఒక్క క్రిమినల్ కేసూ లేని సీఎంలలో 10 మంది బీజేపీకి చెందినవారున్నారు. అవినీతి కేసులో దోషిగా తేలిన ఏకైక సీఎం తమాంగ్. ఈ కేసులో ఆయన ఒక ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు.
విద్యార్హతలు
ఫిలాసఫీలో ఒక డాక్టరేట్, ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), లా డిగ్రీలతో అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ అత్యధిక సంఖ్యలో డిగ్రీలున్న సీఎంగా మిగతా వారికంటే ముందున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేయగా, అరవింద్ కేజ్రీవాల్, బసవరాజ్ బొమ్మై ఇద్దరూ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. హైస్కూల్ చదువు కూడా పూర్తిచేయలేదని మహారాష్ట్ర సీఎం షిండే తెలిపారు. కేసీఆర్, స్టాలిన్, అశోక్ గెహ్లాట్, పినరయ్ విజయన్, ఖట్టర్, ఆదిత్యనాథ్, ధామీ, మమతా బెనర్జీ..స్వంత వాహనం లేదని పేర్కొన్నారు. ఒక బీఎండబ్ల్యూ, మూడు స్కార్పియోలున్నాయని సీఎం జగన్ ప్రకటించారు. రూ.కోటిన్నర విలువజేసే ఏడు వాహనాలున్నాయని ఖందు తెలిపారు. వారసత్వంగా సంక్రమించిన స్థిరాస్థి లేదని పేర్కొనవారిలో సీఎం కేసీఆర్, షిండే, బొమ్మై, పటేల్, చౌహాన్లున్నారు.