Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత బియ్యం..పొడిగింపుతో ప్రజల్ని మభ్యపెడుతున్న కేంద్రం
- నిలిచిపోయిన సబ్సిడీ గోధుమలు, ఇతర సరుకుల పంపిణీ
- అధిక ధరల వద్ద కొనుగోలు చేయలేని పరిస్థితిలో పేదలు, మధ్య తరగతి
- ఆర్థిక వృద్ధి ఉంటే పేదరికం పెరుగుతుందా? : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేవై) కింద అందిస్తున్న ఉచిత బియ్యం (5 కిలోలు) పథకం మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల పెద్దగా హర్షం వ్యక్తం కావటం లేదు. మార్చి 2020లో మొదలైన కరోనా సంక్షోభం, లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఈ ఉచిత బియ్యం లేదా గోధుమల పంపిణీ పథకాన్ని మోడీ సర్కార్ వాడుకుంది. అన్నయోజన పథకానికి ముందు దేశంలో 'జాతీయ ఆహార భద్రతా చట్టం' కింద ఆహార ధాన్యాల సబ్సిడీ కోసం కేంద్రం (2019-20లో) రూ.1.09లక్షల కోట్ల నిధుల్ని ఖర్చు చేసింది. ఉచిత బియ్యం (పీఎంజీకేవై) మొదలయ్యాక ఆహార ధాన్యాల సబ్సిడీకి మంగళం పాడింది. దీంతో కోట్లాది పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆహార సబ్సిడీకి దూరమయ్యాయి. కేవలం 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా పొందుతూ, గోధుమలు, ఇతర సరుకులు బహిరంగ మార్కెట్లో అధిక ధరల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆహార భద్రతా చట్టానికి తూట్లు
ఉచిత బియ్యం అమల్లోకి వచ్చిన తర్వాత 'జాతీయ ఆహార భద్రతా చట్టం' ఉనికిలో లేకుండా పోయింది. దాంతో గ్రామీణ జనాభాలో 75శాతం, పట్టణ జనాభాలో 50శాతం కవర్ చేసే సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాల పంపిణీ ఆగిపోయింది. ఉదాహరణకు ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో ప్రజలు అత్యధికంగా కొనుగోలు చేసేది గోధుమల్ని. రేషన్ దుకాణాల్లో వారికి కిలో గోధుమలు మూడు రూపాయలకు లభించేది. ఒక్క రూపాయికి కిలో ముతక ధాన్యం వచ్చేవి. వీటి సరఫరా లేక..బహిరంగ మార్కెట్లో కిలో గోధుమల్ని రూ.40 నుంచి 50కి పైనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆహార అవసరాలను తీర్చుకోవడానికి ప్రజలు బహిరంగ మార్కెట్‌పై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిన ఏ రాష్ట్రంలోనూ గోధుమల్ని ఉచితంగా సరఫరా చేయటం లేదు. నాణ్యతలేని బియ్యాన్నే ఇస్తున్నారు.
90శాతం మంది పేదలే
కరోనా సంక్షోభం తలెత్తాక దేశంలో పేదరికం విపరీతంగా పెరిగింది. ఒక్కసారిగా కోట్లాది కుటుంబాలకు ఉపాధి కోల్పోవటంతో అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం భారతీయుల్లో 90 శాతం మంది పేదలు. ఈనేపథ్యంలో ఆహార సబ్సిడీ కవరేజ్‌ను పెంచాల్సిన మోడీ సర్కార్, దానిని 'గరీబ్ కల్యాణ్ అన్నయోజన'లో కలిపేసింది. బడ్జెట్ వ్యయాన్ని రూ.2.9 లక్షల కోట్లుగా చూపి ప్రజల్ని మభ్యపెడుతోంది. 81కోట్ల మంది పేదలున్నారని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించింది. దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి ఉంటే, పేదరికం ఈ స్థాయిలో ఎందుకు ఉంటుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.