Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ సిరప్ తాగి 18 మంది పిల్లలు మృతి
- వెల్లడించిన ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- ఉజ్బెకిస్థాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం : భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : భారత్‌లో తయారైన సిరప్‌ను తాగి ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మరణించారు. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్-1 మ్యాక్స్ అనే సిరప్‌ను తాగడంతో సమర్కండ్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ విషయాన్ని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయోగ శాల పరీక్షలలో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్ ఉనికిని కనుగొన్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఔషధాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా, బాధిత పిల్లలు ఎక్కువ మోతాదులో వినియోగిం చారని వివరించింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ప్రాథమిక ప్రయోగశాల అధ్యయనాలు సిరప్ యొక్క నిర్ధిష్ట బ్యాచ్‌లో ఇథిలీన్ గ్లైకాల్ ఉనికిని సూచిస్తున్నాయి. ఈ పదార్థం విషపూరితమైంది. కేజీకి 1-2 ఎంఎల్ 95 శాతం సాంద్రీకృత ద్రావణాన్ని తీసుకోవడం వల్ల వాంతులు, మూర్చలు, హృదయ సంబంధ సమస్యలు, తీవ్ర మూత్రపిండ వైఫల్యం వంటివి ఏర్పడవచ్చని వివరించింది. గాంబియాలో 70 మంది పిల్లల మరణాలకు కారణమైన భారత్‌లో తయారైన సిరప్‌లో డై-ఇథిలీన్ గ్లైకాల్‌తో పాటు కలుషిత ఇథిలీన్ గ్లైకాల్ లు కనుగొనబడిన విషయం విదితమే.
కాగా, ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. ఉజ్బెకిస్థాన్‌లోని ఆరోగ్య అధికారులతో డబ్ల్యూహెచ్ఓ సంప్రదింపులు జరుపుతున్నదని వివరించింది. తదుపరి పరిశోధనలలో సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన ప్రశ్నలకు తయారీ సంస్థ మారియన్ బయోటెక్ తమ ప్రశ్నలకు స్పందించలేదని ఒక వార్త సంస్థ తెలిపింది. ఇటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై స్పందించింది. భారత్ క్రమం తప్పకుండా ఉజ్బెకిస్థాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నదని సదరు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాల మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఈనెల 27 నుంచి అక్కడి ఔషధ నియంత్రణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నదని వెల్లడించింది. సీడీఎస్సీఓ బృందం, యూపీ డ్రగ్స్ నియంత్రణ బృందం సంయుక్తంగా నోయిడాలోని మారియన్ బయోటెక్ సంస్థపై దాడులు జరిపాయని కేంద్రమంత్రి వివరించారు. దగ్గు సిరప్‌ల శాంపిళ్లను సేకరించామనీ, పరీక్షల కోసం చండీగఢ్‌లోని ల్యాబ్‌కు పంపామని అన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇలాంటి ఘటనలు ప్రపంచదేశాల్లో భారత ప్రతిష్టను దిగజార్చుతాయని వైద్య, ఆరోగ్య నిపుణులు తెలిపారు. కేంద్రం వైఫల్యంతోనే ఔషధ తయారీ సంస్థలు నిర్ధిష్ట ప్రమాణాలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల మరణాలకు ఔషధాలలో హానికరమై పదార్థాలున్నట్టు దర్యాప్తులో తేలితే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య నిపుణులు తెలిపారు.