Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దెబ్బతిన్న జీసస్ విగ్రహం
బెంగళూర్ : కర్నాటకలో హిందూత్వ శక్తులు పెట్రేగిపోయారు. మైసూరుకు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరియపట్నా వద్ద ఉన్న చర్చిపై మంగళవారం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. చర్చిలోపల ముందు భాగాన ఉండే వేదికను దుండగులు ధ్వంసం చేశారు. కుర్చీలు, బల్లల్ని విరగొట్టారు. ఈ దాడిలో జీసస్ విగ్రహం దెబ్బతిన్నది. విలువైన పరికరాల్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పెరియాపట్నం పోలీసులు కేసు నమోదుచేశారు. ఉద్దేశపూర్వకంగా దాడికి తెగబడటమేగాక, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారని ఆరోపణలు, దొంగతనం కేసు నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, దాడి ఘటన మంగళవారం రాత్రి 7గంటలకు జరిగింది. చర్చి ప్రధాన పూజారి దగ్గర్లోని పట్టణానికి వెళ్లిన సమయంలో దాడి చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగకు రెండు రోజుల తర్వాత దాడికి ఈ చర్చిని దుండగులు ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బి.ఎన్.నందిని ఘటనా స్థలాన్ని సందర్శించారు. దాడి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, కొంతమందిపై అనుమానాలున్నాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.