Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు, కోశాధికారిగా కెఆర్కె మూర్తి
అమరావతి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని, పార్లమెంట్లో సమగ్ర చర్చ లేకుండానే ఆమోదింపజేసుకుందని, ఆ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించి పటిష్టంగా అమలు చేయాలని, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలని సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది. ఏప్రిల్ ఐదో తేదీన చలో ఢిల్లీ, మార్చిలో చలో అసెంబ్లీని జయప్రదం చేయాలని తీర్మానించింది. సీఐటీయూ ఏపీు రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎవి.నాగేశ్వరరావు, సిహెచ్.నర్సింగరావు, కోశాధికారిగా కెఆర్కె.మూర్తి ఎన్నికయ్యారు. మూడు రోజులపాటు భీమవరంలో జరిగిన మహాసభ బుధవారం ముగిసింది. మొత్తం 47 తీర్మానాలను ఆమోదించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు పార్లమెంట్లో వైసీపీ, టీడీపీ ఎంపీలు మద్దతు ఇవ్వడం దారుణమని మహాసభ పేర్కొంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్మికులను తొలగించే అధికారం యజమానులకు కల్పించడం, పని గంటలు, సెలవులు, ఓవర్ టైం, పని ప్రదేశంలో భద్రత తదితర నిబంధనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టారాజ్యం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రయివేటు రంగానికి అప్పగించే విధంగా ఈపీఎఫ్, ఇఎస్ఐ, స్కీమ్‌లో ఏకపక్షంగా మార్పులు చేసే అధికారం తగదని మహాసభ పేర్కొంది. కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది.