Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాద జీజేపీని గద్దె దించితేనే మన మనుగడ : బృందాకరత్
- న్యాయం, చట్టం కొందరికే పరిమితమైంది : తీస్తాసెతల్వాద్
- క్యూబాలో మహిళలకే అత్యధిక ప్రాధాన్యత : ఎలైడా గువేరా
- మనం రాజకీయాల్లో లేకపోతే సమాజాన్ని మార్చలేం : మల్లికా సారాబాయి
తిరువనంతపురం, మల్లు స్వరాజ్యం ప్రాంగణం నుంచి సలీమ
ఐద్వా 13వ అఖిల భారత మహాసభ ప్రారంభ సభలో నేతల పిలుపు స్త్రీ విముక్తి, మహిళా సమానత్వం, సమసమాజ స్థాపన లక్ష్యంతో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్న ఐద్వా 13వ అఖిల భారత మహాసభలు కేరళలోని తిరువనంతపురంలో ఉత్సాహపూరిత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహాసభ ప్రారంభ సూచికగా ఉదయం 9:30 గంటలకు ఆ సంఘం అఖిల భారత అధ్యక్షులు మాలినీ భట్టాచార్య ఐద్వా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 12 ప్రాంతాల నుంచి వచ్చిన 'జ్యోతు'లను నాయకులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి 'విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నాం' అంటూ ఆంధ్ర ప్రతినిధులు తెచ్చిన జ్యోతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జెండా ఆవిష్కరణ అనంతరం 'ఐద్వా జిందాబాద్, ఐద్వా లాంగ్ లివ్' అన్న నినాదాలతో ప్రాంగణం మారుమోగింది.
ప్రారంభసభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఐద్వా మాజీ జాతీయ కార్యదర్శి బృందాకరత్ మాట్లాడారు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు అనుగుణంగా కొత్త లక్ష్యాలు, ఆశయాలతో ఐద్వా ముందుకు సాగుతున్నదన్నారు. ఇందుకు కేరళ ఓ మంచి ఉదాహరణ. ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో 13వ మహాసభలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారికి బృందాకరత్ అభినందనలు తెలిపారు. 1981లో ఐద్వా మొదటి మహాసభ చెన్నైలో జరిగినపుడు 11లక్షల సభ్యత్వంతో 15 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సమా నత్వం - ప్రజాస్వామ్యం - స్త్రీ విముక్తి అనే జెండాను చేతబట్టి మన అక్కచెల్లెళ్ళు ఈ 40 ఏండ్లలో సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. దీనికోసం ఎంతో మంది మహిళా నాయకులు త్యాగంచేశారు. ముఖ్యంగా బెంగాల్, త్రిపుర నాయకులు ఎన్నో త్యాగాలుచేశారు. వారి త్యాగ ఫలితంగానే ఈ రోజు మన సంఘం ఇంతగా అభివృద్ధి చెందింది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మన కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఎనలేని సేవలందించారు. వారికి అభినందనలు. క్యూబా విప్లవ వీరుడు, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తుది వరకు పోరాడిన చేగువేర కుమార్తె ఎలైడా గువేరా ఈ రోజు మన మధ్య వుండటం మనకు స్ఫూర్తి దాయకం. ప్రస్తుతం మన ముందు అనేక సవాళ్లున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత ప్రజాస్వామ్యం కోసం పోరాడ్సిన పరిస్థితి, రాజ్యాంగాన్ని కాపాడుకోవల్సిన దుస్థితికి మనం వచ్చాం. మహిళల పరిస్థితి మరింత దిగజారింది. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కోటీ ఇరవై లక్షల మంది మహిళలు జీవనోపాధిని కోల్పోయారు. ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని బలంగా కోరుకుంటుంది. మన మెదళ్ళలోకి మనకు తెలియకుండానే ఎక్కించే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా పక్కా ప్లాన్‌తో సమగ్రంగా అమలుచేస్తున్నది. దీన్ని మనం తిప్పి కొట్టకపోతే ఈ మతోన్మాద సమాజంలో సమానత్వం కాదుకదా మనగడ కొనసాగడమే కష్టం. కాబట్టి మతోన్మాదులను గద్దె దించడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి అన్నారు.
రేపటి వెలుగు కోసం ఉద్యమించాలి : ఎలైడా గువేర
ఐద్వా 13వ అఖిల భారత మహాసభలో పాల్గొనడం సంతోషంగా వుంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మా క్యూబా దేశం ఎంతో పోరాటం చేసింది. ఇంకా చేస్తూనే వుంది. నిర్ణయాధికారంలో మహిళలను భాగస్వామ్యం చేయడంలో క్యూబా అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం మా పార్లమెంటులో 52శాతం, రాష్ట్ర కౌన్సిల్స్‌లో 53శాతం మంది మహిళలున్నారు. అలాగే 4 రాష్ట్రాలకు గవర్నర్లుగా, 12 మంది వైస్ గవర్నర్లుగా, 88 మంది అధ్యక్షులుగా, 58 మంది మేయర్లుగా మహిళలు వున్నారు. మహిళలకు అన్నింట్లో సమాన బాధ్యతలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. తర్వాతి తరాల వారిని మంచి మార్గంలో నడిపేందుకు అవసరమైన విద్య అందిస్తున్నాం. మహిళలకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటుచేశాం. గత ఏడాది 841 ట్రైనింగ్ సెంటర్లు పెడితే వీటిలో 50వేల మంది మహిళలు పాల్గొన్నారు. మహిళల కోసం ఇంకా చేయాల్సి వుంది. వాటిని కూడా చేస్తాం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అద్భుతమైన పోరాటాలు చేయాలి. రేపటి వెలుగు కోసం ఉద్యమించాలి.
చారిత్రాత్మకమైన ప్రదేశం
మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షులు శ్రీమతి మాట్లాడుతూ 13వ మహాసభ జరుపుకుంటున్న తిరువనంతపురంలోని ఈ ప్రాతం చారిత్రాత్మకమైనదని 1970 ఎస్ఎఫ్ఐ మొట్టమొదటి జాతీయ మహాసభలు కూడా ఇక్కడే జరిగాయన్నారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. రెండవసారి కూడా రాష్ట్ర ప్రజలు ఎల్డీఎఫ్నే ఎంచుకొని చరిత్ర సష్టించారన్నారు. ఇక ఐద్వా విషయానికి వస్తే కేరళ 57 లక్షల సభ్యత్వంతో దేశంలోనే అగ్రస్థానంలో వుందన్నారు. ఈ మహాసభ జయప్రదం కోసం ఎంతో మంది సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సీనియర్ నాయకులు సుభాషిణి అలి, కేరళ మాజీ వైద్యశాఖ మంత్రి కె.కె శైలజ, జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు వాసుకీ, సుధాసందరరామన్, మల్లు లక్మీ, డి.రమాదేవి, కేరళ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుసాన్ కోడీ, సి.ఎస్.సుజాత పాల్గొన్నారు.
కమిటీలు
మహాసభల విజయవంతం కోసం అధ్యక్ష వర్గం, మినిట్స్ కమిటీ, తీర్మానాల కమిటీ, అర్హతా పత్రాల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీల సమన్వయం కొరకు జాతీయ కార్యదర్శి వర్గం స్టీరింగ్ కమిటీగా వ్యవహరిస్తున్నది.
ఆరు అంశాలపై చర్చలు
మహాసభలో స్వతంత్ర పోరాటాల మహిళా ఉద్యమం, నూతన విద్యా విధానం మహిళలపై ప్రభావం, వాతావరణ మార్పులు మహిళలపై ప్రభావం, బాలికల హక్కులపై చర్చలు జరగనున్నాయి. అలాగే పలు తీర్మానాలను మహాసభలో ప్రవేశపెట్టనున్నారు. ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలె జాతీయ, అంతర్జాతీయ రాజకీయ రిపోర్టును ప్రవేశపెట్టారు. దానిపై ప్రతినిధులు రాష్ట్రాల వారిగా చర్చలు జరిపారు.
ఐక్యంగా పోరాడితేనే... : తీస్తాసెతల్వాద్
ఏ పోరాటాలైనా ఐక్యంగా చేస్తేనే విజయవం తమవుతాయని ప్రముఖ హక్కుల కార్యకర్త తీస్తాసెతల్వాద్ అన్నారు. మనది వ్యక్తి పోరాటం కాదు.. సామూహిక పోరాటం. ఐద్వా కోటి సభ్యత్వం కలిగి వుండటం సామాన్య విషయం కాదు. ఐద్వా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను దగ్గరగా చూశాను. ఎవరూ పట్టింకోవడానికి ముందుకురాని సమస్యలను కూడా ఐద్వా పట్టించుకుంటున్నది. ఇదెంతో గొప్ప విషయం. మహిళలు ఈ సమాజంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. దేశంలో ఎనిమిదేండ్ల నుంచి క్రూరమైన పాలన నడుస్తున్నది. నయా ఉదారవాద విధానాలు, మతోన్మాదంవల్ల భారత రాజ్యంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి. మన వాళ్ళనే మనకు శత్రువుగా మార్చేస్తున్నారు. చాలా మంది మౌనంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ అభ్యుదయ ఉద్యమాల వైపు మళ్ళించాల్సిన అవసరం వుంది. ఈ పని ఐద్వా చేస్తున్నది. న్యాయ వ్యవస్థను, చట్టాలను కాపాడుకోవడం కోసం మనం గొంతు విప్పాలి. నేను హక్కుల కార్యకర్తగానే కాదు ఓ జర్నలిస్టును. ప్రస్తుతం మీడియా మొత్తం కార్పొరేటీకరణ అయిపోయింది. పాలకుల పక్షం వహిస్తుంది. ఇలా కాకుండా మీడియా తన పాత్ర తాను సరిగ్గా నిర్వహిస్తే ప్రజా ఉద్యమాలకు మరింత బలం వస్తోందని సెతల్వాద్ అన్నారు.
మహిళలకు న్యాయం దక్కడం లేదు
ప్రస్తుతం మన దేశంలో తిండి తినడం, ఇష్టమైన బట్ట కట్టడం అత్యంత కష్టంగా మారిపోయింది. మహిళలకు న్యాయం దక్కడం లేదు. ఆత్మగౌరవంతో బతికే అవకాశమే లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఎంతో వుంది. లేదంటే ఈ సమాజాన్ని మార్చలేవం. సమానత్వం సాధించలేం. గుడుల్లోనూ, ఇండ్లలోను ఎక్కువగా కనిపించే మహిళలను ఇలాంటి అభ్యుదయ వేదికలో చూడటం చాలా సంతోషంగా వుంది. ఈ ఘనత కేవలం ఐద్వాకే దక్కుతుంది. అయితే మనువాదం మనల్ని వెనక్కు తీసుకుపోతున్నది. కులం, మతం పేరుతో మహిళలను చీల్చుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కలిసి ఐక్యంగా పోరాల్సిన అవసరం వున్నది.
- మల్లికా సారాబాయి, ప్రముఖ నృత్యకారిణి, కేరళ కళామండలి డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్స్లర్
కాశ్మీర్ నుంచి మొదటిసారి
జాతీయ కార్యదర్శి మరియం ధావలె మాట్లాడుతూ ఈ మూడేండ్ల కాలంలో ఐద్వా 40వేల స్థానిక కమిటీలు, 700 జిల్లా కమిటీలు, 26 రాష్ట్ర మహాసభలు జరుపుకుని కోటి సభ్యత్వానికి గాను 850 మంది ప్రతినిధులు హాజరయ్యారరని తెలిపారు. అలాగే ఈ సభలకు కాశ్మీర్ నుంచి కూడా ప్రతినిధులు మొదటిసారి హాజరుకావడం గొప్ప విషయమన్నారు.
స్వాగత గీతం, సంతాప తీర్మానం
ప్రారంభ సభకు ముందు కేరళ రాష్ట్ర సంగీత శాఖ కళాకారులు పాడిన ''మహిళా శక్తికి ఎర్రపూలతో స్వాగతం'' అనే గీతం అందరినీ అలరించింది. ఐద్వా జాతీయ అధ్యక్షులు మాలినీభట్టాచార్య గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు మరణించిన వారికి సంతాప తీర్మానం ప్రకటించారు.
పోరాట చిహ్నాలకు సన్మానం
మహా సభ సందర్భంగా వివిధ రాష్ట్రాలో
సుదీర్ఘ పోరాటం చేసిన ఆరుగురిని సన్మానించారు.
- షీలా సహాన, (హర్యాన) 2020లో నల్ల చట్టాలకు నిరసనగా జరిగిన సుదీర్ఘ రైతాంగ పోరాటంలో తన ప్రాంతం నుండి మహిళలను ఏకం చేయడంలో కీలకపాత్ర పోయించారు.
- రేవతి, తమిళనాడు: ఈమె భర్తను అక్రమంగా అరెస్టుచేసి చంపేస్తారు. దాంతో ఈమె ఐద్వా అండతో న్యాయం కోసం పోరాటానికి దిగింది. ఇంకా పోరాడుతూనే వుంది.
- సంయుక్త, ఒడిశా: ధోబీగా పని చేసే ఈమె తన జాతి వారిని ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాటం చేస్తుంది.
- మన్సియా, కేరళ: ముస్లిం కుంటుంబంలో పుట్టిన ఈమె నత్యకారిణి. ముస్లిం కుటుంబంలో పుట్టి డ్యాన్స్ ఎలా చేస్తావంటూ మతఛాందసవాదులు అడ్డుకుంటే వారిని ఎదిరించి తనకు ఇష్టమైన నత్యాన్ని కొనసాగిస్తుంది.
- కమ్లేష్, హర్యానా: అంగన్ వాడీ వర్కర్ అయిన ఈమె తన యూనియన్ తరపున పర్మినెంట్ చేయమని పోరాడుతుంటే అక్కడి బీజేపీ ప్రభుత్వం ఎన్నోదాడులు చేస్తుంది. అయినా ధైర్యంగా తన ఉద్యమాన్ని కొనసాగించి విజయం సాధించింది.
- ఫుల్లరా మొండల్, వెస్ట్ బెంగాల్: పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి స్థానిక ఐద్వా నాయకురాలిగా ఉన్న ఈమెపై తృణమూల్- మావోయిస్టులు దాడి చేశారు. అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ధైర్యంగా ఐద్వాలో పని చేస్తున్నారు.