Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వస్థలాలకు వెళ్లకుండానే ఓటు హక్కు
- జనవరి 16న డెమో రాజకీయ పార్టీలకు ఆహ్వానం : సీఈసీ
న్యూఢిల్లీ : ఓటింగ్ ప్రక్రియలో వినూత్న విధానానికి ఎన్నికల సంఘం తెరలేపనున్నది. ఉపాధి నిమిత్తం దేశంలోని వివిధ నగరాలకు వెళ్లే వలస కార్మికులు తమ సొంత నియోజకవర్గంలో రిమోట్‌గా ఓటు వేసేందుకు కొత్త విధానాన్ని తయారు చేసింది. దేశంలోని వలస కార్మికులకు ఓటు వేయడానికి రిమోట్ ఓటింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ రిమోట్ ఆర్వీఎం పనితీరును ప్రదర్శించేందుకు జనవరి 16న ఎనిమిది జాతీయ, 57 రాష్ట్ర రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, జనవరి 31లోగా వారి లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియజేయాలని ఈసీ కోరింది. యంత్రాన్ని అమలు చేయడంలో ఎదుర్కొనే చట్టపరమైన, కార్యాచరణ, పరిపాలనా, సాంకేతిక సవాళ్లపై పార్టీల అభిప్రాయాలను పొందడం కోసం దీనిని ప్రదర్శించనుంది. బహుళ నియోజకవర్గాల రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) అభివృద్ధి చేస్తున్నామని, దీనివల్ల ఒకే రిమోట్ పోలింగ్ బూత్ నుండి బహుళ నియోజనవర్గాలను నిర్వహించగలదని తెలిపింది. వలస కార్మికులు ఓటు వేసేందుకు తమ సొంత రాష్ట్రానికి వెళ్లకుండానే, పని ప్రాంతాల నుండే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ పరికరం దేశంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా తమ నియోజకవర్గానికి ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది.
''2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. అంతర్గత వలసల (దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు) కారణంగా ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలి వెళ్తున్నారు. దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వారే. ఇలా వలసలు వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్ ఓటింగ్‌పై దృష్టి పెట్టాం. వలస వెళ్తున్న వాళ్లలో 85 శాతం మంది సొంత రాష్ట్రంలోనే ఉంటున్నారు. ఇలాంటి వాళ్లకు సులభంగా ఓటు వేసే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈసీ రిమోట్ ఈవీఎంలను తీసుకొస్తోంది. దేశంలో వలసలకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. తాజాగా అభివృద్ధి చేసిన రిమోట్ ఈవీఎం.. ఒక్క దాంట్లోనే ఏకంగా 72 నియోజకవర్గాలకు సంబంధించి ఓటు వేయొచ్చు'' అని పేర్కొంది.