Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘటిత రంగంలో ఉద్యోగాలు పెరిగాయంటూ మోడీ సర్కార్ ప్రచారం
- ఈపీఎఫ్‌వో నెలవారీ 'పే రోల్' గణాంకాల ఆధారంగా వెల్లడి
- నెలవారీ కాదు.. వార్షిక డేటాతో వాస్తవాలు తెలుస్తాయి : ఆర్థిక నిపుణులు
- 2019-20లో చందాదారులు 4.92 కోట్లమంది
- 2021-22లో ఈపీఎఫ్‌వో చందాదారులు 4.63కోట్లమంది
- తగ్గుదల 5.3శాతం
ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య పెరిగింది.. చూశారా? దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతోంది.. అని మోడీ సర్కార్ నిస్సిగ్గిగా 'గణాంకాల్ని వక్రీకరిస్తోంది'. నెలవారీ ఈపీఎఫ్‌వో పే రోల్ సంఖ్యను ఆధారంగా చేసుకొని నిరుద్యోగ సమస్య తగ్గుతోందని కేంద్రం నమ్మించడానికి సిద్ధమైంది. ఎన్నికలకు ముందు మాటల గారడీతో ప్రస్తుత పాలకులు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. పాలనలోనూ అదే ఒరవడితో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఉద్యోగాలు పోతున్నాయి. నిరుద్యోగ సమస్య పరిష్కరించరా? అని ప్రతిపక్ష నాయకులు మోడీ సర్కార్‌ను నిలదీస్తున్నారు. దీనిని ఎదుర్కొనేందుకు 'ఈపీఎఫ్‌వో' పే రోల్‌ను కేంద్రం అడ్డుపెట్టుకుంటోంది.
న్యూఢిల్లీ : ఈపీఎఫ్‌వో చందాదార్లు, యాజమాన్యాల కంట్రిబ్యూషన్‌పై కేంద్రం మొదట అంచానాలు విడుదల చేస్తోంది. అటు తర్వాత అనేకమార్లు ఆ గణాంకాల్ని సవరిస్తోంది. ఉదాహరణకు మే 2021 అంచనాలకు, జులై 2021లో సవరింపులు విడుదలవుతున్నాయి. ఇదీ కేంద్రంలోని పాలకులు చేస్తున్న 'గణాంకాల గారడీ'. ముందు విడుదల చేసిన గణాంకాలతో ప్రజల్ని పాలకులు మభ్య పెడుతున్నారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్‌లో విడుదల చేసిన గణాంకాల్లో క్రితం నెలలకు సంబంధించి 11 సవరింపులు వేశారు. మే నెలలో 10 సవరింపులు, జూన్‌లో 9 సవరింపులు చేశారు. ఇలా ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే వరకూ గణాంకాల్ని సవరించుకుంటూ పోతున్నారు. దీంతో ఈ గణాంకాలపై విశ్వసనీయత దెబ్బతిన్నదని 'సీఎంఐఈ' ఎండీ, సీఈవో మహేశ్ వ్యాస్ తెలిపారు.
మూతపడుతున్న సంస్థలు
కరోనా తర్వాత రెండేండ్లలో ఉపాధిరంగంలో ఎన్నో సంస్థలు మూతపడ్డాయని ఈపీఎఫ్‌వో గణాంకాల్ని ప్రస్తావిస్తూ ఆంగ్ల దినపత్రిక ఒకటి వార్తాకథనం రాసింది. ఉద్యోగుల ఈపీఎఫ్‌వోకు యాజమాన్యాల తరఫున రంట్రిబ్యూషన్ అందుతుంది. కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్న యాజమాన్యాల సంఖ్య 2019-20లో 6,60,204 ఉండగా, 2021-22నాటికి ఆ సంఖ్య 5,91,184కు తగ్గింది. దాదాపు 10.5శాతం సంస్థలు మూతపడ్డాయని వార్తాకథనం విశ్లేషించింది. ఈపీఎఫ్‌వో నెలావారీ డాటాకు..వార్షిక డాటాకు పొంతన ఉండటం లేదనీ ఆ వార్తా కథనం ఆరోపించింది. ప్రతినెలా చందాదార్ల సంఖ్య పెరిగితే, రెండేండ్లలో చందాదార్ల సంఖ్య కూడా రెండు కోట్లు పెరగాలి. కానీ పార్లమెంట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం చందాదార్ల సంఖ్య 26లక్షలు తగ్గింది.
గణాంకాల్ని మార్చితే పోలా?
నిరుద్యోగం, ఉపాధి..ఇవి రెండూ నేడు దేశాన్ని తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యలు. మోడీ సర్కార్ కరోనా సంక్షోభ సమయంలో ఏకపక్షంగా చేపట్టిన లాక్డౌన్, కరోనా నియంత్రణ చర్యల ఫలితంగా ఎన్నో కోట్లమంది రోడ్డున పడ్డారు. ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగాలు పోయాయి. అటు తర్వాత దేశంలో ఆర్థికరంగం మాంద్యంలోకి కూరుకుపోయింది. పోయిన ఉద్యోగాలు మళ్లీ రాలేదు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మోడీ సర్కార్ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. సంఘటిత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు? వారి వేతనాలు ఎంతున్నాయి? అనేది అంచనావేసేందుకు 'ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (ఈపీఎఫ్‌వో)ను ఒక సూచికగా తీసుకుంటారు. ఈపీఎఫ్‌వో పే రోల్ డాటా 2018 వరకు వార్షిక పద్ధతిలో విడుదలయ్యేది. 2018 నుంచి నెలవారీగా విడుదల చేస్తూ వస్తున్నారు.
నెలవారీ గణాంకాలతో మోసం
'సీఎంఐఈ'కు చెందిన మహేశ్ వ్యాస్ ఏమంటున్నారంటే, '' పే రోల్ డాటా అనేది ఆ నెలలో పెరిగిన చందాదార్ల సంఖ్య మాత్రమే. దీనిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే వాస్తవ ముఖచిత్రం బయటకు రాదు'' అని అన్నారు. ఈపీఎఫ్‌వో తాజా గణాంకాల ప్రకారం, 2021-22 లెక్కలు డిసెంబర్లో బయటకు వచ్చాయి. దీని ప్రకారం 2021-22లో ఈపీఎఫ్‌వో చందాదార్ల సంఖ్య 4.63 కోట్లమంది. అంతక్రితం 2020-21తో పోల్చితే సభ్యుల సంఖ్య 6వేలు మాత్రమే పెరిగింది. కరోనాకు ముందు ఏడాది 2019-20లో 4.89 కోట్లుంది. దీంతో పోల్చితే సంఘటితరంగంలో చందాదార్ల సంఖ్యలో తగ్గుదల 5.3శాతం ఉంది. వీరంతా కరోనా తర్వాత ఉద్యోగాలు కోల్పోయినవారే. దీనిని పైకి రానివ్వకుండా 2021-22లో నెలవారీ చందాదార్ల సంఖ్యను చూపుతూ, ''చూశారా పే రోల్ సంఖ్య పెరిగింది. కేంద్రం చేపట్టిన చర్యలవల్లే ఉపాధి రంగం కోలుకుంది. నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తునా''మని బీజేపీ నాయకులు, పాలకులు ప్రచారం చేస్తున్నారు.