Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా భాషపై పట్టున్న వ్యక్తి కామ్రెడ్ జానకి బల్లభ్
- ఆయన సేవలు వెలగట్టలేనివి : తపన్‌సేన్
న్యూఢిల్లీ : చైనా భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతిపై సుదీర్ఘకాలం కృషి చేసిన కామ్రెడ్ జానకి బల్లభ్ మృతికి సీఐటీయూ ఘనమైన నివాళి అర్పించింది. తనకున్న అంతర్జాతీయ అనుభవాన్ని సీఐటీయూ కోసం వినియోగించారని, వివిధ దేశాల ట్రేడ్ యూనియన్లతో సంబంధాలు నెరపారని 'సీఐటీయూ' ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ అన్నారు. సీఐటీయూ అంతర్జాతీయ విభాగంలో అత్యంత సుదీర్ఘకాలం జానకి బల్లభ్ పనిచేశారని, విభాగాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయటంలో ఆయన కృషి ఎంతోవుందని తపన్‌సేన్ చెప్పారు. చైనీస్ అనువాద సాహిత్యంలో ఎనలేని సేవలు అందించిన జానకి బల్లభ్ 30 డిసెంబర్ 2022న కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో 94ఏండ్ల వయస్సులో ఆయన చైనాలోనే మృతి చెందారు. దశాబ్దానికిపైగా చైనాలోనే తన కుమారులతో కలిసి ఉంటున్నారు. సీఐటీయూ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన జానకి బల్లభ్ 1956లో చైనాకు వెళ్లారు. అక్కడ ఫారిన్ లాంగ్వేజెస్ ప్రెస్‌లో పనిచేశారు. చైనీస్ రచనలను హిందీలోకి అనువదించారు. మావో జెడాంగ్‌కు చెందిన 'సెలెక్టెడ్ వర్క్స్', చైనీస్ క్లాసిక్ నవల 'జర్నీ టు ది వెస్ట్', ప్రముఖ చైనీస్ రచయిత లు జున్ రచనల్ని హిందీలోకి అనువదించారు. ఇటీవలి కాలంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పుస్తకం 'ది గవర్నెన్స్ ఆఫ్ చైనా' మొదటి, రెండవ సంపుటాన్ని హిందీలోకి రచించారు.
కామ్రెడ్ బల్లభ్ భారత్‌లోని చైనా రాయబార కార్యాలయంలో పనిచేశారు. ఆ తర్వాత కామ్రెడ్ ఎం.కె.పాండే, సీఐటీయూతో సన్నిహితంగా ఉన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 'సీఐటీయూ'లో అంతర్జాతీయ వ్యవహారాల బాధ్యతల్ని అప్పగించారు. కామ్రెడ్ పాండే మార్గదర్శకత్వంలో సీఐటీయూ అంతర్జాతీయ విభాగాన్ని అభివృద్ధి చేశారు. వివిధ దేశాల ట్రేడ్ యూనియన్ ఉద్యమంతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో సీఐటీయూకి సహాయం చేశారని బల్లభ్ చేసిన కృషిని సీఐటీయూ గుర్తుచేసుకుంది. ఆయన మృతికి ఘనమైన నివాళి అర్పించింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.