Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ సేవక్ పత్రిక వ్యవస్థాపక దినోత్సవంలో తరిగామి
చండీగడ్ : మనందరం కలిసికట్టుగా ఆలోచిస్తూ, కలిసి జీవిస్తూ, కలలు గంటూ, మతోన్మాద, ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మహ్మద్ యూసుఫ్ తరిగామి పిలుపునిచ్చారు. పంజాబ్ దినపత్రిక దేశ్ సేవక్ 27వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని చండీగఢ్‌లోని బాబా సోహన్ సింగ్ భక్న భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 1920ల్లో జలంథర్ నుంచి వెలువడే ఆ పత్రిక, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు ఎదురైనా తన వార్తలు, సంపాదకీయ విధానంలో ఎలాంటి రాజీ ధోరణి కనబరచలేదని తరిగామి ప్రశంసించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నాల్గవ ఎస్టేట్ అయిన పత్రికా రంగం తన అస్తిత్వాన్ని, అధికారాన్ని కోల్పోతోందంటూ విచారం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి వెళుతున్న మీడియా గోడీ మీడియాగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, సమాజంలో అణచివేతకు గురవుతున్న వర్గాల సమస్యలను నిర్భయంగా ప్రస్తావిస్తున్నందుకు ఆయన దేశ సేవక్‌ను అభినందించారు. జమ్ముకాశ్మీర్ పరిస్థితులపై వ్యాఖ్యానిస్తూ ఆయన, దేశంలోని ఇతర పౌరుల మాదిరిగానే మనమూ కూడానని, మనకు కూడా వారిలాగే కలలు, ఆకాంక్షలు వున్నాయని, మనకూ మంచి విద్య, వైద్యం, అన్నింటినీ మించి పరువు, మర్యాదలతో కూడిన జీవితం వుండాలని అన్నారు. భూప్ చంద్ చన్నో అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుఖ్విందర్సింగ్ షెకాన్, గురుదర్శన్ సింగ్ పాల్గొన్నారు.