Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తోపులాటలో ఎనిమిది మంది మృతి
నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. అప్రమత్తమైన నేతలు గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కందుకూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది మంది మృతి చెందారు. వెంటనే చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ఆపేసి.. ఆస్పత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం చంద్రబాబు బహిరంగ సభవేదిక వద్దకు చేరుకుని మాట్లాడుతూ.. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం మనసు కలచివేసిందన్నారు. అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. మతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో చదివిస్తామన్నారు.
మృతులకు పార్టీ తరఫున గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మృతులు.. మధుబాబు, చిన కొండయ్య, పురుషోత్తం, కాకుమాని రాజా, దేవినేని రవీంద్రబాబు, ఈదుమూరి రాజేశ్వరి, కలవకూరి యానాదిగా గుర్తించారు.