Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023లో 9 రాష్ట్రాలకు వరుస ఎన్నికలు..
- త్రిపుర నుంచి తెలంగాణ వరకు 116 లోక్‌సభ స్థానాల పరిధిలో
న్యూఢిల్లీ : తెలంగాణ సహా..అనేక రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీకు ఫిబ్రవరి-మార్చి మధ్య ఎన్నికలు జరగనున్నాయని సమాచారం. ఈ రాష్ట్రాల ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చితో ముగిసిపోతోంది. 2023లో మొత్తంగా 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రస్తుత పాలకులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతులు, కార్మికులు, యువత, మహిళలు ఆందోళనబాట పడుతున్నారు. 9 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 116 లోక్‌సభ స్థానాల పరిధిలో ఉండబోతున్నాయి. దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, మతపరమైన విభజనలు, సామాజిక అస్థిరతలు, రాజకీయ కక్షసాధింపు చర్యలు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోడీ వ్యక్తిగత ఛరిష్మా, మతపరమైన అంశాలు, హిందూత్వం ఆధారంగా పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మోడీ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. హిందువుల్ని మతపరంగా ప్రభావితం చేయడానికి సోషల్‌మీడియాను నమ్ముకుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేస్తోంది. బడ్జెట్ కాగితాలపై అంకెలను ఘనంగా చూపుతూ...మరోవైపు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. సెప్టెంబర్‌లో జరిగే జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. విదేశీ వ్యవహారాల్లో, అంతర్జాతీయ సంబంధాల్లో తమ విజయంగా ఈ సదస్సును చూపుతూ ప్రచారం చేసుకోవటాన్ని బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రారంభించారు. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో ఓటర్లను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్, యూట్యూబ్‌లో వీడియోలు రాబోతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తిచేయటం ద్వారా హిందువుల ఓట్లను పోలరైజ్ చేయాలనే వ్యూహానికి ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం పదును పెడుతోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌లో జోష్‌ను నింపుతోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటీవలే పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే...కాంగ్రెస్ అంతర్గత పోరుల్ని చక్కదిద్దే పనుల్ని నిమగమయ్యారు. అనేక రాష్ట్రాల్లో ఓడుతున్నా, ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను కలుపుకొని బీజేపీకి గట్టిగా సవాల్ విసిరే అవకాశాలు కాంగ్రెస్‌కు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.