Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మహిళలు మృతి
- కానుకల పంపిణీ సందర్భంలో గుంటూరులో ఘటన
గుంటూరు : గుంటూరు వికాస్ నగర్లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చేపట్టిన జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకల పంపిణీలో పెద్ద ఎత్తున తొక్కిసలాట తలెత్తి ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా కొంతమంది మహిళలు స్వల్ప గాయాలతో ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరారు. మొత్తంగా 25 మంది గాయపడ్డారు. మృతుల్లో గుంటూరు ఎటిఅగ్రహారం ప్రాంతానికి చెందిన గోపిశెట్టి రమాదేవి (52), గుజ్జనగుండ్లకు చెందిన అసియా (34) ఉన్నారు. మరో మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని కొంతమందికి కానుకలు పంపిణీ చేసి సభలో ప్రసంగించిన అనంతరం సాయంత్రం 6.30 గంటలకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన కొద్దిసేపటికి నిర్వాహకులు కానుకలు పంపిణీ కొనసాగిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. బహిరంగ సభలో ఎక్కువమంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన బారికేడ్లకు దగ్గరగా లారీని ఉంచి కానుకలు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట వల్ల బారికేడ్లు విరిగిపడ్డాయి. మహిళంతా కిందపడిపోగా ఒకరిపై మరొకరు పడడంతో ఊపిరాడక పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పంపిణీని నిలిపేసిన నిర్వాహకులు... అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈలోగా రమాదేవి అనే మహిళ అపస్మారక స్థితికి వెళ్ళారు. ఆమె ఛాతీపై ఒత్తిడి చేసి స్పృహలోకి తీసుకొచ్చేందుకు కొంతమంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)కు తరలించారు. అక్కడ చికిత్స పొందే క్రమంలో ఇద్దరు మరణించారు. మిగతా ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉంది. ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంగణాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. కాగా, నెల్లూరు జిల్లా కందుకూరులో గత నెల 28న చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ సంఘటన మరవక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.