Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోని విదేశీ యూనివర్సిటీల అడ్మిషన్ ప్రక్రియ, ఫీజుపై యూజీసీ ముసాయిదా
న్యూఢిల్లీ : దేశంలోని విదేశీ యూనివర్సిటీలు తమ అడ్మిషన్ ప్రక్రియ, ఫీజును నిర్ణయించుకోవచ్చని యూజీసీ చైర్ పర్సన్ ఎం.జగదీశ్ కుమార్ అన్నారు. గురువారం దేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల క్యాంపస్‌ల ఏర్పాటు, నిర్వహణ ముసాయిదా నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసింది. యూజీసీ తో ఏర్పడిన ఒక కమిటీ దరఖాస్తులను పరిశీలించి, సిఫారసులను చేస్తుందని పేర్కొన్నారు. ప్రారంభంలో విశ్వ విద్యాలయాలు పదేండ్ల పాటు పనిచేయడానికి అనుమతి మంజూరు చేయబడుతుందని అన్నారు. దేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు తమ అడ్మిషన్ ప్రక్రియ, ఫీజు నిర్మాణం, వారి మాతృ క్యాంపస్‌లకు నిధులను స్వదేశానికి పంపించే స్వేచ్ఛను కలిగి ఉంటాయనియూజీసీ తెలిపింది. దేశంలోని క్యాంపస్‌లలో విద్యా నాణ్యత మాతృ క్యాంపస్‌లతో సమానంగా ఉండేలా ఇన్స్టిట్యూట్లు నిర్ధారించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యూజీసీ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎం జగదీశ్ కుమార్ మాట్లాడుతూ ''దేశీయ విద్యార్థులకు దేశంలోనే అధిక నాణ్యత గల అంతర్జాతీయ విద్యను పొందడం'' అనే లక్ష్యంతో రూపొందించబడిన నిబంధనలపై జనవరి చివరి నాటికి అభిప్రాయాలు తెలియజేయవచ్చని అన్నారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఇది కీలక అడుగు అని ఆయన తెలిపారు. తొలుత పదేండ్ల పాటు అనుమతి ఇస్తామనీ, వారి కార్యకలాపాల తొమ్మిదో సంవత్సరం ముగింపులో, వారు ఆమోదం పునరుద్ధరణ కోసం ఫైల్ చేయాల్సి ఉంటుందని అన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో పాల్గొనే విశ్వవిద్యాలయాలు దేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకోవడానికి టాప్ 500లో స్థానం అవసరం, అయితే అలాంటి ర్యాంకింగ్‌లలో పాల్గొనని వారు తమ దేశాల్లో ''అత్యంత ఖ్యాతి'' పొందవలసి ఉంటుందని తెలిపారు.
''క్యాంపస్‌లు తమ సొంత రుసుం, నిర్మాణాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఫీజు నిర్మాణం పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అవసరాల ఆధారిత స్కాలర్షిప్లను అందించడానికి వారు స్వేచ్ఛను కలిగి ఉంటారని నిబంధనలు చెబుతున్నాయి'' అని అన్నారు. విదేశాల నుంచి, దేశానికి చెందిన అధ్యాపకులు, ఇతర సిబ్బందిని నియమించుకోవడానికి విదేశీ సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కూడా అందిస్తుందని తెలిపారు.
దరఖాస్తు ప్రక్రియ వెబ్ ఆధారితంగా ఉంటుందనీ, క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను స్వీకరించడానికి యూజీసీ ప్రత్యేక పోర్టల్‌ను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ''ఎంపికైన దరఖాస్తుదారులకు క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి సుమారు రెండేండ్ల సమయం ఇవ్వబడుతుంది'' అన్నారు. అంతేకాకుండా, ఆన్లైన్ తరగతులు అనుమతించబడనందున వారు తప్పనిసరిగా ఆఫ్‌లైన్ మోడ్‌లో విద్యను అందించాలని తెలిపారు. నిధుల స్వదేశానికి తరలించడం, నిధుల ఇతర సరిహద్దు తరలింపు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్-1999తో నిర్వహించబడుతుందని ఆయన అన్నారు. క్యాంపస్‌లను ఎప్పుడైనా తనిఖీ చేసే హక్కు యుజిసికి ఉంటుందని, అవి ర్యాగింగ్ నిరోధక, ఇతర క్రిమినల్ చట్టాల పరిధికి వెలుపల ఉండవని ఆయన చెప్పారు.