Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
- పదును తేలుతున్న మతోన్మాద ధోరణులపై ఆందోళన
- న్యాయ వ్యవస్థ స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి
న్యూఢిల్లీ : ఉచిత ఆహార ధాన్యాలతో పాటూ సబ్సిడీ ఆహార ధాన్యాలనూ కొనసాగించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఆహార భద్రతా చట్టంతో పీఎంజీకేఎవై (ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) ని విలీనం చేయాలని కోరింది. 2013 నాటి ఆహార భద్రతా చట్టం కింద 2023 సంవత్సరానికి దాదాపు మూడింట రెండు వంతుల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందివ్వడమంటే, ఈ పథకం లేకపోతే దేశాన్ని వేధిస్తున్న ఆకలి బాధను అధిగమించలేమని ప్రభుత్వం అంగీకరించినట్లేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. భారతదేశంలో క్షుద్భాధ పరిస్థితులు చాలా తీవ్రంగా వున్నాయంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పేర్కొనడాన్ని మోడీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇది వాస్తవమన్నది సుస్పష్టమైందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. భారత కమ్యూనిస్టు (మార్క్కిస్ట్) పార్టీ పొలిట్‌బ్యూరో ఈ నెల 27, 28 తేదీల్లో ఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
81.35కోట్ల మంది ప్రజలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను ఒకవైపు ఉచితంగా అందిస్తూనే, మరోవైపు ఆహార భద్రతా చట్టం (ఎఫ్ఎస్ఏ) కింద ప్రస్తుతం సబ్సిడీ రేట్లకు ఇచ్చే కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2, పప్పు ధాన్యాలు కిలో రూపాయి చొప్పున ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వడాన్ని తిరస్కరిస్తున్నారు. దీని పర్యవసానంగా, సబ్సిడీ రేట్లతో కూడిన ఆహార ధాన్యాల స్థానే ప్రజలు బహిరంగ మార్కెట్‌కు వెళ్ళి కొనుగోలు చేయాల్సి వస్తుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పోషకాహారపు విలువలు పొందడానికి ఈ ఆహార ధాన్యాలు అత్యవసరం కూడా. అక్కడ బహిరంగ మార్కెట్లో గోధుమలను కిలో రూ.30పైనే విక్రయిస్తుండగా, బియ్యం ధర కిలోకు రూ.40పైనే వుంటోంది. బతకడం కోసం పోరు సల్పుతున్న కోట్లాది కుటుంబాలకు ఇది తీవ్రమైన ఎదురు దెబ్బ కాగలదని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
ఈ పరిస్థితుల్లో పీఎంజీకేఎవై కింద ఇచ్చే 5కిలోల ఉచిత ఆహార ధాన్యాలతో పాటూ ఎఫ్ఎస్ఏ కింద సబ్సిడీ రేట్లకు ఇచ్చే 5 కిలోల ఆహార ధాన్యాలను కూడా కొనసాగించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.
ఆర్థిక వ్యవస్థ : భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం పరిస్థితులు పెరుగుతుండడం పట్ల పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందంటూ ఒకవైపు ప్రభుత్వం విపరీతంగా (మొదటిపేజి తరువాయి)
ప్రచారం చేస్తూ, ప్రకటనలు గుప్పిస్తున్నా భారతదేశ ఉత్పాదక సామర్ధ్యాలు పెంపొందేలా పెట్టుబడులు పెరగడం లేదు.
అక్టోబరు మాసంలో పారిశ్రామిక ఉత్పత్తి నాలుగు శాతం క్షీణించింది. గత మూడు మాసాల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ప్రతి సంవత్సరం డేటాను పరిశీలించినట్లైతే తయారీ రంగ ఉత్పత్తి గణనీయంగా 5.4శాతం క్షీణించింది. అక్టోబరులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 129.6గా వుంది. 2021 సెప్టెంబరు నుండి చూసినట్లైతే ఇది అత్యంత తక్కువగా వుంది. వినిమయ వస్తూత్పత్తి 15.3శాతం మేర క్షీణించగా, వినిమయేతర వస్తూత్పత్తి 13.4శాతం క్షీణించింది. ప్రజల కొనుగోలు శక్తి సామర్ధ్యాలు నిరంతరంగా తగ్గుతున్నాయనడానికి ఇదొక సూచనగా వుంది.
పెరుగుతున్న నిరుద్యోగం : నిరుద్యోగితా రేటు పెరుగుతునే వుంది. అంతకన్నా అధ్వాన్నమైన అంశమేమంటే దీనితో పాటూ కార్మిక ప్రాతినిధ్యం రేటు, ఉపాధి రేటు కూడా తగ్గడం. నవంబరులోని 8శాతంతో పోలిస్తే డిసెంబరులో నిరుద్యోగం రేటు 8.8శాతానికి పెరిగింది. పట్టణ నిరుద్యోగం 9.6శాతానికి పెరగగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.8శాతంగా వుంది.
ధరల పెరుగుదల : ద్రవ్యోల్బణం కొనసాగుతునే వుంది. ఆహార ద్రవ్యోల్బణం కొనసాగుతూ ప్రజల జీవనోపాధులపై మరిన్ని ఇబ్బందులను విధిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉపాధులు సృష్టించే మౌలిక వసతుల రంగాల్లో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఉపాధి కల్పన వుండదని, ప్రజల కొనుగోలు శక్తి సామర్ధ్యాలు కూడా పెరగబోవని పేర్కొంది.
పదును తేలుతున్న మతోన్మాద ధోరణులు : ముస్లిం మైనారిటీలపై హింసాత్మక నేరపూరిత దాడులు చేయాలంటూ పాలక పార్టీ ఎంపీ ఇచ్చిన పిలుపు తీవ్రంగా ఖండించదగ్గదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అధికారులు ఈ విషయాన్ని తమకు తాముగా పరిగణనలోకి తీసుకుని, క్రిమినల్ కేసు నమోదు చేయడానికి బదులుగా ఎంపీ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ఫిర్యాదు వస్తేనే తాము చర్యలు తీసుకోగలమని చెప్పడం వింతగా వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇటువంటి విషపూరితమైన విద్వేషం, హింస, భయోత్పాతాలను ప్రచారం చేసే వారికి ఇది, బహిరంగంగా ఆశ్రయం, రక్షణ కల్పించడమేనని విమర్శించింది.
విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్ధులకు వ్యతిరేకంగా విద్వేషమనేది ప్రమాదకరమైన రీతుల్లో పెరుగుతోంది, క్రైస్తవ మైనారిటీలపై కూడా దాడులు పెరుగుతున్నాయి.
మౌలానా అజాద్ జాతీయ ఫెలోషిప్ (ఎంఎఎన్ఎఫ్) పేరుతో ముస్లిం విద్యార్ధులకు స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లు ఇచ్చే పథకం రద్దు చేయబడింది. ఇతర వివిధ రకాలైన స్కాలర్షిప్ పథకాలతో ఎంఎఎన్ఎఫ్ కలిసిపోతుండడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియచేసింది. ఇది దారుణమైన అవాస్తవం. వివిధ రాష్ట్రాల్లో ముస్లింలను, ఇతర మతపరమైన మైనారిటీలను ఓబీసీలుగా పరిగణించడం లేదు. అందువల్ల ఈ స్కాలర్షిప్ను తప్పనిసరిగా పునరుద్ధరించాలి.
న్యాయ వ్యవస్థ : జ్యుడీషియల్ నియామకాల్లో, బదిలీల్లో ప్రభుత్వానికి ప్రముఖమైన పాత్ర వుండేలా చూసేందుకు మోడీ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ పరిస్థితులు న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య, కొలీజియం వ్యవస్థ, జాతీయ జ్యుడీషియల్ అప్పాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఎన్‌జేఏసీ చెల్లదని రూలింగ్ ఇచ్చింది.
జ్యుడీషియల్ నియామకాలపై ప్రభుత్వ నియంత్రణ కోసం మోడీ ప్రభుత్వం చేసే యత్నాలన్నింటినీ సీపీఐ(ఎం) తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. వ్యతిరేకిస్తోంది. రాజీపడని రీతిలో న్యాయ వ్యవస్థ స్వేచ్ఛా స్వాతంత్య్రం పరిరక్షించబడాలని పేర్కొంది.
బీమా కొరెగావ్ నిర్బంధితులను విడుదల చేయాలి : పూనే నగరానికి 30కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన ఎల్గార్ పరిషద్ కార్యక్రమానికి 2018 జనవరి 1న బీమా కొరెగావ్‌లో తలెత్తిన హింసాకాండకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి ప్రమాణపూర్తిగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో, ఈ కేసులో అరెస్టయిన యుఎపిఎ నిర్బంధితులందరినీ బేషరతుగా తక్షణమే విడుద చేయాలని పొలిట్‌బ్యూరో కోరింది.
సహకార బిల్లు : సమాఖ్యవాదంపై దాడి : బహుళ రాష్ట్రాల సహకార సంఘాల సవరణ బిల్లు, 2022ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది, సమాఖ్యవాదంపై, రాష్ట్రాల హక్కులపై దాడి చేయడమేనని విమర్శించింది. సహకార సంఘాలనేవి రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ ప్రతిపాదిత బిల్లు అనేది రాష్ట్రాల చట్టాలకు అనుగుణంగా నడిచే సహకార సంఘాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రుద్ధడానికి చేసే దారుణమైన ప్రయత్నం. సహకార సొసైటీలను నియంత్రించడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను దెబ్బ తీయడమే, సమాఖ్యవాదంపై దాడి చేయడమే.
త్రిపుర : త్రిపురలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో సిపిఎం, ఇతర ప్రతిపక్షాలపై పాలక బీజేపీ హింసాత్మక దాడులను ముమ్మరం చేసింది.
బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పాలనతో ధ్వంసమవుతున్న చట్టబద్ధ పాలనను, ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని సిపిఎం, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి.
అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఒక ప్రహసనంగా నిర్వహించకుండా అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్ క్రియాశీలంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించినట్లైతే, త్రిపురలో పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య హక్కులు పునరుద్ధరణ జరగాలి.
సీసీ సమావేశం : జనవరి 28-30 తేదీల్లో కోల్‌కతాల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం కానుంది.