Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ముగింపు సభకు పోటెత్తిన మహిళలు
- కిక్కిరిసిన సభా ప్రాంగణం
తిరువనంతపురం: నారీలోకం కదిలింది. సమానత్వ సాధనే లక్ష్యమని నినదించింది. వర్షపు చినుకులు వంకలై, వాగులై, నదులై సముద్రంలో కలిసినట్టు ఎక్కడికక్కడ చిన్న, చిన్న బందాలుగా బయలుదేరిన మహిళలు ఐద్వా జాతీయ మహాసభ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు పోటెత్తారు. దీంతో బహిరంగ సభ జరిగిన మల్లు స్వరాజ్యం నగర్ (పుత్తరి కండం మైదానం) నారీ జన సముద్రంగా కనిపించింది. విద్యార్థులు, యువతులు, దినసరి కూలీలు, ఉద్యోగులు, గృహిణిలు ఇలా వివిధ తరగతులకు చెందిన మహిళలు బహిరంగసభలో భాగస్వాములయ్యారు. ఐద్వా జెండాలు ప్రదర్శిస్తూ మనువాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హౌరెత్తింది. మతోన్మాదాన్ని ఓడించడం ద్వారానే సమానత్వం సాధ్యమవుతుందని, ఈ లక్ష్య సాధనకు సంఘటిత పోరు చేయాలని ముఖ్యఅతిధిగా హాజరైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం నుంచే తిరువనంతపురం నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. అన్ని వార్డుల్లోనూ ఉదయాన్నే పతాకావిష్కరణలు చేశారు. ఆ ప్రాంతంలోని మహిళలందరు అక్కడికే చేరుకుని ప్రదర్శనగా మహాసభ ప్రాంగణానికి బయలుదేరారు. నగరంలోని అన్ని నివాస ప్రాంతాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలు జరిగాయి. కేరళ సాంప్రదాయ రీతులను ప్రదర్శిస్తూ కళా రూపాలుగా ఈ ప్రదర్శనలు సాగాయి. ఆయుర్వేద కళాశాల నుండి ప్రారంభమైన ఒక ప్రదర్శనలో తెల్లటి డ్రస్సుపై ఎర్రటి కోటు ధరించిన 13 మంది మహిళలు సాంప్రదాయ డ్రమ్ములు వాయిస్తూ కనిపించారు. మరో 13 మంది యువతులు ఐద్వా జెండాలను ప్రదర్శిస్తూ మార్చ్ ఫాస్ట్ చేశారు. 13వ మహాసభకు గుర్తుగా వారు ఈ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఇటువంటి దశ్యాలే తిరువనంతపురం నగరమంతా కనిపించాయి. ముగింపు సభలో లక్షమంది మహిళలు భాగస్వాములైనట్లు ఐద్వా ప్రకటించింది.