Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022 నాటికి రెట్టింపుచేస్తానన్న మోడీ
- వాస్తవానికి రైతుల ఆదాయంలో క్షీణత
- రైతులపై పెరుగుతున్న రుణ భారం
- ఐదేండ్లలో 28,572 మంది రైతుల ఆత్మహత్యలు
- పీఎం కిసాన్ నుంచి రెండు కోట్ల మంది రైతులు తొలగింపు
'2022 నాటికి దేశంలోని రైతులందరి ఆదాయం రెట్టింపు చేస్తాం. అదే ప్రభుత్వం ఉద్దేశం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏండ్లు పూర్తి అవుతుంది. అప్పటికి... రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలి. అందుకనుగుణంగా మా ప్రభుత్వం పని చేస్తుంది' అని 2016 ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన రైతు ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే లక్ష్యం స్వాగతించదగినది. ప్రభుత్వ అధికారులు అనేకసార్లు పునరుద్ఘాటించినప్పటికీ 'రైతు' అంటే ఎవరు? రైతు ఆదాయం అంటే ఏమిటి? అనే దానిపై ప్రభుత్వం వద్ద స్పష్టత లేదు.
న్యూఢిల్లీ : 2022 ముగిసింది. 2023లోకి అడుగు పెట్టాం. సంవత్సరాలు మారుతున్నా.. రైతులు కన్నీళ్లు మాత్రం కారుతూనే ఉన్నాయి. పండిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం, మరోవైపు పంట పండించడానికి పెట్టుబడి వ్యయం ఏడాదికి ఏడాది పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల అప్పుల భారం పెరుగుతున్నది. జూలై 2018 - జూన్ 2019 ఏడాదిలో దేశంలో సగటున ఒక్కొ కుటుంబంపై రూ.74,121 రుణభారం ఉందని కేంద్రమే తెలిపింది. మరోవైపు ఏడాదికి ఏడాది రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. ప్రధాని మోడీ రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తామని ప్రకటించిన తరువాతే దేశంలో 28,572 (2017-2022) మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంలో భారీ కోత విధించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎంకిసాన్) పథకం నుంచి ఈ ఏడాదిలోనే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే దాదాపు రెండు కోట్ల మంది రైతులను తొలగించారు. 2022-2023లో 11వ విడుత (ఏప్రిల్-జూలై)లో 10,45,59,905 మంది రైతులకు పీఎంకిసాన్ పథకం వర్తిస్తే, 12వ విడుత (ఆగస్టు-నవంబర్)లో 8,42,14,408 మంది రైతులకు మాత్రమే పీఎం కిసాన్ వర్తించింది. 2,03,45,497 మంది రైతులు పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించబడ్డారు. రెండు కోట్ల మంది రైతులను తొలగించడంద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.5,108 కోట్లను మిగుల్చుకున్నది. 11వ విడుతలో రూ.22,551 కోట్లు విడుదల చేస్తే, 12 విడుతలో 17,443 కోట్లు కేటాయించింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన తరువాత కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 13న రైతుల ఆదాయం రెట్టింపు (డీఎఫ్ఐ)పై అశోక్ దల్వారు నేతృత్వంలోని 16 మంది నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 14 సంపుటాలలో నివేదికను సమర్పించింది. 2017 ఆగస్టులో మొదటి సంపుటా నివేదిక ఇచ్చింది. 2018 సెప్టెంబర్‌లో మరో నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ 16 సిఫార్సులను చేసింది. అందులో రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఉత్పత్తి వ్యయం కంటే 1.5 రెట్లు ఉండాలని తెలిపింది. అగ్రి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రూ. 2,000 కోట్లతో 22,000 గ్రామాల్లో (గ్రామీణ స్థాయి మార్కెట్లు, అగ్రిగేషన్ హబ్‌లు) ఏర్పాటు చేయాలనీ, 585 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. ధర, డిమాండ్ అంచనాలు, ఫ్యూచర్స్, ఎంపికలు, వ్యవసాయం కోసం ఎగ్జిమ్ విధానాలపై విధానాలను అభివృద్ధి చేయడానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వంటి కొన్ని సిఫార్సులను చేసింది.
ప్రకటన వెలువడిన వెంటనే.. నిటి ఆయోగ్ విధాన పత్రాన్ని తెచ్చింది. రైతుల ఆదాయాల బెంచ్‌మార్క్ అంచనాలు, వీటిని రెట్టింపు చేయడంపై వివరాలను అందిస్తూ నిటి ఆయోగ్ వ్యవసాయ ఇన్ఛార్జ్ సభ్యుడు రమేష్ చంద్ రచించారు. ఇది రైతుల ఆదాయానికి సంబంధించిన సూటి గణన, ఇంతకు ముందు వివిధ అధ్యయనాలలో ఉపయోగించిన వివరాలే ఉన్నాయి. పాలసీ పేపర్లో 2015-16 వరకు సాగుదారుల ఆదాయాల అంచనాలు ఉన్నాయి. దానిని ఆధార సంవత్సరంగా పరిగణిస్తారు. దాని డేటా ప్రకారం 2004-05, 2011-12 మధ్య 7.5 శాతం పెరుగుదల నుండి 2011-12, 2015-16 మధ్య ఒక్కో సాగుదారునికి నిజమైన రైతు ఆదాయం ఏడాదికి 0.44 శాతం పెరిగింది. ఇది 1999-2000, 2004-05 మధ్య మొదటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ-1) ప్రభుత్వ కాలంలో ఏడాదికి 0.55 శాతం తగ్గింది.
రైతు ఆదాయంలో క్షీణత
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సిట్యుయేషన్ అసెస్మెంట్ సర్వే (ఎస్ఏఎస్) ఆధారంగా పంటల వ్యవసాయం వల్ల రైతు కుటుం బాల ఆదాయం 2012-13, 2018-19 మధ్య ఏడాది 1.5 శాతం క్షీణించింది. దురదృష్టవశాత్తూ, 2018-19 తరువాత ఎటువంటి సర్వేలు జరగనందున, 2022లో రైతుల ఆదాయాన్ని అంచనా వేయడానికి మార్గం లేదు. 2015-16 తరువాత రైతు ఆదాయంలో క్షీణత ఉంది. నాబార్డ్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే (ఎన్ఏఎఫ్ఐఎస్)లో భాగంగా గ్రామీణ కుటుంబాల సర్వే వ్యవసాయ కుటుంబాల ఆదాయానికి సంబంధి ంచిన ఇతర డేటా ఎస్ఏఎస్కి భిన్నంగా ఉంది. అయితే ఆదాయాల వృద్ధి క్షీణతను స్పష్టం చేసింది. వ్యవసాయ కుటుంబాల ఆదాయం 2015-16, 2018-19 మధ్య ఏడాది 1.7 శాతం పెరిగిందని, ఇది మునుపటి కాలంలోని 3.8 శాతం వృద్ధి రేటు కంటే సగం కంటే తక్కువగా ఉందని స్పష్టం చేసింది.