Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని వర్గాల మహిళలను చేరుకుందాం - మనువాదాన్ని ఓడిద్దాం: ఐద్వా 13వ జాతీయ మహాసభలో కేరళ సీఎం విజయన్ పిలుపు
తిరువనంతపురం: మోడీది హిట్లర్ వ్యూహమనీ, మతోన్మాదం కార్పొరేటు అనుబంధాన్ని ప్రతిఘటిద్దామని కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు.ఐద్వా బహిరంగ సభకు నూతనంగా అధ్యక్షురాలిగా ఎన్నికైన పి.కె.శ్రీమతి అధ్యక్షత వహించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ మహిళలపై హింస పెరుగుతున్నా ఆ దోషులను కాపాడే సంస్కతి మన దేశంలో ఉన్నదనీ, అలాంటి పితృస్వామ్య సమాజాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధికార ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని తన ప్రారంభోపన్యాసంలో అన్నారు. 'సమానత్వం కోసం ఐక్యంగా పోరాడదాం' అనే నినాదంతో ఐద్వా మహాసభలు జరుగుతుంటే దీనికి వ్యతిరేకంగా ప్రజలను విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మహిళల భద్రత, లింగ సమానత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. బిల్కిస్ బాను కేసులో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ణయిస్తూ ఒక వర్గం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మైనారిటీలను, కమ్యూనిస్టులను అంత మొందించాలన్న హిట్లర్ వ్యూహాన్ని ఇక్కడ ఆర్ఎస్ఎస్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఈ విభజన రాజకీయాలు కేరళలో సాగనివ్వబోమని కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ విధమైన వైఖరిని తీసుకున్నదని అన్నారు. మహాసభలో చర్చించిన ప్రతి అంశాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. మహాసభలో ఎక్కువగా చర్చకు వచ్చిన కేరళ నమూ నాను ఆయన క్లుప్తంగా వివరించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని నియంత్రించ డానికి కేరళ ప్రత్యామ్నాయ నమూనాలను అవలంబిస్తోంది. సంక్షేమ పథకాలను ప్రభుత్వం స్వచ్ఛంధంగా కాకుండా ప్రజల హక్కుగా చూస్తోంది. మహిళల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. జెండర్ బడ్జెట్ను అమలు చేసే రాష్ట్రం కేరళ అని, నవ కేరళం (న్యూ కేరళ) మా లక్ష్యం అని ఆయన అన్నారు.
మనువాద విధానాలను మహిళలు తిప్పికొడతారు...
ఐద్వా పూర్వ జాతీయ కార్యదర్శి బృందా కారత్ మాట్లాడుతూ హింసకు గురవుతున్న మహిళలను సైతం ఛీత్కరించే బీజేపీ నేతలు ఉన్న దేశంలో విక్టిమ్ షేమింగ్ అంటే ఏమిటో ఒక ముఖ్యమంత్రి లోతుగా అర్థం చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. దానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వ తన వైఖరిని ప్రకటించండి. మహిళా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఐద్వా కట్టుబడి ఉందన్నారు. బీజేపీ మనువాద ఎజెండాలకు, పద్ధతులకు లొంగిపోవడానికి మహిళలు ఎప్పటికీ ఇష్టపడరు. సమానత్వం, ప్రజాస్వామ్యం, మహిళా విముక్తి వంటి విలువల కోసం పోరాడతామని ఆమె ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులైన పి.కె.శ్రీమతి, మరియం ధావలేతో కలిసి వేదికపై నుంచి ప్రతిజ్ఞ చేశారు. పి.కె. శ్రీమతి మాట్లాడుతూ సమానత్వం సాధించాలంటే ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఉండాలని అన్నారు. మతోన్మాద శక్తులపై పోరాటం ఉధృతం అయినప్పుడు మహిళలు ఆ పోరాటానికి అండగా నిలవాలని ఆమె కోరారు. మహిళా అనుకూల ప్రభుత్వంగా వున్న కేరళ మోడల్ దేశంలోని ప్రతిచోటా అనుకరించవచ్చని జనరల్ సెక్రెటరీ మరియం ధావలే అన్నారు. అన్ని వర్గాల మహిళలకు పోరాట సందేశాన్ని అందించడం, మనువాద ఎజెండాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడం, మత-కార్పొరేట్ బంధాన్ని ప్రతిఘటించడం వంటి నినాదాలు ఈ మహాసభల ద్వారా లేవనెత్తుతున్నాయని ఆమె తెలిపారు.