Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థించిన సుప్రీంకోర్టు
- ధర్మాసనంలో మిగిలిన నలుగురు సభ్యులతో విభేదించిన జస్టిస్ బి.వి.నాగరత్న
- పౌరులను తీవ్రంగా ప్రభావితం చేసింది.. కేంద్రం తీరు చట్టవిరుద్ధం..
- కేవలం 24 గంటల్లో కసరత్తు ముగించారని వెల్లడి
నోట్లరద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని 4:1 మెజార్టీతో అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 2016లో నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 7 విచారణను పూర్తి చేసి, తీర్పు రిజర్వ్ చేసింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బి.ఆర్.గవారు, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 382 పేజీల తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును నలుగురు న్యాయమూర్తులు సమర్థించగా, జస్టిస్ బి.వి.నాగరత్న తప్పుబట్టారు.
న్యూఢిల్లీ : నోట్ల రద్దు లక్ష్యాలు ఏమైనప్పటికీ, దానిని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చట్టవిరుద్ధమని జస్టిస్ నాగరత్న తీవ్రంగా ఆక్షేపించారు. రూ.2వేల నోటు కూడా విడుదలైంది కాబట్టి, నోట్ల రద్దు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. ''దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ రక్షణ కవచం. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు చేసిన చరిత్రను ఉదహరించాను. ఆర్థిక లేదా ఆర్థిక నిర్ణయాల మెరిట్‌పై కోర్టు కూర్చోవడం కాదు. సెక్షన్ 26(2)ని పరిశీలించడం అంటే కూర్చోవడం కాదు. నోట్లరద్దు మెరిట్ల గురించి ఈ కోర్టు గీసిన లక్ష్మణ రేఖలో బాగానే ఉంది'' అని అన్నారు. ''కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నోట్ల రద్దు అనేది బ్యాంకులు చేసే దానికంటే పౌరులను ప్రభావితం చేసే చాలా తీవ్రమైన సమస్య'' అని పేర్కొన్నారు. ''పార్లమెంట్ లేకుండా ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందదు.. అటువంటి ముఖ్యమైన నిర్ణయాలకు పార్లమెంటు దూరంగా ఉండదు'' అని ఆమె అన్నారు.
ఆర్బీఐకి స్వతంత్ర అధికారం లేదు : జస్టిస్ బి.ఆర్.గవారు
నోట్లరద్దును తీసుకురావడానికి ఆర్బీఐకి స్వతంత్ర అధికారం లేదని జస్టిస్ గవారు పేర్కొన్నారు. మెజారిటీ అభిప్రాయాన్ని జస్టిస్ గవారు చదివి వినిపించారు. ''ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన విషయాలలో జోక్యం చేసుకునే ముందు చాలా సంయమనం పాటించాలి. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినందున నిర్ణయం తీసుకునే ప్రక్రియను తప్పుపట్టలేమని పేర్కొంది. మేము అలాంటి అభిప్రాయాలను న్యాయ వ్యవస్థతో భర్తీ చేయలేము'' అని అన్నారు. ''కేంద్రం, ఆర్బీఐ మధ్య ఆరు నెలల పాటు సంప్రదింపులు జరిగాయి. అటువంటి చర్యను తీసుకురావడానికి సహేతుకమైన సంబంధం ఉంది. దామాషా సిద్ధాంతం వల్ల పెద్ద నోట్ల రద్దు జరగలేదు'' అని పేర్కొన్నారు. నోట్లరద్దు నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని, నోట్ల మార్పిడికి 52 రోజుల వ్యవధి అసమంజసమని చెప్పలేమని పేర్కొన్నారు. ఆర్బిఐతో సంప్రదింపులు జరిపి ఆర్బిఐ చట్టంలోని సెక్షన్ 26(2) కింద నోట్ల రద్దును కేంద్రం తీసుకురావచ్చని అన్నారు. నోట్లరద్దు లక్ష్యాలు నెరవేరాయా? లేదా? అన్నది ముఖ్యం కాదని పేర్కొన్నారు.
చట్టవిరుద్ధం : జస్టిస్ బి.వి.నాగరత్న
నోట్లరద్దు చర్య, నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. ధర్మాసనంలోని మిగిలిన నలుగురు సభ్యుల అభిప్రాయాలతో జస్టిస్ నాగరత్న విభేదించారు. ప్రతి ప్రశ్నకు సమాధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ భిన్నమైన అసమ్మతి తీర్పును వెలువరించారు. ''రిజర్వ్ బ్యాంక్ తగిన శ్రద్ధ చూపలేదు. కేవలం 24 గంటల్లోనే కసరత్తును ముగించారు. దీన్ని ఆర్బిఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం సిఫార్సుగా భావించలేం. నోట్ల రద్దు ప్రతిపాదనను పరిశీలిస్తున్నప్పుడు ఆర్బీఐ దృష్టిలో ఎటువంటి దరఖాస్తు లేదు. ఆర్బిఐ పత్రాల్లో ''కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం'' అని ఉంది. దీనినిబట్టి ఈ విషయంలో ఆర్బీఐకి స్వతంత్ర ఆలోచన లేదని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు స్వతంత్రంగా నోట్ల రద్దును సిఫారసు చేసి ఉండాలి. ఇది ప్రభుత్వం సూచనల ప్రకారం అమలు జరపకూడదు'' అని అన్నారు.
సుప్రీం సమర్ధించిందని భావించలేం !
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు ఈ చర్యను న్యాయ స్థానం సమర్ధించినట్లగా భాష్యం చెప్పలేమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చర్యపై 4:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు, ఇటువంటి నిర్ణయం తీసుకునే చట్టబద్ధమైన హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వుందంటూ దాన్ని ప్రత్యేకంగా పరిగణించింది. 1934 నాటి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2)ను ఇది ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. అయితే పెద్ద నోట్ల రద్దును చేపట్టాలని ఆర్బీఐ, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ ఆర్బీఐ చట్టంలోని ఈ సెక్షన్ పేర్కొంటోందంటూ సుప్రీం న్యాయమూర్తుల్లో ఒకరు వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆర్బీఐ అభిప్రాయాన్ని కోరిన కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల, ఈ నిర్ణయం అమలు చేయడానికి ముందుగా పార్లమెంట్ ఆమోద ముద్రను తీసుకోవాల్సి వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి, ఆ చర్య వల్ల సాధించాలనుకున్న లక్ష్యాలకు మధ్య సహేతుకమైన సంబంధముందని మెజారిటీ తీర్పు వ్యాఖ్యానించింది. అయితే, ఈ లక్ష్యం నెరవేరిందా లేదా అనేదానితో సంబంధం లేదని పేర్కొంది. ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి చట్టబద్ధమైన హక్కు వుందని సమర్ధిస్తూ ఇచ్చిన ఈ మెజారిటీ తీర్పు, ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రభావం గురించి అస్సలు మాట్లాడలేదు. ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కోట్లాదిమంది ప్రజలకు ఉపాధి కలిగించే దేశ అసంఘటిత రంగం తీవ్రంగా విధ్వంసానికి గురైంది. చిన్న తరహా పారిశ్రామిక రంగాన్ని స్తంభింపజేసింది. కోట్లాదిమంది జీవనోపాధులను దెబ్బతీసింది. 2016లో ఈ నిర్ణయం తీసుకున్న ఒక నెలలోనే 82మంది తమ ప్రాణాలు కోల్పోయారని వార్తలందాయి. పైగా, నల్ల ధనాన్ని వెలికి తీయడం, విదేశీ బ్యాంక్‌ల నుండి ఆ మొత్తాలను వెనక్కి రప్పించడం, నకిలీ కరెన్సీ సమస్యను తుదముట్టించడం, తీవ్రవాదానికి నిధులు అందకుండా చేయడం, అవినీతిని నిర్మూలించడం, ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణిని తగ్గించడమన్నవి ఈ వినాశకర నిర్ణయాన్ని సమర్ధిస్తూ పేర్కొన్న లక్ష్యాలని, కానీ వాటిల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. దీనికి విరుద్ధంగా, ప్రజల్లో చలామణిలో వున్న కరెన్సీ, పెద్ద నోట్ల రద్దు సందర్భంగా రూ.17.7లక్షల కోట్ల నుండి ఇప్పుడు రూ.30.88 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్బిఐ పేర్కొంది. అంటే 71.84శాతం పెంపు నమోదైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు, ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి గల హక్కును మాత్రమే సమర్ధించింది, అంతేకానీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తలెత్తే పర్యవసానాలను ఏ రకంగానూ సమర్ధించలేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది.