Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశ్చిమ బెంగల్‌లోని హౌరాలో ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు పదో మహాసభ
- గ్రామీణ పేదలను విస్మరిస్తున్న కేంద్రం : ఎ.విజయరాఘవన్, బి.వెంకట్
న్యూఢిల్లీ : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) 10వ అఖిల భారత మహాసభ లోగోను ఆవిష్కరించారు. బుధవారం నాడిక్కడ ఏఐఏడబ్ల్యూయూ కేంద్ర కార్యాలయం(క్యానింగ్ లైన్ 36)లో ఏర్పాటుచేసిన విలేకరులు సమావేశంలో ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవన్, బి.వెంకట్, ఉపాధ్యక్షుడు ఎం.వి గోవిందన్ మాస్టార్, సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్‌లు సంఘం పదో అఖిల భారత మహాసభ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎ.విజయరాఘవన్, బి.వెంకట్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు తమ సంఘం పదో అఖిల భారత మహాసభలు జరగనున్నాయని తెలిపారు. మహాసభలకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి దాదాపు 650 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు చెప్పారు. బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. దేశంలోని గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. పాలకులు ఆయా వర్గాలను పట్టించుకోవటం లేదని తెలిపారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక ప్రకారం దేశంలో గతేడాది 5,563 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం, సాయం అందలేదని విమర్శించారు. దేశంలో గత మూడు దశబ్దాలల్లో 31 శాతం భూమి లేని పేదలుంటే, ఇప్పుడు 49 శాతానికి పెరిగారని తెలిపారు. భూమి లేని పేదలకు భూమిని పంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల్లో 50 దళితులే ఉన్నారనీ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తే దళితులుకు, గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం జరు గుతోందని తెలిపారు. వ్యవసాయ కార్మికులకు సం బంధించిన బిల్లులను పరిగణనలోకి తీసుకోవటం లేదని దుయ్యబట్టారు. బిజెపి ప్రజలను కులం, మ తం పేరుతో విభజిస్తోందని విమర్శించారు. దీనికి వ్య తిరేకంగా మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు.
మూడెకరాల భూమి ఎంత మందికిచ్చారు?
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారనీ, ఎంత మంది దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారని బి.వెంకట్ ప్రశ్నించారు. అటవీ భూములకు సంబంధించి పట్టాల సమస్య ఇంకా పెండింగ్‌లోనే ఉందనీ, వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నిలబడితే, రాజకీయంగా మద్దతు ఇస్తామనీ, అలాగే రాష్ట్రంలో పేదల సమస్యల పరిష్కరించకపోతే పోరాడుతామని అన్నారు.