Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలీజియం సిఫారసు చేసిన పేర్లు వెనక్కి
- ఆమోదించని పేర్లు పరిశీలనకు
- మోడీ సర్కారు తీరుపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసు చేసిన పేర్లను కేంద్రం వెనక్కి పంపుతున్నదనీ, అలాగే కొలీజియం ఆమోదించని పేర్లను పరిశీలనకు పంపుతున్నదని భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలపై కేంద్రం జాప్యాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ అభరు ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారించింది. కొలీజియం సిఫారసులను ఆమోదించటంలో కేంద్రం జాప్యం చేయడంతో న్యాయమూర్తులుగా రావాల్సిన వాళ్లు తమ సమ్మతిని ఉపసంహరించుకోవడం, పూర్తిగా వెనక్కి తగ్గడం జరుగుతుందని ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ మొదటి రౌండ్ అభ్యంతరాల తర్వాత... కొలీజియం ఇప్పటికే పునరుద్ఘాటించిన అభ్యర్థుల పేర్లను కూడా కేంద్రం వెనక్కి పంపుతున్నదని ధర్మాసనం తెలిపింది. '22 పేర్లను కేంద్రం వెనక్కి పంపింది. కొన్ని పునరుద్ఘాటించిన వారి పేర్లూ వెనక్కి పంపారు. వెనక్కి పంపిన వాటిలో కొన్ని మూడోసారి కూడా తిరిగి పంపారు. కొన్నింటిని కొలీజియం ఆమోదించనప్పటికీ... వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేర్లను క్లియర్ చేయడంలో ప్రభుత్వం చేసిన జాప్యంతో ప్రతిభావంతులైన న్యాయవాదులు.. న్యాయమూర్తులు కావడానికి వారి సమ్మతిని ఇవ్వలేదని వివరించింది.
'కొలీజియం ఆమోదించిన పేర్లను వెబ్సైట్లో ఉంచారు. కేంద్రం వాటిని ఆమోదించదు. ఇది కొంత ప్రభావం చూపుతున్నది' అని జస్టిస్ అభరు ఎస్ ఓకా అన్నారు. 'కేంద్రం జాప్యంతో నాకు తెలిసిన ఓ న్యాయమూర్తి ఉపసంహరించుకున్నారు. మరొకరు.. కొలీజియం వద్ద పెండింగ్లో ఉన్నందున ఉపసంహరించుకున్నారు' అని జస్టిస్ సంజరు కిషన్ కౌల్ అన్నారు. 'ప్రతిభావంతులైన వ్యక్తులు సమ్మతి ఇవ్వడానికి సంకోచించే వాతావరణాన్ని మనమే సృష్టిస్తున్నామా?.. అన్న సందేహం కలుగుతున్నది' అని ఆయన అన్నారు.రాజకీయ అంశాలతో సంబంధం లేకుండా న్యాయమూర్తులు కేసులను విచారిస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ను ఉదహరించింది. 'మేము జస్టిస్ కృష్ణయ్యర్ను గొప్ప సహకారి అని ప్రశంసిస్తాం. అతను ఎక్కడ నుంచి వచ్చాడో చూడండి. మేము న్యాయమూర్తులు అయినప్పుడు రాజకీయ పరిగణనలతో సంబంధం లేకుండా మా కర్తవ్యం నిర్వర్తిస్తాం. జస్టిస్ కృష్ణయ్యర్ కేరళలో మంత్రిగా ఉన్నారు. అతను న్యాయవాదిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నారు. ఆయన న్యాయమూర్తి అయిన తరువాత రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యవహరించారు' అని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కొంతమంది న్యాయమూర్తుల అభిప్రాయాలను ఉటంకిస్తూ, కొలీజియం ప్రతిపాదించిన పేర్లను ఆమోదించకుండా ఆలస్యం చేయడానికి ప్రభుత్వం ఒక సాకు చూపుతుందని అన్నారు. 'ప్రతి వ్యవస్థకు దాని సొంత లోపాలుంటాయి. అయితే ప్రస్తుత చట్టాన్ని అనుసరించాలి. మీరు కొత్త వ్యవస్థను తీసుకురావాలనుకుంటే... శాసనకర్త దానిని చేయగలరు' అని తెలిపారు.
మూడు రోజుల్లో 44 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం : అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి
మూడు రోజుల్లో 44 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఇవ్వబడుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసు చేసిన పేర్లను ప్రక్రియ చేయడానికి ప్రభుత్వం కాలక్రమానికి కట్టుబడి ఉంటుందని వివరించింది. అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్. వెంకటరమణి మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న హైకోర్టుల కొలీజియం చేసిన 104 సిఫారసులలో 44 మంది పేర్లను ప్రాసెస్ చేసి రెండు మూడు రోజుల్లో సుప్రీంకోర్టుకు పంపే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేకంగా రాజస్థాన్ హైకోర్టులో, కేంద్రం వద్ద 10 కొలీజియం సిఫారసులు పెండింగ్లో ఉన్నాయని ధర్మాసనం చెప్పింది. 'సమాచారమేమిటి? మేం ఏదైనా రికార్డ్ చేయగలమా? మీరు దానిని పరిశీలిస్తున్నారని మేం చెప్పాలా' అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.