Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో పురుషుల కన్నా 30 నుంచి 40 శాతం మహిళలకు తక్కువ
- నిర్మాణరంగంలో 5 కోట్ల మంది పురుషులు..70 లక్షల మంది మహిళలు
- బరువులెత్తే పనులు, ఇండ్ల నిర్మాణం, ఇటుక తయారీ, క్వారీల్లో ఉపాధి
- ప్రమాదకర పనుల్లో అత్యధికం మహిళలే : ప్రైమస్ పార్ట్నర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ నివేదిక
న్యూఢిల్లీ : భారత్లోని నిర్మాణ, రియలెస్టేట్ రంగంలో మహిళలపై వివక్ష తీవ్రస్థాయిలో ఉందని 'ప్రైమస్ పార్ట్నర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్' నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగంలో పురుషులకు అందుతున్న వేతనాలతో పోల్చితే 30 నుంచి 40శాతం తక్కువ వేతనాలు మహిళలకు ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. వేతనాలు, ప్రాతినిథ్యంలో అంతరాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తెలిపింది. పరిశ్రమలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 12శాతానికి పరిమితమైందని తెలిపింది. మహిళల ప్రాతినిథ్యం పెరగడానికి, వివక్షను రూపుమాపడానికి నివేదిక కొన్ని సూచనలు చేసింది. సమాన వేతనాలు అందుతున్నాయా? లేదా? అనేది పరిశీలించే నియంత్రణా వ్యవస్థను తీసుకురావాలని సూచించింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మహిళల నేతృత్వంలో నడిచే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. అంతేగాక పని ప్రదేశాల్లో మహిళా కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది.
నివేదికలో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఈవిధంగా ఉన్నాయి. దేశీయ నిర్మాణరంగం, రియలెస్టేట్ రంగంలో మొత్తం 5.7కోట్లమంది పనిచేస్తుండగా, ఇందులో పురుషుల సంఖ్య 5కోట్లకుపైగా ఉంది. 70లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. అందునా మహిళా కార్మికులు, ఉద్యోగులు ఎక్కువగా అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ఇక్కడ పురుషులకు అందుతున్న వేతనాలకు, మహిళలకు ఇస్తున్న వేతనాలకు మధ్య వ్యత్యాసం పెద్దఎత్తున ఉంది. లింగ అసమానతలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
గంటకు రూ.26.15
నిర్మాణరంగ పరిశ్రమలో వేతనాల్లో వ్యత్యాసం 34.5శాతంగా ఉంది. ఒక గంటకు మహిళలకు అందుతున్న వేతనం కేవలం రూ.26.15. పురుషులకు రూ.39.95 దక్కుతోంది. నిర్మాణరంగ కంపెనీల సీఈవోలుగా బ్రిటన్లో 14శాతం మంది మహిళలున్నారు. అమెరికాలో 7శాతం, భారత్లో కేవలం 2శాతంగా ఉంది. మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. వివిధ పరిశ్రమల్లో కార్పొరేట్ బోర్డుల్లో మహిళల ప్రాతినిథ్యం 17.3శాతానికి పరిమితమైంది. ఇది నిర్మాణరంగంలో మరింత తక్కువగా నమోదైంది. అత్యున్నతస్థాయి మేనేజ్మెంట్ స్థాయికి చేరుకునే మహిళల సంఖ్య 1 నుంచి 2శాతం ఉంది. దేశవ్యాప్తంగా లైసెన్స్ పొందిన ఆర్కిటెక్ట్ల్లో 47.6శాతం ఉన్నా, వారికి సమాన వేతనాలు అందటం లేదు. వేతనాల్లో తేడా 15శాతంపైగా ఉంది. సెమీ స్కిల్డ్, మిడ్ లెవల్ అయిన సైట్ సూపర్వైజర్స్, కాంట్రాక్టర్స్, సర్వేయర్స్, కార్పెంటర్స్, ప్లంబర్స్, పెయింటర్స్, మాసన్స్..ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉంది. బరువులు ఎత్తటం అనే పనిలోనే మహిళలకు ఉపాధి దక్కుతోంది. ఇటుక తయారీ, క్వారీ కార్మికురాలు, ఇండ్ల నిర్మాణం, లారీ లోడింగ్...మొదలైన వృత్తుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు. నిర్మాణరంగంలో ఉపాధి పొందిన మహిళల్లో 84శాతం మంది దినసరి కూలీలే.