Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహారం, ఎరువుల సబ్సిడీల్లో రూ. 1.40 లక్షల కోట్లు కోత
- గతేడాదితో పోలిస్తే 26 శాతం తగ్గింపు
- రూ. 3.7 లక్షల కోట్లకు కుదిస్తూ బడ్జెట్ అంచనా
- ప్రభుత్వ అధికారిక వర్గాల నుంచి సమాచారం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ పాలనలో దేశంలోని ఎందరో పేదలు ఇప్పటికీ సరైన తిండి దొరకక ఆకలితో అలమటిస్తున్నారు. ఇటు రైతన్నలకు కావాల్సిన ఎరువులూ లభించడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఆహార రాయితీలు, ఎరువుల సబ్సిడీలపై కోతకు మోడీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. గతేడాదితో పోలిస్తే రాబోయే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ను కుదించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. కరోనా సమయంలో పెరిగిన ఆర్థిక లోటును ఈ కోతలతో భర్తీ చేసుకోవడానికి మోడీ సర్కారు చర్యలు తీసుకుంటున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఆహారం, ఎరువుల సబ్సిడీలపై వ్యయాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో రూ. 3.7 లక్షల కోట్ల రూపాయలకు తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ విషయాన్ని ఇద్దరు ప్రభుత్వాధికారులు వెల్లడించడం గమనార్హం.
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత మొత్తం బడ్జెట్ వ్యయంలో( రూ. 39.45 లక్షల కోట్లు) ఎనిమిదో వంతు ఆహారం, ఎరువుల సబ్సిడీలు మాత్రమే ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీల కోసం సుమారు రూ. 2.3 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం అంచనా వేస్తున్నదనీ, ప్రస్తుత సంవత్సరం మార్చి 31 వరకు ఇది రూ. 2.7 లక్షల కోట్లుగా ఉన్నదని ఆ ఇద్దరు అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు రూ. 2.3 లక్షల కోట్లతో పోల్చితే ఎరువుల సబ్సిడీలపై ఖర్చు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లకు తగ్గుతుందని చెప్పారు.
ఉచిత ఆహార పథకానికి దెబ్బ
కాగా, కేంద్ర ఆహారం, ఎరువుల మంత్రిత్వ శాఖలు దీనిపై వెంటనే స్పందించలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే, వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. పొదుపులో భాగంగా కోవిడ్-19 నాటి ఉచిత ఆహార పథకం ముగింపునకు వస్తుందనీ, ఇది తక్కువ ఖర్చుతో కూడి ప్రోగ్రామ్‌తో భర్తీ చేయబడుతుందని సదరు అధికారులు వెల్లడించడం గమనార్హం.2024 సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, వరుస రాష్ట్రాల ఎన్నికలతో పేదలకు అందుబాటులో ఉండే ఉచిత రేషన్లను కేంద్రం సగానికి తగ్గిస్తుందని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 6.4 శాతం లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక లోటును కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నదని తెలుస్తున్నది. ఇది గత దశాబ్దంలో సగటున4 శాతం నుంచి 4.5 శాతం కంటే ఎక్కువగా ఉన్నది. ముడి చమురు ధరలు తగ్గాయన్న అంచనాలు, ఎరువుల కంపెనీల కోసం ప్రభుత్వం సవరించిన గ్యాస్ సేకరణ విధానం ఈనెల ప్రారంభంలోకి అమల్లోకి వచ్చినందున ఎరువుల సబ్సిడీ తగ్గింపునకూ కారణమని అధికారులు చెప్పారు. అయితే, రాబోయే బడ్జెట్ సమావేశాలు, అందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేయబోయే ప్రకటనల పైనే అంతా ప్రాధాన్యత సంతరించుకున్నదని నిపుణులు చెప్పారు.
'సబ్సిడీలలో కోతలకు దిగొద్దు'
మోడీ సర్కారు తన ఆర్థిక లోటు భర్తీ చేసుకోవడానికి పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నదని సామాజిక కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. కార్పొరేట్లు, బడా వ్యాపారవేత్తలకు రుణ మాఫీలు ప్రకటించే కేంద్రం..పేదలు, రైతులపై భారం మోపకూడదని చెప్పారు. ఆహార, ఎరువుల సబ్సిడీలలో కోతలకు దిగొద్దని తెలిపారు. కరోనా సంక్షోభ కాలంలో మోడీ సర్కారుకు ముందు చూపు లోపించిన కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పారు.