Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతినెలా సగటున 45 లైంగికదాడులు
- 2018-21మధ్య 2159మంది మహిళలపై అఘాయిత్యాలు : లోక్సభలో కేంద్ర హోంశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : 'గుజరాత్ మోడల్' అంటూ అక్కడి పాలకులు చేసే హడావిడి అంతా ప్రచారపు ఆర్భాటమేనని తేలిపోయింది. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత అత్యంత ఆందోళనకర స్థాయిలో ఉందని కేంద్ర హోంశాఖ నివేదిక స్వయంగా పేర్కొంది. గుజరాత్లో ప్రతినెలా సగటున 45 లైంగికదాడి ఘటనలు చోటుచేసుకున్నాయని, 2018-21 మధ్యకాలంలో 2159 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని లోక్సభలో హోంశాఖ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గుజరాత్లో మహిళల భద్రత అత్యంత అధ్వాన్నంగా ఉందని తేటతెల్లమైంది. 'మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం గుజరాత్' అని బీజేపీ నాయకులు ఇటీవల అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన కొద్ది రోజుల్లోనే, ఈ నివేదిక బయటకు రావటం గమనార్హం.
ఈ నివేదిక ప్రకారం, ఏటా ఆరుగురు మహిళలు యాసిడ్ దాడులకు గురవుతున్నారు. ఒక ఏడాదిలో 260 మంది మహిళలు హత్యకు గురయ్యారు. ప్రతిఏటా సగటున 550 లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. అంతేగాక ప్రతిరోజూ మహిళలపై దాడులు సర్వసాధారణంగా మారాయి. నాలుగేండ్లలో దాదాపు 3762 మంది మహిళలపై దాడులు జరిగాయని, సగటున ప్రతినెలా 100 దాడులు నమోదయ్యాయని నివేదికలో తెలిపారు. 2018-21 మధ్య నాలుగేండ్లలో మొత్తం 22 యాసిడ్ దాడి ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా అక్కడి బీజేపీ నాయకులు, వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారు.
సామూహిక లైంగిక దాడులు సైతం రాష్ట్రంలో విపరీతంగా పెరిగాయి. ఈ తరహా ఘటనలు 2018లో 8 జరగగా, 2021లో 17కు పెరిగాయి. నాలుగేండ్లలో మొత్తం 56 సామూహిక లైంగికదాడి ఘటనలు నమోద య్యాయి. మహిళల భద్రత అత్యంత దయనీయంగా తయారైనా బీజేపీ నాయకులు 'గుజరాత్ మహిళలకు సురక్షితంగా' చెప్పుకోవటంపై కాంగ్రెస్, ఆప్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ గణాంకాల్ని ఈ విధంగా ఉన్నాయని, నివేదికలోని ముఖ్యాంశాల్ని కాంగ్రెస్ అధికార ప్రతినిథి మనీశ్ మీడియాకు విడుదల చేశారు.
పాలకులకు పట్టింపు లేదు : కాంగ్రెస్
గుజరాత్ మహిళలకు సురక్షితమైన ప్రాంతంగా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో హోంశాఖ అవినీతికి కేంద్రంగా మారింది. పోలీసులు, భద్రతా సిబ్బందిని ప్రతిపక్షాలపై నిఘా కార్యకలాపాలకు వినియోగించటం వల్లే ఇదంతా. మహిళల భద్రతపై పాలకులకు శ్రద్ధ లేదు..అనేందుకు తాజా గణాంకాలే నిదర్శనం. ఇకనైనా మేల్కొని చర్యలు చేపట్టకపోతే ఈ అంశంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం.