Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాణిక్ సర్కార్ హామీ
అగర్తలా : బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపురలో మొత్తంగా 10,323 మంది ఉపాధ్యాయులను తొలగించారని, వామపక్ష సంఘటన (లెఫ్ట్‌ఫ్రంట్) తిరిగి అధికారంలోకి వస్తే ఆ ఉపాధ్యాయులందరినీ వారి ఉద్యోగాల్లో నియమిస్తామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మాణిక్ సర్కార్ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకు బాసటగా నిలవాలని తమ పార్టీ భావించిందని చెప్పారు. కుమార్‌ఘాట్‌లో జరిగిన పార్టీ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన ఆయన ఒక పత్రికా సమావేశంలో మాట్లాడారు. గతంలో ప్రజల సమస్యలను పరిష్కరించింది వామపక్ష ప్రభుత్వమేనని, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్న తీరుతో ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఆందోళన చెందుతున్నారని అన్నారు. రిట్రెంచ్ అయిన ఉపాధ్యాయుల్లో మరో టీచర్ దీపికా దాస్ చౌదరి (53) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారు జామున మరణించారు. బిజెపి దీపికా దాస్ లాంటి ఉపాధ్యాయులందరినీ తొలగించిన నాటి నుంచి వారంతా తీవ్రమైన మనోవేదనకు గురై అస్వస్థతకు గురౌతున్న సంగతి తెలిసిందే. దీపికా మరణంతో ఇప్పటి వరకు మరణించిన లేదా ఆత్మహత్య చేసుకున్న రిట్రెంచ్ ఉపాధ్యాయల సంఖ్య 148కి చేరింది.
మోసపూరిత బిజెపిని సాగనంపుదాం..
త్రిపురలో వామపక్ష సంఘటన అధికారంలో వుండగా, ఏ ఒక్కరూ కూడా ప్రతిపక్ష నేతలపై దాడికి దిగలేదని, అటువంటిది ఇప్పుడు సిపిఎం, ఇతరులపై బిజెపి ఎందుకు దాడి చేస్తోందో చెప్పాలని సిపిఎం త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి ప్రశ్నించారు. కొత్త ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆయన ప్రజలను కోరారు. వైష్ణవ్పూర్, మనుఘాట్ల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయితీ ఎన్నికలేవైనా బిజెపి అభ్యర్ధులు బల ప్రయోగంతో గెలుస్తున్నారని విమర్శించారు.
ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం పోరాడే సంవత్సరం 2023 అని అన్నారు.