Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభ స్పీకర్‌కు 100మందికిపైగా మాజీ బ్యూరోక్రాట్స్ లేఖ
- మైనార్టీలు లక్ష్యంగా పదే పదే విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపణ
న్యూఢిల్లీ : మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని మాజీ బ్యూరోక్రాట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రగ్యాఠాకూర్కు పార్లమెంట్ సభ్యురాలిగా ఉండే అర్హత లేదని, ఆమె పదే పదే విద్వేష ప్రసంగాలు చేస్తూ పోతున్నారని లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో మాజీ బ్యూరోక్రాట్స్ తెలిపారు. ఈ అంశంపై లోక్‌సభ నైతిక విలువల కమిటీ దృష్టిసారించాలని, ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ లేఖపై 100మందికిపైగా మాజీ బ్యూరోక్రాట్స్ సంతకం చేశారు. ''ఈ దేశంలో అమలయ్యే చట్టాలు పార్లమెంట్లో రూపొందుతాయి. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఎంపీలెవ్వరూ వ్యవహరించరాదు. కానీ భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ హిందూయేతరులను లక్ష్యంగా చేసుకొని విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. డిసెంబర్ 25న శివమొగ్గలో సదరు ఎంపీ విద్వేష ప్రసంగాలు చేశారు. ఒక వర్గం వారిపై దాడికి తెగబడాలని, వారికి తగిన బుద్ధి చెప్పాలని హిందువుల్ని రెచ్చగొట్టారు. ఈ తరహా ప్రసంగాలు చేయటం అతడికి పరిపాటిగా మారింది'' అని లేఖలో పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు నమోదవుతాయనే ఆలోచనతో ఎంపీ ప్రగ్యాఠాకూర్ తెలివిగా వ్యవహరిస్తున్నారని లేఖలో వారు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉండి..చట్టాలు తయారుచేయటం ఏంటని ప్రశ్నించారు. ఆమె చేబుతున్న మాటలు, వాడుతున్న భాష నేరపూరితం. అంతేకాదు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసి..ఇలా వ్యవహరించటం..రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించటమేనని స్పీకర్‌కు తెలిపారు. ప్రాథమిక హక్కులు, లౌకికవాదం, సమానత్వం, శాంతిభద్రతలు..భారత రాజ్యాంగంలో అత్యంత కీలకమైనవి. భారత రాజ్యాంగంలో మౌలిక స్వభావానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రగ్యా ఠాకూర్‌పై చర్యలు చేపట్టాలని లోక్‌సభ స్పీకర్‌ను వారు కోరారు. ఈ అంశాన్ని లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి పంపాలని విన్నవించారు.