Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేఘాలయ క్రైస్తవ సంఘాల ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దాడులు రోజురోజుకూ పెరుగుతున్నా, ప్రధాని స్పందించకపోవడంపై మేఘాలయకి చెందిన ప్రముఖ క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికైనా మూగనోము వీడాలని డిమాండ్ చేశాయి. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఈ నెల 2న చర్చిని ధ్వంసం చేశారని పేర్కొన్నాయి. ఈ దాడిలో జిల్లా ఎస్పితో సహా పలువురు గాయపడ్డారు. స్థానిక బిజెపి నేతతో సహా ఐదుగురిని ఆ మరుసటి రోజు అరెస్టు చేశారు. చర్చిల సంఖ్య, మత మార్పిడులకు సంబంధించిన సమాచారంతో సహా మొత్తంగా ఏడు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంపాదించాల్సిందిగా పోలీసు అధికారులు అస్సాంలోని జిల్లాలకు డిసెంబరు 16న లేఖ జారీ చేయడంపై ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. షిల్లాంగ్‌కి చెందిన ఖాసి జైంటియా క్రిస్టియన్ లీడర్స్ ఫోరమ్ (కెజెసిఎల్ఎఫ్) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్రైస్తవులపై, చర్చిలపై సుదీర్ఘకాలంగా దాడులు పెరుగుతున్నా ప్రధాని మోడీ వాటిని పట్టించుకోకపోవడం గమనార్హమని ఆ ప్రకటన పేర్కొంది. అస్సాం పోలీసులు జారీ చేసిన లేఖ ఆందోళనకరంగా వుందని షిల్లాంగ్ కేథలిక్ అసోసియేషన్ తెలిపింది. పోలీస్ డిపార్ట్మెంట్ కోరిన వివరాలు క్రైస్తవులను బెదిరించేలా ఉన్నాయని పేర్కొంది. క్రిస్టియన్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఆపాలని, మత సామరస్యాన్ని కాపాడాలని ప్రధానికి విజ్ఞప్తి చేసింది.