Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత రోజురోజుకూ ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలు శీతల గాలులతో వణికిపోతున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీలకు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆదివారం తెలిపింది. మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని పేర్కొంది. ఢిల్లీలోని ఆయా నగర్లో కనిష్ట ఉష్ణోగ్రత 2.6 డిగ్రీలుగా నమోదు కాగా, లోధి రోడ్లో 2.8 డిగ్రీల సెల్సియస్, పాలంలో 5.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండి వెల్లడించింది. వెలుతురు తగ్గడంతో, విమానాలు, రైళ్ల షెడ్యూల్ ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.
20 విమానాలు, 42 రైళ్ల రాకపోకలు ఆలస్యం
20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా 42 రైళ్లు గంట నుండి ఐదు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే ప్రతినిధి తెలిపారు. మరోవైపు గాలినాణ్యత సైతం ప్రమాదకర స్థాయిలో ఉంది. గాలి నాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్న నేపథ్యంలో నిరాశ్రయుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. పంజాబ్‌లోని అమృత్సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగా నగర్లో చలితీవ్రత అధికంగా ఉంది. భారత్ -గంగా మైదా నాల మీదుగా తేలికపాటి గాలులు, అధిక తేమ కారణంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చంఢగీఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోందని ఐఎండి పేర్కొంది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, త్రిపురలలో చాలా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.