Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు దశాబ్దాల్లో 50కిపైగా బదిలీలు
న్యూఢిల్లీ : నిజాయితీ, నిబద్ధతకు మారు పేరుగా నిలిచిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై మళ్లీ బదిలీ వేటు పడింది. హర్యానా ప్రభుత్వం ఆయన్ని అంతగా ప్రాధాన్యం లేని శాఖకు అదనపు చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో సైన్స్, టెక్నాలజీ శాఖ అదనపు సీఎస్‌గా అశోక్ ఖేమ్కాకు బాధ్యతలు అప్పగించింది. కనీసం అక్కడ మూడు నెలలు కూడా విధులు నిర్వర్తించకుండానే ఆయనపై బదిలీ వేటు వేయటం చర్చనీయాంశమైంది. ఐఏఎస్ అధికారిగా అశోక్ ఖేమ్కా గత మూడు దశాబ్దాల్లో 50 సార్లకుపైగా బదిలీలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఆయన వ్యవహారశైలి స్థానిక రాజకీయ నాయకులకు మింగుడు పడక పోవటం, రాజకీయ, ప్రభుత్వ అవినీతిని సహించకపోవటం వల్లే తరుచూ ఆయన బదిలీల బారిన పడుతున్నారని సమాచారం. అశోక్ ఖేమ్కాతోపాటు మరో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను హర్యానా ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. సాధారణ పరిపాలనలో భాగంగానే అధికారులను బదిలీ చేసినట్టు తెలిపింది.