Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఏపీ రాష్ట్ర మహాసభ ప్రారంభం
- భీమవరంలో భారీ బహిరంగ సభ, మహా ప్రదర్శన
ఉద్యమాల పురిటిగడ్డ... రెండో బార్డోలిగా పేరొందిన భీమవరం ఎరుపురంగు పులుముకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కార్మికుల నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు తలపెట్టిన సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభ పతాకావిష్కరణతో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సోమవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన వివిధ తరగతుల కార్మికులతో పట్టణం కిటకిటలాడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై గర్జిస్తూ అత్యంత క్రమశిక్షణాయుతంగా సాగిన మహాప్రదర్శన ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. ప్రారంభ సభ, బహిరంగ సభల్లో జాతీయ, రాష్ట్ర నాయకుల ప్రసంగాలు కార్మిక లోకానికి దిశానిర్దేశం చేసేలా సాగాయి. మూడు రోజులపాటు సాగనున్న మహాసభలో తొలిరోజు చైతన్యవంతంగా, సమరశీలంగా సాగగా, మంగళ, బుధవారాల్లో కార్మిక, ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించడంతోపాటు వాటి పరిష్కారానికి డిమాండ్ల రూపంలో పలు తీర్మానాలను ఆమోదించనున్నారు.
ఏలూరు : దేశంలో అనేక భాషలు, రకరకాల ఆహారపు అలవాట్లు, అనేక విధాలుగా వస్త్రధారణ పద్దతులు ఉన్నప్పటికీ అంతా కలిసిమెలిసి జీవిస్తుండడం ఒక ప్రత్యేకతగా ఉందని, అలాంటి లౌకికతత్వానికి బిజెపి, ఆర్ఎస్ఎస్ రూపంలో ప్రమాదం ఏర్పడుతుందని కేరళ న్యాయ, పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ తెలిపారు. సీఐటీయూ 16వ ఏపీ రాష్ట్ర మహాసభ సందర్భంగా సోమవారం సాయంత్రం భీమవరంలోని కేశవరావు హైస్కూల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగింది.
తొలుత పాత బస్టాండ్ నుంచి జువ్వలపాలెం రోడ్డు, నటరాజ్ థియేటర్, వెంకటేశ్వరస్వామి గుడి, ఉండి రోడ్డు గుండా బొంబే స్వీట్స్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్, పోలీసు బొమ్మ సెంటర్, అన్నపూర్ణ థియేటర్ మీదుగా కొత్త బస్టాండ్ వరకూ వేలాది మంది కార్మికులతో మహాప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శనలో జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, వేలాది కార్మికులు పాల్గొన్నారు. సుభాని, సూర్యనారాయణ స్మారక ప్రాంగణం (కేశవరావు గ్రౌండ్)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథి పి.రాజీవ్ మాట్లాడుతూ బానిసలుగా ఉంటామని బ్రిటీష్ వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలినోళ్లు, స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేనోళ్లు నేడు దేశాన్ని పాలిస్తున్నారన్నారు. 1925లో ఏర్పడిన ఆర్ఎస్ఎస్... ప్రజాస్వామిక, లౌకిక దేశంగా ఉన్న భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని చూస్తోందన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రమాదమన్నారు.
ప్రధాని సైతం హిందూ దేశంగా చెబుతారని, అయితే రాజ్యాంగ కమిటీలో దీనిపై అప్పట్లో చర్చ జరిగిందని, చర్చల తర్వాత భారతదేశంగా రాజ్యాంగ సభ నిర్ణయించిందని గుర్తు చేశారు. అనేక భాషలు, మతాలు ఉండడంతో రాజ్యాంగంలో మనం అనే సంబోధన ఉండాలని నిర్ణయించారన్నారు. రాజ్యాంగంలో జాతీయ భాషగా హిందీ అని ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. దేశంలో అనేక భాషలను జనం మాట్లాడడంతో 22 భాషలు అధికారిక భాషలుగా ఉన్నాయన్నారు. ప్రాంతీయ భాషలు అని ఎక్కడా లేదని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారన్నారు. రాజ్యాంగంలోని క్రిమినల్ సివిల్ కోడ్‌ను సవరించి హిందూ, ముస్లిములకు ఒకే చట్టం అమలుకు పూనుకున్నారని విమర్శించారు. పౌరసత్వం మతాల ఆధారంగా లేదని, పాకిస్తాన్, బర్మా వంటి దేశాల నుంచి వస్తున్న వారికి పౌరసత్వం ఇవ్వకపోవడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని తెలిపారు. ఉదారవాద విధానాలు తెచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు.
కేరళ మోడల్ ఇదే..
కేరళలో దఫదఫాలుగా వామపక్ష ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు గెలిపించారని, 2021లో మాత్రం చరిత్ర తిరగరాశారని పి.రాజీవ్ పేర్కొన్నారు. భూపంపిణీ, నాణ్యమైన ఆరోగ్యం, విద్య వంటి విధానాలు కేరళలో అమలు చేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్ల ఏర్పాటుతో పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యం ఖరీదైందని తెలిపారు. కేరళలో గ్రామస్థాయిలో మెరుగైన వైద్యం అందించడమే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో గుండెమార్పిడి, వైద్యకళాశాలల్లో అవయవ మార్పిడులు జరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందుతోందని తెలిపారు. శిశుమరణాల్లో అమెరికాతో సమానంగా ఉందన్నారు. ఇది కేరళ మోడల్ అని వివరించారు. ఇతర రంగాల్లోనూ కేరళ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 42 ప్రభుత్వ పరిశ్రమల్లో 22 లాభాల్లో ఉన్నాయన్నారు. మూసివేస్తానన్న కేంద్ర సంస్థలను సైతం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూమి కొరత ఉందని, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేరళలో ప్రతి ఏడాదీ ఒక ప్రణాళిక ప్రకటించి అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మాట్లాడుతూ ప్రయివేటీకరణ పేరుతో కేంద్రం ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తోందన్నారు. నిరుద్యోగం 8.3 శాతానికి పెరిగిందని తెలిపారు. పన్నుల పెంపుతో ఈ ఏడాది జిఎస్టి రూ.1.5 లక్షల కోట్లు వచ్చిందన్నారు. అయినా, పేదలపై భారాలు మోపుతున్నారన్నారు. సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ.గఫూర్, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్ సాబ్జి, గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు, బేబిరాణి తదితర నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఉపాధ్యక్షులు సాయిబాబు, నాయకులు మంతెన సీతారాం, ఆర్.లక్ష్మయ్య, వి.ఉమామహేశ్వరరావు, కె.రాజారామ్మోహన్రారు, డిఎన్‌విడి.ప్రసాద్, జెఎన్‌వి.గోపాలన్, బి.బలరాం, ఆర్.లింగరాజు, బి.వాసుదేవరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.