Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యధిక స్థానాలతో మొదటి స్థానంలో కాంగ్రెస్
- కీలకం కానున్న జేడీ(ఎస్)
- పీపుల్స్‌పల్స్ సంస్థ -'సిస్రో' సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : కర్నాటకలో వచ్చే ఏప్రిల్, మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హౌరాహౌరీ పోటీ జరగనుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. 'సౌత్ ఫస్ట్' న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్‌పల్స్ సంస్థ - 'సిస్రో' తో కలిసి తాజాగా ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాల్లో, మెజారిటీ రాకపోయినా... కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, మొత్తమ్మీద హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ట్రాకర్ పోల్‌లో వెల్లడయింది. పీపుల్స్‌పల్స్ డైరెక్టర్ ఆర్.దిలీప్‌రెడ్డి గురువారం మొదటి ట్రాకర్‌పోల్ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ట్రాకర్ పోల్ 2022 డిసెంబర్ 22 నుంచి 31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన తాజా సర్వే గణాంకాలను శాస్త్రీయంగా అన్వయించి విశ్లేషించి, సిస్రో వ్యవస్థాపక డైరెక్టర్ ధనుంజరు జోషి ఆధ్వర్యంలో నివేదికను రూపొందించినట్టు తెలిపారు. పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్/మైనస్ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్/మైనస్ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడి (ఎస్) 29 (ప్లస్/మైనస్ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాల మెజార్టీ సంఖ్యను ఏ పార్టీ సాధించలేకపోతోంది. 2018 ఎన్నికల తర్వాత రెండు పార్టీల కూటమి ప్రభుత్వం మరోసారి ఏర్పడే అవకాశాలున్నాయి. రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా మారనున్నామని జేడి(ఎస్) ఇప్పటికే చెబుతూ వస్తోంది. వాస్తవిక ఫలితాలు సర్వే అంచనాల ప్రకారంగానే ఉంటే, అదే నిజమై జేడీ(ఎస్) కీలకం కానుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ రెండు శాతం ఓట్లను పెంచుకొని 22 స్థానాలను అధికంగా సాధిస్తుందని తేలింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 40 శాతం సాధిస్తుందని రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించిన సర్వేలో తేలింది. అదే సమయంలో బీజేపీకి, 2018 ఎన్నికలతో పోలిస్తే 0.2 శాతం ఓట్లు తగ్గే ఆస్కారం కనిపిస్తోంది. 2018లో 36.2 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుంది. ఈ స్వల్ప వ్యత్యాసంతో ఆ పార్టీ 13 స్థానాలు కోల్పోనుంది.
కర్నాటకలో గత మూడున్నర దశబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా తిరిగి విజయం సాధించలేదు. దక్షిణ భారత దేశంలో కర్నాటక రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్టే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలయ్యి, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, జేడి(ఎస్) పార్టీలు ధీమాతో ఉన్నాయి. అవినీతి, ఉద్యోగ నియామకాలలో కుంభకోణాలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం అంశాలు బీజేపీకి అడ్డంకులుగా ఉన్నాయని ఈ ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. రైతులలో 40 శాతం, నిరుద్యోగులలో 41 శాతం కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌కు 8 శాతం ఆధిపత్యం లభిస్తుండగా, బీజేపీకి పట్టణ ప్రాంత్రాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఆధిక్యం కనిపిస్తుంది.