Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భరించలేని స్థాయిలో ధరలు..తగ్గుతోన్న వినియోగం
- కాంప్లెక్స్, పొటాష్‌లకు దూరం
- యూరియా, డీఏపీ వైపు మొగ్గు
నానాటికీ పెరుగుతున్న ఎరువుల ధరలను భరించలేక రైతులు అనివార్యంగా వాటి వినియోగాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాస్త తక్కువ రేట్లపై లభించే యూరియా, డీఏపీ వంటి ఎరువుల వైపు రైతాంగం మొగ్గు చూపుతున్నది. దాదాపు మూడేండ్లుగా ఒక వైపు కోవిడ్ సంక్షోభం సాగుదారులను అతలాకుతలం చేయగా, ఇదే సమయంలో కేంద్రం ఎరువుల సబ్సిడీలకు కోతలు పెట్టింది.
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయంటూ రాయితీలను తగ్గించడంతో పాటు నగదు బదిలీ (డీబీటీ) విధానాన్ని అమలు చేస్తోంది. పోషకాధారిత సబ్సిడీ (ఎన్బిఎస్) పాలసీతో యూరియా మినహా తతిమ్మా ఎరువుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఎరువుల కంపెనీలు ఇష్టానుసారం కాంప్లెక్స్‌్, పొటాష్ ఎరువుల ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ఎరువుల ధరలు కంపెనీ కంపెనీకో విధంగా, రోజుకో తీరుగా మారిపోతున్నాయి.
తక్కువ ధర ఫెర్టిలైజర్ వైపు
కేంద్రం ఎన్బీఎస్ పాలసీలో నైట్రోజన్ (ఎన్)కు మాత్రమే సబ్సిడీ ఇచ్చి ధరలను నిర్ణయిస్తోంది. ఫాస్పరస్ (పీ), పొటాష్ (కే) ఎరువులకు ఎప్పటికప్పుడు పోషక ఆధారంగా నిష్పత్తి ప్రాతిపదికన కిలోల వంతున సబ్సిడీ నిర్ణయిస్తోంది. పెరిగిన ముడి సరుకులకు తగ్గట్టు సబ్సిడీ నిర్ణయించకుండా ఎంతో కొంత నిర్ణయించి చేతులు దులుపుకుంటోంది. దాంతో కాంప్లెక్స్, పొటాష్ ఎరువుల ధరలు ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరిగాయి. గత ఖరీఫ్‌కు ఈ ఏడాది ఖరీఫ్‌కు పెరుగుదల 30 శాతం నుంచి 94 శాతం వరకు ఉంది. ఎంవోపీ బస్తా రూ.875 నుంచి 1,700 అయింది. 20-20-0 రేటు రూ.975 నుంచి 1,470 అయింది. 28-28-0 ధర రూ.1,275 నుంచి 1,700 అయింది. 14-35-14 రేటు రూ.1,275 ఉన్నది కాస్తా 1,700 అయింది. ఫలితంగా ఈ ఎరువుల వినియోగాన్ని రైతులు తగ్గించుకున్నట్టు విక్రయాల గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉండగా, కేంద్రం సబ్సిడీ ఇచ్చి ధరలు నిర్ణయించే యూరియా బస్తా రూ.268 కే లభిస్తుండటంతో యూరియా సేల్స్ గత ఏడాది కంటే స్వల్పంగా పెరిగాయి. డీఏపీ బస్తాపై సబ్సిడీ పోను నిరుడు రూ.1,200కి లభించింది. ఈ ఏడాది రూ.1,350 అయ్యింది. కాంప్లెక్స్ ధరలతో పోల్చితే డీఏపీ రేటు తక్కువ కావడంతో ఆ ఎరువు అమ్మకాలు పెరిగాయి. రైతులు కోరుకున్న ఎరువులు అందుబాటు ధరల్లో దొరకపోవడం, సరఫరాలో ఇబ్బందులు, కృత్రిమ కొరత కూడా ఎరువుల వినియోగం తగ్గుదలకు కొంత వరకు కారణమని చెబుతున్నారు.