Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేం.. సుప్రీం కోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ : మత మార్పిడీలన్ని చట్ట విరుద్ధం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మత మార్పిడి సమయంలో తప్పనిసరిగా జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) ముందు డిక్లరేషన్ చేయాలని ఇటీవలి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన మత స్వేచ్ఛ చట్టం తప్పనిసరి అవసరాన్ని కొట్టివేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ''అన్ని మార్పిడీలు చట్టవిరుద్ధమని చెప్పలేం. నోటీసు జారీ చేయడంతో పాటు మధ్యంతర ఉపశమనం ఇస్తాం. ఫిబ్రవరి 7న విచారిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కౌంటర్ ఉంటే దాఖలు చేయండి'' అని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ''వివాహం లేదా మత మార్పిడిపై ఎలాంటి నిషేధం లేదు. జిల్లా మేజిస్ట్రేట్‌కు మాత్రమే సమా చారం ఇవ్వాలి. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలి'' అని కోరారు. దీనికి ధర్మాసనం బదులిస్తూ, దీనిని తాము స్వీకరించలేమనీ, రాష్ట్రం వద్ద ఏదైనా కౌంటర్ ఉంటే తదుపరి విచారణ తేదీన సమర్పించ వచ్చని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. అయితే చట్టంలోని సెక్షన్ 10 (మత మార్పిడికి ముందు ప్రకటన)ను ఉల్లంఘించే ఏ వ్యక్తిపైనా బలవంతపు చర్య తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోరు పాల్, జస్టిస్ ప్రకాష్ చంద్ర గుప్తాలతో కూడిన ధర్మాసనం 2022 నవంబర్ 14న ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ''పరి వర్తనను కోరుకునే పౌరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ విషయంలో డిక్లరేషన్ ఇవ్వడాన్ని సెక్షన్ 10 తప్పని సరి చేస్తుంది. ఇది మా అభిప్రాయం ప్రకారం రాజ్యాంగ విరుద్ధం. వయోజన పౌరులు వారి స్వంత ఇష్టానుసారం వివాహం చేసుకుంటే, చట్టంలోని సెక్షన్ 10ని ఉల్లం ఘించినందుకు బలవంతపు చర్య తీసుకో కూడదు ''అని ఆర్డర్ పేర్కొంది. ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సమయంలో హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.