Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'హిందూ రాష్ట్ర' దిశగా....
- సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ భావనకు తీవ్ర ముప్పు
- ''రాజ్యాంగం పరిరక్షణ-ప్రజాస్వామ్య పరిరక్షణ'' సదస్సులో జస్టిస్ గోపాల గౌడ
న్యూఢిల్లీ : దేశంలో మతోన్మాద హిందూ శక్తులు అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో ఫెడరలిజంతో సహా రాజ్యాంగ ప్రాథమిక విలువలు నిర్వీర్యం చేశారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ విమర్శించారు. ఫాసిస్ట్ హిందూ దేశాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ భావనకు కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు. శనివారం నాడిక్కడ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లాలోని వికె కృష్ణ మీనన్ భవన్లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు), ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్ (డీయూజే), డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ (డీటీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ''రాజ్యాంగం పరిరక్షణ-ప్రజాస్వామ్య పరిరక్షణ'' జాతీయ సదస్సును జస్టిస్ గోపాల గౌడ ప్రారంభించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలుగా కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు నిర్వచించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని అన్నారు. మతపరమైన మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు కూడా భయంతో జీవిస్తున్నారని తెలిపారు. మతం ఆధారంగా పౌరసత్వం, అయోధ్య తీర్పు నుంచి శక్తివంతమై జ్ఞాన్వాపి మసీదుతో సహా తమ హక్కులను స్థాపించడానికి మతోన్మాద హిందూ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, కోవిడ్ కాలంలో దేశంలో మిలియనీర్ల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. గవర్నర్లు కేంద్రానికి సాధనాలుగా మారారనీ, ఫెడరలిజాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. కొలీజియం వ్యవస్థను నాశనం చేయడమే కేంద్ర ప్రయత్నమని అన్నారు. దేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలను చూడలేమని జస్టిస్ గౌడ అన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్, యూపీ, బీహార్ ఎన్నికలు తటస్థంగా ఉన్నాయని చెప్పలేమనీ, గుజరాత్లో ప్రధాని మోడీ ర్యాలీలకు కూడా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్‌తో పాటు సిబిఐతో సహా అన్ని రాజ్యాంగ సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సాధనాలుగా మారాయని విమర్శించారు.
పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు
హత్రాస్ ఘటనను నివేదించేందుకు వెళ్లిన మలయాళీ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్‌కు అన్యాయం జరిగిందని గౌడ స్పష్టం చేశారు. బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, బీజేపీ మద్దతుదారు అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందనీ, తొలిత సిద్ధిక్ కప్పన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లమని సుప్రీంకోర్టు చెప్పిందని జస్టిస్ గౌడ తెలిపారు. దేశంలో పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి భయపడి చాలా మీడియా సంస్థలు మౌనంగా ఉన్నాయని, 2014కి ముందు సీబీఐని పంజరంలో బంధించిన చిలుక అని చెప్పిన సుప్రీంకోర్టు ఆ తరువాత చలించలేదన్నారు. ఎనిమిదేండ్లు సుప్రీంకోర్టు కార్యకలాపాలపై కూడా తాను అసంతప్తిగా ఉన్నానని మాజీ న్యాయమూర్తి జస్టిస్ గౌడ అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ, మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు రామచంద్రన్, లాయర్స్ యూనియన్ ఆల్ ఇండియా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపి బికాస్ రంజన్ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పివి సురేంద్రనాథ్, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డీయూటీఏ) మాజీ అధ్యక్షురాలు నందితా నరైన్, డీయూకే అధ్యక్షుడు ఎస్ కె పాండే, డీయూజే కార్యదర్శి సుజాత మదోక్ తదితరులు మాట్లాడారు.