Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లలో రెట్టింపైన వసూళ్లు
- కరోనాలోనూ ఖజానాకు కిక్కు
న్యూఢిల్లీ : స్థూల పన్ను రెవెన్యూలో కేంద్ర ప్రభుత్వం సెస్ వాటాలు పెరిగాయి. 2019-20, 2020-21 మధ్య వార్షిక స్థూల పన్ను ఆదాయంలో కేంద్ర సెస్, సర్‌చార్జీల వాటా 10 శాతం పాయింట్లు పెరిగిందని వెల్లడించింది. చాలా వరకు సెస్, సర్‌చార్జి మొత్తం రాష్ట్రాలతో పంచుకోబడనందున ఇది చాలా బాగా పెరిగింది. పార్లమెంటులో సీపీఐ(ఎం) సభ్యుడు జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం.. 2019-20లో సెస్‌లు, సర్‌చార్జీల వాటా 20.10 కోట్ల స్థూల పన్ను ఆదాయంలో 18.2 శాతంగా ఉంది. 2020-21లో కరోనా తాండవం చేస్తున్న కాలంలోనూ ఇది రూ. 20.27 శాతంగా ఉండగా.. 2021-22లో 28.1 శాతానికి పెరిగింది.
స్థూలంగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో 2019-20, 2020-21, 2021-22లో సెస్సులు, సర్చార్జ్జీలు వరుసగా రూ. 3.65 లక్షల కోట్లు, రూ. 5.09 లక్షల కోట్లు, రూ. 7.07 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంటే మూడేండ్లలో సెస్సు వసూళ్ల రాబడి రూ. 3.42 లక్షల కోట్లు లేదా 93.7 శాతం పెరిగింది. సెస్‌లు, అదనపు సాధారణ పన్నుల వంటివి పన్ను చెల్లింపుదారులపై అదనపు భారాన్ని పెంచుతాయి. ఆరోగ్యం, విద్యా, పెట్రోల్, డీజిల్, రహదారులు, మౌలిక సదుపాయాలు, ముడి చమురు, ఎగుమతులు, దిగుమతులు తదితర వాటిపై కేంద్రం సెస్సులను వసూలు చేస్తోంది. దాదాపుగా అన్ని రంగాలపై ఏదో ఓ పేరుతో సెస్, సర్‌చార్జీల వసూళ్లను సాగిస్తోంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ప్రకారం.. జాబితాలో సూచించబడిన అన్ని పన్నులు, సుంకాలను కేంద్రం విధించడంతో పాటు వసూలు చేస్తుంది. నిర్దిష్ట సుంకాలు, పన్నులు, సర్‌చార్జీ మినహా మిగితావి మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ చేయబడుతాయి. చాలా వరకు సెస్, సర్‌చార్జీ లాంటి వాటిలో రాష్ట్రాలకు ఏమి దక్కదు. ఫలితంగా కేంద్రం మొత్తం ఆదాయం పెరిగినా.. రాష్ట్రాలకు సెస్‌ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవడానికి తరుచుగా కేంద్రం దొడ్దిదారిన సెస్‌లను పెంచుతుంది. సెస్, సర్చార్జ్జీలపై ప్రీ-బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి.