Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోనే అత్యుత్తమ విధానంగా కేంద్రం గుర్తింపు
- కొత్తగా 2,56,140 ఉద్యోగాలు
న్యూఢిల్లీ : కేరళ పరిశ్రమల శాఖ ఒక్క ఏడాదిలోనే ఒక లక్ష సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లను స్థాపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు పొందింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సులో కేంద్ర ప్రభుత్వం కేరళలోని పరిశ్రమల శాఖ వ్యవస్థాపక సంవత్సర పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ విధానంగా పేర్కొంది. కేరళతో పాటు ఉత్తరప్రదేశ్ ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి ప్రాజెక్టును కూడా ప్రశంసించింది. మార్చి 30న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇయర్‌ను ప్రారంభించారు. లక్ష ఎంఎస్ఎంఇలను ఏడాదిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, నవంబర్ నాటికే అంటే ఎనిమిది నెలల్లోనే ఆ లక్ష్యాన్ని పూర్తి చేశారు.
ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నవంబర్లోనే పూర్తయింది. ఈ సందర్భంగా కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ మాట్లాడుతూ మనదేశంలో ఇదో కొత్త చరిత్రని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, కొత్తగా మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఏడాది పూర్తికాకుండానే 1,01,353 సంస్థలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రాజెక్టు ద్వారా కేరళలో రూ.6,282 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2,20,500 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభించిన 235 రోజుల తర్వాత ఈ ఘనత సాధించినట్లు కేంద్రం గుర్తించి, నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. లక్ష్యం పూర్తయిన రోజు నాటికి ఉన్న సమాచారం ప్రకారం వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అత్యధికంగా 40,622 మంది ఉపాధి పొందారు. 16129 ఎంటర్ప్రైజెస్ ప్రారంభించడం ద్వారా రూ.963.68 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తరువాత గార్మెంట్స్, టెక్స్టైల్స్ రంగంలో 22,312 ఉద్యోగాలు వచ్చాయి. ఈ రంగంలో 10,743 ఎంటర్ప్రైజెస్, రూ.474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగంలో 7,454 ఉద్యోగాలు, 4014 ఎంటర్ప్రైజెస్, రూ. 241 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సేవా రంగంలో 7,048 ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ రంగంలో రూ.428 కోట్ల పెట్టుబడులు, 16156 ఉద్యోగాలు లభించాయి. వ్యాపార రంగంలో అత్యధిక ఉద్యోగాలు వచ్చాయి. 54,108 ఉద్యోగాలు కల్పించడానికి 29428 ఎంటర్ప్రైజెస్, రూ.1652 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా ఆదివారం నాటికి కొత్తగా రూపొందించిన అంచనా ప్రకారం ఇప్పటివరకు 7261.54 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 118509 సంస్థల ఏర్పాటు ద్వారా 2,56,140 ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. స్థానిక ప్రభుత్వ స్థాయిలో లక్ష ఎంటర్ప్రైజెస్ ప్రారంభించడానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి అన్ని స్థానిక సంస్థలలో 1153 మంది వృత్తిపరంగా అర్హత కలిగిన వారిని నియమించారు.