Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కార్ ఖజానాకు రూ.5 లక్షల కోట్లు
- అదరగొట్టిన లాభాలు
- డివిడెండ్లోనూ 58% వృద్థి
- 2021-22లో మెరుగైన ప్రగతి..
- ప్రభుత్వ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు దన్నుగా నిలిచాయి. లాభాలను ఆర్జించడం తో పాటుగా డివిడెండ్ చెల్లింపులు, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో మెరుగైన ప్రగతని కనబర్చాయి. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, పవర్ గ్రిడ్, సెయిల్ కంపెనీలు అధిక లాభాలు సాధించి.. మెరుగైన ప్రగతిని కనబర్చిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2021-22లో ఈ నాలుగు కంపెనీల నిర్వహణ నికర లాభాలు ఏకంగా రూ.2.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ప్రభుత్వ సర్వేలో వెల్లడయ్యింది. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.1.65 లక్షల కోట్ల లాభాలు నమోదయ్యాయి. కాగా.. 2021-22లో నష్టాల్లోని పలు సిపిఎస్ఇల నికర నష్టాలు రూ.15వేల కోట్లకు తగ్గాయి. 2020-21లో వీటి నష్టం రూ.23 వేల కోట్లుగా నమోదయ్యింది. దీంతో పోల్చితే గడిచిన ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 37.82 శాతం తగ్గాయి. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్, అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ సంస్థలు నష్టాలు నమోదు చేశాయి.
2021-22లో మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్థూల రెవెన్యూ రూ.31.95 లక్షల కోట్లకు ఎగిసింది. ఇంతక్రితం ఏడాది 2020-21లో రెవెన్యూ రూ.24.08 లక్షల కోట్లుగా ఉంది. ఇదే ఏడాది రూ.73వేల కోట్ల డివిడెండ్‌ను ప్రకటించగా.. గడిచిన 2021-22లో 57.58 శాతం పెరుగుదలతో రూ.1.15 లక్షల కోట్ల డివిడెండ్‌ను అందించాయి. మొత్తం రెవెన్యూలో పెట్రోలియం, ట్రేడింగ్, మార్కెటింగ్, విద్యుత్ ఉత్పత్తి కంపెనీల వాటా 69.08 శాతంగా ఉండటం విశేషం. అన్ని సీపీఎస్ఈల నికర లాభాలు 2020-21లో రూ.1.89 లక్షల కోట్లుగా ఉండగా.. గడిచిన 2021-22లో రూ.2.64 లక్షల కోట్లకు పెరిగాయి. పెట్రోలియం (రిఫైనరీ మరియు మార్కెటింగ్), ముడి చమురు, రవాణా, లాజిస్టిక్స్ విభాగాల మెరుగైన పనితీరు కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరగడానికి దోహదం చేశాయని ఈ సర్వే పేర్కొంది. తయారీ, ప్రాసెసింగ్, ఉత్పాదక, మైనింగ్ రంగాలు మెరుగైన ప్రగతిని కనబర్చాయి. 2021-22లో సీపీఎస్‌యూ లు అన్నీ కలిసి ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, కార్పొరేట్ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ, డివిడెండ్లు, ఇతర సుంకాలు, పన్నుల రూపంలో మొత్తంగా రూ.5.07 లక్షల కోట్లు అందించాయి. ఈ రూపంలో 2020-21లో రూ.4.97 లక్షల కోట్ల మొత్తాన్ని కేంద్రానికి ముట్టజెప్పాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ ఒమన్ రిఫైనరీస్ లిమిటెడ్, చెన్నరు పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కేంద్ర ఖజానాకు అత్యధికంగా పన్నులు అందిస్తున్న మొదటి ఐదు సంస్థల్లో టాప్‌లో ఉన్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)లోనూ పీఎస్‌యూలు ముందంజలో ఉన్నాయి. 2021-22లో పీఎస్‌యూ లు సీఎస్ఆర్ కింద రూ.4,600 కోట్లు వ్యయం చేశాయి. ఇంతక్రితం ఏడాది 2020-21లో రూ. 4,483 కోట్లు వితరణ చేశాయి. సీఎస్ఆర్ సేవల్లో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరే షన్, ఎన్ఎండీసీ, పవర్ గ్రిడ్లు టాప్‌లో ఉన్నాయి.