Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్లో 16 నెలల గరిష్టానికి
- నిరుద్యోగ రేటు 8.30 శాతంగా నమోదు : సీఎంఐఈ
న్యూఢిల్లీ : దేశంలోని మోడీ పాలన నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నది. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు, ప్రయివేటీకరణే లక్ష్యంగా ప్రభుత్వ ఆస్థుల అమ్మకం, కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వడం.. వెరసి భారత్‌లో నిరుద్యోగం ఏటికేడూ పెరిగిపోతున్నది. ఈ సారి కూడా భారత్‌లో గతేడాది డిసెంబర్లో నిరుద్యోగ రేటు 8.30 శాతానికి పెరిగింది. ఇది 16 నెలల గరిష్టం కావడం గమనార్హం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) నుంచి వెలువడిన సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
సీఎంఐఈ సమాచారం ప్రకారం.. భారత్‌లో నిరద్యోగ రేటు గతేడాది నవంబర్‌లో 8 శాతంగా ఉన్నది. అయితే, అది డిసెంబర్లో 8.30 శాతానికి పెరగడం గమనార్హం. ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ నిరుద్యోగ రేటు ఆకాశాన్ని చూసింది. ఇక్కడ నిరుద్యోగ రేటు నవంబర్‌లో 8.96 శాతంగా నమోదు కాగా.. అది డిసెంబర్లో 10.09 శాతానికి ఎగబాకింది. అయితే, గ్రామీణ భారతంలో మాత్రం నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. ఇది నవంబర్‌లో 7.55 శాతం నుంచి డిసెంబర్లో 7.44 శాతానికి పడిపోయింది. కాగా, డిసెంబర్లో పెరిగిన నిరుద్యోగ రేటు హర్యానాలో అధికంగా 37.4 శాతంగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ (28.5 శాతం), ఢిల్లీ(20.8 శాతం) లు ఉన్నాయి.
దేశంలో నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగంపై దేశంలోని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, రానున్న కరోనా విపత్తు వేళ దేశంలోని లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చూపడం మోడీ సర్కారు ముందున్న అతిపెద్ద సవాల్ అని వారు అన్నారు. 2024లో దేశంలో రానున్న సాధారణ ఎన్నికల్లో దీని ప్రభావం పడనున్నదనీ, బీజేపీ ప్రభుత్వానికి ఇది ప్రతికూలంగా మారనున్నదని తెలిపారు.
దేశంలో నిరుద్యోగం విషయంలో ప్రతిపక్షాలు ఇప్పటికే మోడీ సర్కారు తీరును ప్రజల ముందుంచుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే తన 'భారత్ జోడో' యాత్ర పేరిట కన్యాకుమరి నుంచి జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు మార్చ్‌ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా, మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మోడీ సర్కారును ప్రశ్నిస్తున్నారు. భారత్ దృష్టి కేవలం జీడీపీపై నుంచి ఉద్యోగ, ఉపాధి కల్పనలో వృద్దికి మారాలని రాహుల్ సూచించారు. ముఖ్యంగా, దేశంలో పెరుగుతున్న అధిక దరలు, నిరుద్యోగం, బీజేపీ విభజన రాజకీయాలపై రాహుల్ ఫోకస్ పెడుతూ ముందుకు సాగుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీరు పట్ల అసంతృప్తితో ఉన్న సాధారణ ప్రజలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి రాహుల్ యాత్రకు మంచి స్పందన లభిస్తున్నది.