Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం, నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
- నల్సా పథకం కింద నష్టపరిహారం అందటం లేదు : ఎన్జీవో సంస్థ
న్యూఢిల్లీ : లైంగిక నేరాల్లో బాధితులకు నష్టపరిహారం అందజేస్తారా? లేదా? అంటూ సుప్రీంకోర్టు కేంద్రం, నాలుగు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత మహిళలు లేదా వారి కుటుంబాలకు అందజేస్తున్న న్యాయ సేవలు, వైద్య సాయం, ఇతర వివరాలు అందజేయాలని కేంద్రం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. నష్టపరిహారం అందజేయ టంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించాయంటూ 'సోషల్ యాక్షన్ ఫోరం ఫర్ మానవ్ అధికార్' అనే ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ శుక్రవారం సీజేఐ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 'నల్సా (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) నష్టపరిహార పథకం అమలుతీరుపై కేంద్రం, నాలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వివరాలు కోరింది.
లైంగిక నేరాల్లో ప్రభుత్వ అధికారులు 60 రోజుల్లోగా విచారణ ముగించి, బాధిత మహిళకు నష్టపరిహారం అందజేసేట్టు కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్జీవో సంస్థ సుప్రీంను కోరింది. ఎన్జీవో తరఫు న్యాయవాది జ్యోతికా కల్రా వాదనలు వినిపిస్తూ, ''బాధితులకు సరైన న్యాయ సహాయం దక్కటం లేదు. ప్రభుత్వం నుండి అందాల్సినవి అందటం లేదు. దీనివల్ల వారి కుటుంబాలు గౌరవంగా జీవించే హక్కును కోల్పోతున్నాయి. నల్సా పథకాన్ని రాష్ట్రాలు అమలుజేయాలని 2018లో సుప్రీం ఆదేశాలు జారీచేసింది. అయినా కేంద్రం, మరికొన్ని రాష్ట్రాలు ఆ ఆదేశాల్ని పట్టించుకోవటం లేదు'' అని వివరించారు. వాదోపవాదనలు వింటూ సీజేఐ డి.వై.చంద్రచూడ్ కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు పంపుతామని చెప్పారు.
పిటిషన్లో ఎన్జీవో సంస్థ పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. బాధిత మహిళలకు వెంటనే ఉపశమనం కలిగే చర్యల్ని అధికారులు చేపట్టాల్సి వుంటుంది. ముఖ్యంగా వైద్య సాయం వెంటనే ప్రారంభం కావాలి. నిర్ధిష్ట కాలపరిమితిలో ఆర్థిక సాయం అందజేయలని కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 2006 చట్టం చెబుతోంది. బాధిత మహిళల పేదరికం, ఆర్థిక సమస్యల్ని ఆసరగా చేసుకొని, నేరస్థులు కేసును బలహీనపర్చే అవకాశముంది. ఈ తరహా కేసులు బీహార్, మధ్యప్రదేశ్లో చాలా ఉన్నాయి.
పేదరికం, నిరక్షరాస్యత కారణంగా బీహార్, ఢిల్లీలో బాధిత మహిళలకు న్యాయ సేవలు అందటం లేదు. నష్టపరిహారం దక్కటం లేదు. జాతీయ నేర గణాంకాల బ్యూరో లెక్కల ప్రకారం, గత రెండేండ్లలో దేశంలో లైంగికదాడి ఘటనలు 70.7శాతం పెరిగాయి. బాధిత మహిళల సంఖ్య ఏటా పెరుగుతోంది. నల్సా పథకం ప్రకారం ఆయా రాష్ట్రాల్లో బాధితులకు నష్టపరిహార పథకం సవరణలకు నోచుకోలేదు. కొన్ని రాష్ట్రాల్లో నష్టపరిహారం విషయంలో బాధితుల సంరక్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరించటం లేదని ఎన్జీవో సంస్థ పిటిషన్లో పేర్కొంది.