Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో లైంగికదాడి ఘటన దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సీపీఐ(ఎం) నేత సుభాషిణీ అలీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజరు రష్తోగి, జస్టిస్ బేలా ఎం. త్రివేదీల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కాసేపటికే ఈ విషయమై గతంలో బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై విచారణ నుంచి గత డిసెంబర్ 13న జస్టిస్ త్రివేదీ తప్పుకున్న విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో న్యాయమూర్తులిద్దరూ కాసేపు చర్చించుకున్నారు. అనంతరం ఈ విచారణ నుంచి ఆమె (త్రివేదీ) తప్పుకుంటున్నట్టు జస్టిస్ రస్తోగి చెప్పారు. ఆమె స్థానంలో మరొక న్యాయమూర్తితో కలిసి ఫిబ్రవరి నుంచి విచారణ కొనసాగుతుందని వివరించారు. తాజా పిటిషన్లను బిల్కిస్ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌కు కలిపి విచారిస్తామని చెప్పారు.