Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.400 కోట్లే నకిలీవి
- ఆర్బీఐ వద్దన్నా.. మోడీ ప్రభుత్వం నిర్ణయం
- రెండున్నర గంటల ముందే మమా అనిపించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి సంప్రదింపులు చేశాకే నోట్ల రద్దు ప్రక్రియను చేపట్టామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. నోట్ల రద్దుపై అనేక పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు జనవరి 2న దీనిపై తీర్పును వెలువరించనుంది. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ముందే 2016 ఫిబ్రవరి నుంచే ఆర్బిఐతో సంప్రదింపులు జరిగాయని కేంద్రం తెలిపింది. ఆర్బీఐ కూడా తన అఫిడవిట్లో తగిన ప్రక్రియను అనుసరించినట్లు, తానే నోట్ల రద్దుకు సిఫారసు చేసినట్టు పేర్కొంది. ఈ సందర్బంగా ప్రభుత్వం, ఆర్బీఐ అఫిడవిట్లో ప్రస్తావించని పలు అంశాలను ఫైనాన్సీయల్ ఎక్స్‌ప్రెస్ గుర్తించింది. నోట్ల రద్దు, ప్రభుత్వ సమర్థనలపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డు పలు విమర్శలు చేసిన తర్వాత కూడా కేంద్రం ఈ విషయంలో ముందుకు సాగింది. ముఖ్యంగా నోట్ల రద్దునపై ఆర్బిఐ సెంట్రల్ బోర్డు అభ్యంతరాలు, ప్రతిపాదనలను కేంద్రం, ఆర్బీఐ తమ తుది అఫిడవిట్లో పేర్కొనలేదు. ప్రభుత్వ అఫిడవిట్‌లోని అనేక అంశాలను ఆర్బిఐ సెంట్రల్ బోర్డు ముందే తోసిపుచ్చడం విశేషం. ఆ వివరాలు..
అఫిడవిట్లలోని కొన్ని ప్రధానాంశాలు..
1. జీడీపీలో కరెన్సీ సరఫరా : పెద్ద నోట్ల రద్దును సమర్థించడానికి జీడీపీలో కరెన్సీ సరఫరా (కరెన్సీ ఇన్ సర్య్కూలేషన్ - సీఐసీ) ఒక కీలకమైన గణాంకం. ''చెలామణిలో ఉన్న నగదు పరిమాణం నేరుగా అవినీతి స్థాయికి ముడిపడి ఉంది'' అని 2016 నవంబర్ 8న ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో అంటే.. 2011-12 నుంచి 2015-16 జీడీపీలో సీఐసీ 11 శాతం పైగా నిష్పత్తి కలిగి ఉందని అఫిడవిట్లో పేర్కొంది. ఇది అమెరికాలోని 7.74 శాతం కంటే చాలా ఎక్కువ.
అఫిడవిట్లో చేర్చనిది : మూడేండ్లలోనే తిరిగి జీడీపీలో నగదు సరఫరా యథాతథ స్థాయికి చేరింది. ఈ విషయాన్ని ఆర్బీఐ తన 2019-20 రిపోర్టులో పేర్కొంది. నోట్ల రద్దకు ముందు జీడీపీలో 12.0 శాతంగా ఉన్న నగదు సరఫరా.. 2019-20 నాటికి తిరిగి 11.3 శాతానికి ఎగిసింది. ఇది 2020-21 నాటికి ఏకంగా 14.4 శాతంగా నమోదయ్యింది. తిరిగి 2021-22లో స్వల్పంగా తగ్గి 13.7 శాతంగా చోటు చేసుకుందని ఆర్బీఐ గణంకాలు చెబుతున్నాయి.
2. రూ.500, రూ.1000 నోట్ల పెరుగుదల : నోట్ల రద్దుకు ముందు ఐదేండ్లలో రూ.500, రూ.1000 నోట్ల చెలామణీ భారీగా పెరిగింది. రూ.500 చెలామణీ 76.38 శాతం, రూ.1,000 నోట్ల చెలామణీ 108.98 శాతం పెరిగిందని ప్రభుత్వ అఫిడవిట్లో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో ఈ నోట్లు ఊహించని విధంగా పెరిగాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో పెరుగుదలతో పోలిస్తే పెద్ద నోట్ల సరఫరా వివరించలేనిది.
అఫిడవిట్లో చేర్చనిది : ప్రభుత్వ ఈ విశ్లేషణలోని లోపాన్ని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఎత్తి చూపింది. ''ఆర్థిక వ్యవస్థ వద్ధి రేటు నిజమైన రేటు అయితే చెలామణిలో కరెన్సీ వృద్థి నామమాత్రంగా ఉంది. ద్రవ్యోల్బణం కోసం నగదు సరఫరాను సర్దుబాటు చేస్తే వ్యత్యాసం అంత స్పష్టంగా ఉండకపోవచ్చు. అందువల్ల నోట్ల రద్దు వాదన సిఫారసుకు తగినంతగా మద్దతు ఇవ్వదు. ప్రధాని నోట్ల రద్దును ప్రకటించడానికి కేవలం రెండున్నర గంటల ముందు మాత్రమే సాయంత్రం 5.30 గంటలకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్ జరిగిందని మినెట్స్‌లో ఉంది.
3. నకిలీ కరెన్సీ పరిమాణం.
ప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం.. భారత వ్యవస్థలోని నకిలీ కరెన్సీ నోట్లు గడిచిన ఒక్క ఏడాదిలోనే తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
ప్రస్తావించని అంశం : ''నకిలీకి సంబంధించిన ఏవైనా సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ (రూ.17 లక్షల కోట్లు పైగా) పరిమాణంలో రూ.400 కోట్లు నగదు మాత్రమే నకిలీ.'' అని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ మీటింగ్ యొక్క మినిట్స్ పేర్కొంది.
4. నల్లధనం నిల్వకు రూ.500, రూ.1,000 నోట్లను ఉపయోగించడం : నల్లధనం నిల్వకు రూ.500, రూ.1,000 నోట్లను అధికంగా ఉపయోగించడం ఒక్కటి. రెండో అంశం.. అధిక విలువ కలిగిన నోట్ల రూపంలో లెక్కలోకి రాని సంపదను నిల్వ చేయడం మరో దుర్మార్గం''.
ప్రస్తావించనిది : ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఈ వాదనను తోసిపుచ్చింది. ''నల్లధనంలో ఎక్కువ భాగం నగదు రూపంలో కాకుండా బంగారం లేదా రియల్ ఎస్టేట్ వంటి రియల్ సెక్టార్ ఆస్తుల రూపంలో ఉంది. నోట్ల రద్దు ఆ ఆస్తులపై భౌతిక ప్రభావాన్ని చూపదు'' అని పేర్కొన్నట్లు ఆర్బీఐ మినెట్స్‌లో ఉంది.
5. టెర్రరిజం కోసం నకిలీ కరెన్సీ : అఫిడవిట్ ప్రకారం.. టెర్రరిజం, ఇతర విధ్వంసకర కార్యకలాపాలకు నకిలీ కరెన్సీని ఉపయోగించుకోవడం మూడో అపరాధం.
ప్రస్తావించనిది : నకిలీ కరెన్సీ లేదా అధిక విలువ కలిగిన నోట్ల అంశం తీవ్రవాదానికి ఉపయోగపడుతున్నాయనేది ఆర్బిఐ సెంట్రల్ బోర్డు మీటింగ్ మినిట్స్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు.
6. కరెన్సీ నోట్లలో మార్పు : ప్రభుత్వం తన అఫిడవిట్లో ఏ సందర్బంలోనైనా కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రక్రియలో ఆర్బీఐ ఉన్నది. ఆ సమయం నుండి ప్రయోజనం పొందేందుకు మాత్రమే నోట్ల రద్దు నిర్ణయం ప్రయత్నించిందని పేర్కొంది. ఆర్బీఐ ప్రభుత్వంతో సంప్రదించి, జనవరి 2014 నుండి కొత్త సిరీస్‌పై కసరత్తు చేస్తోంది.
''రూ. 500, రూ.1000 నోట్ల రద్దు ద్వారా నకిలీ, తీవ్రవాద ఫైనాన్సింగ్, నల్లధనం వంటి మూడు సమస్యలను పరిష్కరించడానికి కొత్త సిరీస్ నోట్లను ప్రవేశపెట్టడం చాలా అరుదైన, లోతైన అవకాశాన్ని అందించగలదని భారత ప్రభుత్వం, ఆర్బిఐ భావించాయని అఫిడవిట్లో పేర్కొంది. ఎంజి కొత్త సిరీస్ నోట్లను ప్రవేశ పెట్టడంతో పాటు ఇటువంటి నోట్ల రద్దు ప్రతిపాదన (డీమోనిటైజేషన్) మరింత అనుకూలమైన సమయంలో యాదృచ్చికంగా వచ్చిందని అఫిడవిట్ తెలిపింది.
ఇది పేర్కొనలేదు : రిజర్వ్ బ్యాంక్ బోర్డు మినెట్స్‌లో అటువంటి అనుకూల, యాథృచ్చిక సమయం గురించి ప్రస్తావించలేదు. నోట్ల రద్దు తర్వాత వారం అనంతరం నవంబర్ 14న ఏటీఎంల్లో నోట్ల జమకు సంబంధించిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అదే విధంగా పాత శ్రేణీ నోట్లను కొత్త వాటితో మార్చుకోవడానికి ఆర్బీఐ యొక్క సన్నాహాలను సద్వినియోగం చేసుకుంటూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లయితే.. రీమోనిటైజేషన్ (తిరిగి నగదీకరణ) ఎందుకు అనేక సమస్యలలో కూరుకుపోయిందనేది కీలక విమర్శ.