Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాసభల్లో వివిధ రాష్ట్రాల ప్రతినిధుల ఆశాభావంఅవనిలో సగం... ఆకాశంలో సగం... సమాజంలో సగం... ఉత్పత్తిలో సగభాగంగా ఉన్న మహిళాలోకానికి అవకాశాల్లోనూ, నిర్ణయాధికారంలోను సగభాగం కావాలంటూ... తమ హక్కుల సాధానకై నిరంతరం ఉద్యమిస్తున్న ఐద్వా 13వ అఖిల భారత మహాసభలు మూడవరోజు ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాయి. సంఘం జాతీయ కార్యదర్శి మరియం ధావలే ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, సంఘ నిర్మాణ నివేదికపై అన్ని రాష్ట్రాలు గ్రూపులుగా చర్చించారు. విమర్శనాత్మకంగా తమ లోపాలను, విజయాలను చర్చల్లో ప్రవేశపెట్టారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకోసం విభిన్న కార్యక్రమాలు చేపడుతుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా వున్నదనీ తమ రాష్ట్రంల్లో కూడా ఇలాంటి ప్రభుత్వం రావాలనీ, వచ్చేలా కృషి చేస్తామంటూ 13వ మహాసభ స్ఫూర్తితో ప్రతినిధులు ప్రతినబూనారు.
తిరువనంతపురం, ఎం.సి.జోసఫీన్ నగర్ నుంచి సలీమా
ఉద్యమాలు ఉధృతం చేస్తాం...
పశ్చిమ బెంగాల్ ప్రతినిధి మాట్లాడుతూ తమ రాష్ట్రంలో తృణమూల్ అత్యంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందన్నారు. దాడులు చేస్తుందన్నారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఐద్వా ముందుకు పోతుందన్నారు. కరోనా సయంలో ప్రజలకు, రోగులకు, వలస కార్మికులకు అద్భుతమైన సేవలు అందించామన్నారు. 13వ మహాసభ స్ఫూర్తితో అభ్యుదయ వాదులతో కలిసి ఐద్వా భవిష్యత్ లో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. గుజరాత్ ప్రతినిధి హన్సా మరియా మాట్లాడుతూ గుజరాత్ ప్రజలు అత్యంత భయంకర పరిస్థితుల్లో వున్నారన్నారు. మోడీ బయట ప్రచారం చేస్తున్నట్టు రాష్ట్రం లోపల లేదన్నారు. సమస్యలపై పనిచేసేంత శక్తి అక్కడ ప్రస్తుతం తమకు లేదని భవిష్యత్ లో పెంచుకుంటామన్నారు. తమ రాష్ట్రంలో కూడా కేరళ మాదిరిగా మహిళా సమానత్వం కోరుకునే పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషిచేస్తామన్నారు.
లింగ సమానత్వంపై దృష్టి...
కేరళ ప్రతినిధి బిందు మాట్లాడుతూ తమ రాష్ట్రంలో పినరరు విజయన్ నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 16 రకాల నిత్యావసర సరకులు ఇచ్చి తమ ఆకలి తీరుస్తుందన్నారు. అయితే రాష్ట్రంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా అంధవిశ్వాసాల వల్ల మహిళలు హింసకు, లైంగిక దాడులకు గురవుతున్నారన్నారు. ఒక జిల్లాలో మహిళను నరబలి ఇస్తే దీనిపై ఐద్వా పెద్ద ఎత్తున పోరాటం చేసిందన్నారు. ఐద్వా పిలుపునందుకొని ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రతి ఇంటి నుండి మహిళలు ప్లేకార్డ్స్ చేతబట్టి ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. లైంగిక దాడులకు, లింగ వివక్షకు వ్యతిరేకంగా విద్యార్ధి, యువజన సంఘాలతో కలిసి పని చేస్తామన్నారు. ఈ విధంగా అన్ని రాష్ట్రాల నుంచి 40 మంది ప్రతినిధులు తమ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి మూడేండ్ల కాలపు సంఘ ఆదాయ వ్యయాలను ప్రవేశపెట్టారు.
సభ్యత్వాన్ని పెంచుకుంటాం...
మా కార్యకర్తలను అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. మాస్ క్లాసులు కూడా నిర్వహించాం. రాష్ట్ర, జిల్లా కమిటీలు క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాం. ఒంటరి మహిళలు, మైనారిటీ మహిళల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశాం. కానీ అవి సక్రమంగా పని చేయించలేకపోయాం. మానవి పేరుతో సంఘం ఆధ్వర్యంలో ద్వైమాస పత్రిక తీసుకొస్తున్నాం. భవిష్యత్ లో కేరళ మాదిరిగా మా రాష్ట్రంలోనూ ఐద్వా సభ్యత్వాన్ని పెంచు కోవాలని నిర్ణయించుకున్నాం.
- సృజన, తెలంగాణ ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు
దాడులకు భయపడం...
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వుంది. మాపై తీవ్రమైన దాడులు చేస్తున్నారు. సమావేశాలకు హాజరైతే చంపేస్తామని బెదిస్తున్నారు. వాళ్ళను కాదని వెళితే ఇండ్లు, ఆఫీసులు తగలబెడుతున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. మహాళలపై లైంగిక దాడులు చేసి చంపేస్తున్నారు. వాళ్ళు ఎన్ని దాడులు చేసినా భయపడకుండా ఉద్యమాలు చేస్తున్నాం.
- రూపాగంగూలి, త్రిపుర
కర్నాటకను ముఖద్వారంగా చేసుకున్నారు...
దేశంలో మతోన్మాదం పెరిగిపోతోంది. బీజేపీ ప్రజల మెదడును మతోన్మాదంతో నింపుతుంది. దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించడానికి కర్నాటకను ముఖద్వారంగా చేసుకుంది. మేం కర్నాటకలో ఐద్వాగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. అయితే ఉపాధి హామీ పధకం పై మేం చేసిన కృషి ఎంతో గొప్పది. పేదలకు పని దొరికేలా, వేతనాలు దొరికేలా చేశాం. వారి కడుపులు నింపడానికి ఎంతో పోరాటం చేశాం. అయితే మనం పేదల పొట్ట పట్టుకుంటే మతోన్మాదులు వారి బుర్రలను పట్టుకున్నారు. హిందుత్వం అనే ఆయుధాన్ని వాడుకొని ప్రజలను వారివైపున కు తిప్పుకునేందుకు కషి చేస్తున్నారు. మనం వీటిని తిప్పికొట్టాలి. మనువాదానికి, సాంప్రదాయ వాదానికి వ్యతిరేకంగా పని చేయాలి.
- మీనాక్షి, కర్నాటక
మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది
మా మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. ప్రజల ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. మహిళలు ఇంటా బయటా ఎంతో శ్రమిస్తున్నారు. కానీ శ్రమకు తగ్గ ఫలితం లేదు. రోజుగడవక మైక్రోఫైనాన్స్ వారి వద్ద అప్పులు చేస్తున్నారు. వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చేసే ఒత్తిడితో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం మా సమస్యల గురించి పట్టించుకోకుండి మతోన్మాదాన్ని పెంచుతుంది. సెంటిమెంట్ మాటలతో అధికారం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దీనిపై ప్రజలకు అవగాన పెంచాలి.
ఆశా బాలా, మణిపూర్
సౌహార్ధ సందేశం
వామపక్ష ప్రభుత్వాలు వస్తేనే...
కేరళ మహిళలు, పేదల కోసం విభిన్న కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడే కాదు స్వాతంత్య్రం రాకముందు నుండే ఇక్కడ మంచి చరిత్ర వుంది. 1956లో భూసంస్కరణలు అమలు చేశారు. అమ్మాయిల చదువుకు ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టే ఇప్పుడు కేరళ ఎడ్యుకేషన్ లో దేశంలోనే అగ్ర స్థానంలో వుంది. మహిళల అభివృద్ధికి చదువు చాలా ముఖ్యం. ఇది వామపక్ష ఉద్యమం ఎప్పుడో గుర్తించింది. విద్యాపరంగా చూస్తే.. అమ్మాయిల చదువు శాతం గుజరాత్ లో 34శాతం వుంటే కేరళలో 93.7శాతం వుంది. దీన్ని బట్టి మతోన్మాద పార్టీకి వామపక్ష పార్టీలకు తేడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి వామపక్ష పార్టీలు అధికారంలోకి వస్తేనే మహిళా అభివృద్ధి. ఈ కృషిలో ఐద్వా కీలక పాత్ర కచ్చితంగా పోషిస్తుంది.
- రహీం, డివైఎఫ్ఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి
హింసకు వ్యతిరేకంగా...
2021లో మా రాష్ట్ర మహాసభలు జరుపుకున్నాము. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో 3000 మంది మహిళలు హాజరయ్యారు. కరోనా సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ఆహారం అందించాం. రోగుల కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ సెంటర్లు నడిపాం. శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశాం. గ్యాస్ ధరలు పెరిగినపుడు ఉద్యమం చేశాం. ఇండ్లులేని పేదలకు గుడిసెలు వేయించడంలో, పట్టాలు ఇప్పించడంలో ఐద్వా కీలకపాత్ర పోషించింది. ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం. అనేక జిల్లాల్లో లీగల్ సెల్స్ ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత న్యాయసలహాలు ఇస్తున్నాం. హింసకు, లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిత్యం పోరాడుతున్నాం. ఇంకా మా శక్తి పెంచుకుని పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నాం.
- గీత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
370 ఆర్టికల్ వెనక్కు తీసుకోవాలి...
మొదటిసారి మేం ఐద్వా మహాసభలకు వచ్చాం. కొత్తగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. జమ్ము, కాశ్మీర్ లో పరిస్థితి గతంలో మాదిరిగా లేదు. మోడీ మా గురించి ఆలోచించకుండా అంబానీ, అదానీల కోసం 370 రద్దు చేశారు. కాశ్మీర్ లో అంబానీకి చెందిన పెద్ద మాల్ ప్రారంభమయింది. మా రాష్ట్రం ఓ ప్రత్యేక పరిస్థితిలో ఏర్పడింది. ఇప్పుడు మా భూమిపై మాకు హక్కు లేకుండా పోయింది. అందుకే మా ఆర్టికల్ 370 ని వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
- లతీఫా, కశ్మీర్
పలు తీర్మానాల ఆమోదం
మహిళా శరణార్ధుల పట్ల మానవత్వ విధానం...
అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా శరణార్థులుగా దేశంలోకి వస్తున్న మహిళలపట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ఆ మేరకు ఒక విధానాన్ని రూపొందించాలని ఐద్వా జాతీయ మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వాటితో పాటు బిల్కిస్ బాను కేసులోని నిందితులను విడుదల చేయడాన్ని ఖండిస్తూ, ఆ దోషులను తిరిగి జైలుకు పంపాలని మరో తీర్మానం. అలాగే పశ్చిమబెంగాల్లో గంగానది వరద కట్టలు కొట్టుకుపోవడం వల్ల ప్రతి సంవత్సరం ముంపు బారిన పడుతున్న ప్రజానీకాన్ని ఆదుకోవాలని, హర్యానాలో అథ్లెట్ కు సంబంధించిన జూనియర్ కోచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన క్రీడల మంత్రి సందీప్ సింగ్ ను పదవి నుంచి డిస్ మిస్ చేయాలని మరో తీర్మానం. ఉద్యమకారులపై, అభ్యుదయ వాదులపై, జర్నలిస్టులపై ఇటీవల కాలంలో పెరుగుతున్న దాడులను ఆపాలని, ప్రపంచ వ్యాప్తంగా సాంమ్రాజ్యవాదానికి, సాంప్రదాయ వాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న మహిళలకు సంఘీభావం ప్రకటిస్తూ, ఉపాధిహామీ పధకాన్ని సక్రమంగా అమలు చేయాలని, చట్టం ప్రకారం పని దినాలు కల్పించాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పధకాన్ని అమలు చేయాలనే తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.