Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కార్పొరేట్ విరాళాల్లో బీజేపీ మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. కార్పొరేట్ సంస్థలు బీజేపీపై విరాళాల వర్షం కురింపించినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) పరిశీలనలో వెల్లడైంది. 2021-22 సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్ట్స్ ద్వారా బీజేపీకి 72శాతం కంటే ఎక్కువ చందాలు వచ్చినట్టు ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఏడీఆర్ ప్రతి ఏడాది ఎలక్టోరల్ ట్రస్ట్స్ నుంచి వచ్చే విరాళాలపై వార్షిక నివేదికను ప్రచురిస్తుంది. భారత రాష్ట్రసమితి, సమాజ్ వాది పార్టీ, ఆప్, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లతో పోల్చితే కాంగ్రెస్‌కు తక్కువ ఫలితాలు వచ్చాయి. ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 2021-22లో కాంగ్రెస్ కంటే బీజేపీకి పంతొమ్మిదిరెట్లు ఎక్కువ విరాళాలు అందాయని ఏడీఆర్ విశ్లేషణలో తేలింది. బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు మిగతా తొమ్మిది పార్టీలకు వచ్చిన దానికంటే 2.5 రెట్లు ఎక్కువ.
ఏడీఆర్ ప్రకారం... ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి కాంగ్రెస్‌కు రూ.18.44 కోట్లు, టీఆర్ఎస్కు రూ.40 కోట్లు, సమాజ్‌వాది పార్టీకి రూ.27 కోట్లు, ఆప్ పార్టీకి రూ.21.12 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు రూ.20 కోట్లు వచ్చాయి. ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా ఎస్ఏడీ రూ. 7 కోట్లు, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి రూ. కోటి, గోవా ఫార్వర్డ్ పార్టీ, డీఎంకేలు రూ. 50 లక్షలు అందుకున్నట్టు నివేదిక పేర్కొంది. కార్పొరేట్లు, వివిధ వ్యక్తులు నుంచి ఎలక్టోరల్ ట్రస్ట్‌కు మొత్తం రూ.487.09 కోట్లు వచ్చాయనీ, వివిధ రాజకీయ పార్టీలకు 487.06 కోట్లు (99.99శాతం) పంపిణీ చేశాయని ఏడీఆర్ పేర్కొంది.2020-21తో పోలిస్తే బీజేపీకి విరాళాలు ఇచ్చే కార్పొరేట్ సంస్థల వాటా దాదాపు పది శాతం తగ్గినప్పటికీ.. నగదు మాత్రం దాదాపు రూ. 130 కోట్లకు పెరిగింది. ఏడీఆర్ గత ఏడాది విశ్లేషణ ప్రకారం.. ఎన్నికల ట్రస్టుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల్లో బీజేపీకి రూ. 212.05 కోట్లు (82.05శాతం) అందాయి.