Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంచి ఉన్న మాంద్యం భయాలు
- మొండి బాకీలు పెరగొచ్చు
- రుణాల జారీలో స్తబ్దత
- లాభదాయకత తగ్గొచ్చు : ఆర్బీఐ
న్యూఢిల్లీ : భారత బ్యాంక్‌లు తీవ్ర అనిశ్చితిలోకి జారే అవకాశాలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేసింది. కరోనా కాలంలోనూ భారత బ్యాంక్‌లు అధిక మూలధన నిల్వలు, మెరుగైన ఆస్తుల నాణ్యతతో మహమ్మారిని ఎదుర్కొని ఉండవచ్చు.. కానీ మున్ముందు అవి చాలా అనిశ్చితిని ఎదుర్కోవచ్చని ఆర్బీఐ మంగళవారం ఓ రిపోర్టులో పేర్కొంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, కఠినమైన ద్రవ్య పరపతి, నగదు ఆంక్షలు తదితర అంశాలు బ్యాంక్‌ల లాభదాయకత, ఆస్తుల నాణ్యతను దెబ్బతీయనున్నాయని 'ట్రెండ్ అండ్ ప్రొగ్రెస్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2021-22' రిపోర్టులో ఆర్బీఐ పేర్కొంది.
''2022లో ప్రపంచ వృద్థి క్షీణించడం, 2023లో మాంద్యం పెరిగే అవకాశాలతో ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో రుణాల వృద్థి క్రమంగా తగ్గిపోతుంది. తద్వారా బ్యాంక్ లాభదాయకత పడిపోనున్నది. ఇప్పటి వరకు అధిక మూలధనం, నగదు నిల్వలు ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను స్థిరంగా ఉంచడానికి సహాయపడ్డాయి. అయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కష్టతరమైన రుణాల జారీతో భయాలు పెరిగాయి.'' అని ఆర్బీఐ తన రిపోర్టులో పేర్కొంది.
రిపోర్టులోని మరిన్ని వివరాలు.. ''అభివృద్థి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల నుంచి మూలధన ప్రవాహాల పెరుగుదలకు తోడు మారకం విలువలు పడిపోవడం, రెవెన్యూ నష్టాలు, సూక్ష్మ గణాంకాల్లో అంధకారం తదితర అంశాలు బ్యాంక్‌లకు సవాళ్లుగా మారనున్నాయి. భారతీయ బ్యాంక్‌లు ఏడేండ్ల తర్వాత తొలిసారి 2021-22లో బ్యాలెన్స్ షీట్లలో రెండంకెల వృద్థిని నమోదు చేశాయి. సంవత్సరం ప్రథమార్ధంలో రుణాల జారీ వృద్థి పదేండ్ల గరిష్ట స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణం. 2017-18లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌ల స్థూల నిరర్థక ఆస్తులు తీవ్ర స్థాయికి చేరగా.. క్రమంగా తగ్గుతూ 2022 సెప్టెంబర్ ముగింపు నాటికి 5 శాతానికి తగ్గాయి. వరుసగా రద్దు చేసిన మొండి బాకీల నేపథ్యంలో బ్యాంక్‌ల ఆస్తుల నాణ్యత పెరిగింది. వాణిజ్య బ్యాంక్‌లు 2021-22లో మెరుగైన ఆదాయం, తక్కువ వ్యయాలతో ఎక్కువ లాభదాయకతను సాధించాయి. అర్బన్ కో- ఆపరేటివ్ బ్యాంక్ (యూసీబీ)ల్లోనూ మూలధన నిల్వలు పెరిగాయి. మొండి బాకీలు తగ్గాయి. లాభాలు పెరిగాయి. 2021-22లో బ్యాంకింగేతర విత్త సంస్థలు సౌకర్యవంతమైన నగదు నిల్వలు, తగిన కేటాయింపులు, బలమైన మూలధన స్థితిని కలిగి ఉన్నాయి.