Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లో సమాచార భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారం ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా తస్కరణకు గురవుతు సవాలు విసురుతున్నది. భారత్‌లోని అత్యున్నత మెడికల్ సంస్థ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్)కు సంబంధించి సమాచార ఉల్లంఘన మరవకముందే.. భారత రైల్వేకు హ్యాకర్లు సవాల్ విసిరారు. దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణీకుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు దీనిపై భారతీయ రైల్వే కానీ ఏ ఇతర ప్రభుత్వ అధికారి కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం..
భారత్‌లో రైల్వే టికెట్లను బుక్ చేసుకున్న మూడు కోట్ల మంది ప్రజల డేటాను హ్యాకర్లు తస్కరించారు. ఈ డేటాలో ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామా, వయసు, జెండర్ వంటి వ్యక్తిగత సమాచారం ఉన్నది. ఒక హ్యాకర్ ఫోరమ్ ఈ ఘటనను 27న బయటకు తీసుకొచ్చింది. హ్యాకర్ ఫోరమ్ వాస్తవ గుర్తింపు ఏంటనే దానిపై స్పష్టత లేనప్పటికీ అది 'షాడో హ్యాకర్'గా తెలుస్తున్నది. అయితే, తస్కరించిన ఈ మూడు కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ ఫోరమ్ డార్క్ వెబ్‌లో అమ్ముతున్నట్టుగా సమాచారం. భారతీయ రైల్వేలో టికెట్లు బుక్ చేసుకున్న మూడు కోట్ల మంది ప్రజల ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారం తమ వద్ద ఉన్నట్టు హ్యాకర్ గ్రూపు తెలిపింది. తాము అనేక ప్రభుత్వ విభాగాల ఈ-మెయిల్ ఖాతాలను చోరీ చేసినట్టు హ్యాకర్ గ్రూపు పేర్కొనడం గమనార్హం.దేశంలో పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతపై చర్చలు నడుస్తున్న వేళ ఈ వార్త వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సమాచార భద్రతకు చట్టం రూపొందించాలన్న అత్యవసర స్థితిని ఇది నొక్కి చెప్తున్నదని నిపుణులు, సామాజికవేత్తలు తెలిపారు. అయితే, ఈ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.