Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ విద్యపై యూజీసీ చర్యల పట్ల సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు భారత్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు, 90 రోజుల అప్రూవల్ క్రమం పూర్తయిన తర్వాత టీచర్లను రిక్రూట్ చేసుకోవడానికి, ఫీజులు నిర్ణయించుకోవడానికి వాటికి స్వేచ్ఛను కల్పిస్తూ యూజీసీ అనుమతినివ్వడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది, అధిక ఫీజులను వసూలుచేసే కేంద్రాలను, దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ నిర్మాణాన్ని మరింతగా దెబ్బతీసే సంస్థలను స్థాపించడానికి దారి తీస్తుందని హెచ్చరించింది. ఇటువంటి క్యాంపస్‌ల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ వివరాలను చూసినట్లైతే, దేశీయ, విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి అవి, తమ సొంత అడ్మిషన్ క్రమాన్ని, ప్రామాణికాలను తామే రూపొందించుకోవచ్చు. తమ ఫీజుల వ్యవస్థ ఎలా వుండాలో అవే నిర్ణయించుకోగలిగే స్వయంప్రతిపత్తి వాటికి వుంటుంది. భారతీయ విద్యా సంస్థలపై విధించిన ఎలాంటి పరిమితులు విదేశీ క్యాంపస్‌లకు వుండవు. అలాగే విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణ, చెల్లింపులు, చెల్లింపులను తిరిగి వారి స్వదేశానికి పంపడానికి కూడా అనుమతించనున్నారు. ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖాధికారులు అనుసరించే విద్యా విధానాలు దేశంలోని విద్యా క్రమం సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. 'జాతీయ సమున్నత' హోదానిస్తూ గతంలో, దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి భారత కార్పొరేట్ సంస్థలకు అనుమతించారు. కానీ ఆ తదుపరి పరిణామాలకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ప్రజలకు బహిర్గతం చేయలేదు. అలాగే, నూతన విద్యా విధానం, కోవిడ్ సమయంలో ఆన్లైన్ విద్యపై అత్యుత్సాహంతో ప్రస్తుతం భారత ఉన్నత విద్యారంగం కొట్టుమిట్టాడుతోంది. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో డ్రాపౌట్ల రేట్లు బాగా పెరిగాయని అన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఆర్థిక, సామాజిక అసమానతలను ఎదుర్కొంటున్న విద్యార్ధులకు ఉన్నత విద్యా అవకాశాలు అందడం కష్టతరమవుతుంది. ప్రతిపాదిత చర్యలతో ప్రస్తుతం దేశ ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించలేమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ ముసాయిదా ప్రతిపాదనను యుజిసి, ప్రభుత్వం రద్దు చేయాలని పొలిట్‌బ్యూరో కోరింది. ఉపాధ్యాయుల సంఘాలు, విద్యార్ధుల సంఘాలు, ఉన్నత విద్య భవిష్యత్ పట్ల తీవ్రంగా ఆందోళన చెందే వారందరితో చర్చలు జరపాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి యుజిసికి చట్టబద్ధంగా ఎలాంటి హక్కు, అర్హత లేదని పేర్కొంది. యూజీసీ, ప్రభుత్వం ఈ ఏకపక్షవాదాన్ని ఇంతటితో నిలుపు చేసేలా అన్ని ప్రజాస్వామిక, దేశభక్తియుత శక్తులు పోరాడాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది.